ఎసిడిటీ పోవాలంటే...

05-02-2018: ఆవురావురుమంటూ ఆకలి... కనబడిందల్లా తినేయాలన్న కసి...కానీ, తినాలంటే భయం...ఎందుకంటే... తినీ తినగానే కడుపు ఉబ్బరం, తేన్పులు, కడుపంతా గుడగుడలుశ్రీ వాటన్నిటినీ తలుచుకుంటే ఎందుకులే తినడం అనిపిస్తుంది. అలాగని పస్తులు ఉండిపోలేరు కదా! అందుకే తినా లేక, ఆగనూ లేక నానా అవస్థలూ పడుతుంటారు ఎసిడిటీ వ్యాధిగ్రస్థులు. ఎందుకిలా అవుతుంది? యాంటాసిడ్‌ మాత్రలు ఎన్నాళ్లని వేసుకోవాలి? ఏం వేసుకున్నా శాశ్వతంగా పోతుందన్న భరోసా ఏవీ ఇవ్వడం లేదు ఎందుకని?

ఆహారం జీర్ణం కావడానికి సహజంగా మన దేహంలో తయారయ్యే యాసిడ్స్‌, ఎంజైమ్స్‌ ఈ రెండూ ముఖ్యమే. కాకపోతే, ఈ రెండూ జీర్ణప్రక్రియకు కావలసిన నిష్పత్తిలో ఉండాలి. అలా లేనప్పుడు యాసిడ్‌ అధికమవుతుంది. ఈ స్థితిలో జీర్ణాశయంలోని ఆమ్ల ప్రభావాన్ని తటస్థం చేయడానికి యాంటాసిడ్‌ ఔషధాలు వాడటం సర్వసాధారణం. యాంటాసిడ్‌ ఔషధాలు క్షార (ఆల్కలీన్‌) ద్రవ్యాలు కాబట్టి అవి జీర్ణాశయంలో మోతాదును మించిన ఆమ్లాన్ని విరిచి, సమస్యను పరిష్కరిస్తాయని చాలా మంది నమ్మకం. అందుకే యాసిడ్స్‌ను విరిచేసి ఎంజైమ్స్‌ని సమతూకంలో ఉంచగలవని, యాంటాసిడ్‌ ఔషధాలు వాడటానికి చాలా మంది సంసిద్ధమవుతారు. జీర్ణవ్యవస్థలో యాసిడ్‌ అధిక మోతాదులో ఉండటానికి గల కారణాలను నిర్ధారించకుండా, యాసిడ్‌ను విరిచే క్షార ద్రవ్యాలను ప్రతిరోజూ అలా దీర్ఘకాలికంగా వాడుతూ ఉంటారు. రసాయనికంగా ఇలా యాసిడ్‌ను విరచడం వల్ల దేహం యాసిడ్‌ను అధికంగా ఉత్పత్తి చేసి, జీర్ణవ్యవస్థలోకి విడుదల చేయవచ్చు. కాకపోతే ఈ విధానం వల్ల సమస్య మళ్లీ మొదటికి వస్తుంది.

యాంటాసిడ్‌గా వాడే రెండవ ముఖ్యమైన పదార్థం సోడియం బైకార్బొనేట్‌. ఇది వంటకాల్లో వాడే సోడా ఉప్పు. దీన్ని దీర్ఘకాలికంగా వాడితే, దేహంలో యాసిడ్‌ ఉత్పత్తి, విడుదల ప్రక్రియలను అతలాకుతలం చేస్తుంది. మూత్రపిండ వ్యాధులతో బాధపడే వారిలో ఇది కిడ్నీ స్టోన్స్‌ను ఉత్పత్తి చేస్తుంది. వైద్యపరంగా ఉప్పు తక్కువ తినవలసిన అవసరం ఉన్నవారికి, అల్సర్లు, లివర్‌ సమస్యలు ఉన్నవారికి పరిస్థితిని ఇంకా విషమించేట్లు చేస్తుంది.

మెగ్నీషియం సాల్ట్సు, అల్యూమినియం సాల్ట్సు అనేవి ఎసిడిటీకి విరుగుడుగా వాడే మూడవ రకం రసాయనాలు. ఇవి కూడా మూత్రపిండాలను కుంటుపరిచేవే! వీటివల్ల ఎముకల్లోని క్యాల్షియం క్షీణించవచ్చు. మెదడు తినవచ్చు. నిజానికి యాంటాసిడ్‌ ఔషఽధాలను వ్యాధి తీవ్రతను తగ్గించడానికి తప్ప వాడకూడదు. ఎసిడిటీని ఇవి ఎప్పుడూ శాశ్వతంగా నయం చేయలేవు.

మూలికా ఔషధాలు

జీర్ణాశయంలోనికి యాసిడ్‌ మితిమీరి వచ్చి చేరినా, ఆ యాసిడ్‌ను సమతూకంలో ఉంచగలిగినంత మోతాదులో ఎంజైమ్స్‌ జీర్ణవ్యవస్థలోకి విడుదల కాకపోయినా ఎసిడిటీ మొదలవుతుందనేది స్పష్టం. ఈ రెండు సందర్భాల్లోనూ ఎంజైమ్స్‌ ఉత్పత్తినీ, విడుదలనూ అధికం చేయగలిగితే కొంత ప్రయోజనం ఉంటుంది. జీర్ణ ప్రక్రియకు తప్పనిసరైన ఎంజైమ్స్‌ను ఉత్పత్తి చేసి, జీర్ణవ్యవస్థకు విడుదల చేసే గ్రంధుల్లో ప్యాంక్రియాస్‌ ప్రధానమైనది. ఇది పిండి పదార్థాలు, కొవ్వు పదార్థాలు, వృక్ష సంబంధమైన పీచుపదార్థాలు, మాంసకృత్తులు, పంచదార జీర్ణం కావడానికి అవసరమైన పలురకాల హార్మోన్లను ఉత్పత్తి చేసి జీర్ణవాహికకు విడుదల చేస్తుంది. ఈ హార్మోన్లు లేకపోతే, ఆహారం చిన్న పేగులో జీర్ణం కాకుండానే పెద్ద పేగులోకి వెళుతుంది. అది అక్కడ పులవడం, కుళ్లడం, అపాన వాయువు ఉత్పత్తి కావడం, పొట్ట ఉబ్బడం, నొప్పి కలగడం వంటివి జరుగుతాయి.
 
నివారణ మార్గాలు
ఎసిడిటికి పరిష్కారంగా అమోఘమైనది బొప్పాయి కాయ. పచ్చి బొప్పాయి కాయ పొట్టు తీసి ముక్కలుగా తరిగి, క్యారెట్‌, బీట్‌రూట్‌, దోసకాయ, ఉల్లిపాయ ముక్కలతో చేసిన సలాడ్‌ను భోజనానికి అరగంట ముందు తీసుకుంటే ఆహారం తీసుకునే సమయానికి యాసిడ్స్‌, ఎంజైమ్స్‌ సమతూకంలో జీర్ణవాహికకు అందుతాయి. దీనికి తోడు ఉసిరి, శతావరి, అతిమధురం, అల్లం, వాము, సోంపు, విలాయతి సోంపు, నేల వేముల మిశ్రమాలను క్యాప్సూల్స్‌గా గానీ, డికాక్షన్‌గా గానీ, టింక్చర్‌గా గానీ వాడవచ్చు.

వైద్య చికిత్సలు

ఆమ్లమూ, ఎంజైమ్స్‌ సరైన నిష్పత్తిలో జీర్ణవాహికకు అందడమే ఎసిడిటీకి సరైన, శాశ్వతమైన పరిష్కారం. ఇందుకు గాను మూలికా వైద్యం, గ్రంఽథుల్లో ఎంజైమ్ప్‌ ఉత్పత్తిని ప్రోత్సహించే మూలికలను వాడుతుంది. ఈ మూలికలు వృక్షసంబంధమైన ద్రవ్యాలు కాబట్టి దేహం వీటిని సులభంగానే జీర్ణించుకుంటుంది. ఎసిడిటీ పూర్తిగా నయం కావడానికి, ఆహారం సాఫీగా జీర్ణం కావడానికి ప్రేరకాలైన ఆహార పదార్థాలను మూలికలను తరుచూ వాడుతూ ఉండడం చాలా అవసరం.
డాక్టర్‌ జి. లక్ష్మణ రావు
మూలికా వైద్యులు
ఆస్ట్రేలియన్‌ హెర్బల్‌ క్లినిక్‌,
హైదరాబాద్‌