మనశ్శాంతి లేకుండా చేసే గ్యాస్‌ ట్రబుల్‌

13-06-2018: క్రమ పద్ధతి పాటించకుండా ఎప్పుడు పడితే అప్పుడు ఆహారాన్ని సేవించడం వల్ల ఈ సమస్య ఉద్భవిస్తుంటుంది. హితముగా, మితముగా సమయానికి సరిగ్గా ఆహారం తీసుకునే వారిలో ఈ సమస్య పెద్దగా కనిపిచందని వైద్యనిపుణులు అంటున్నారు. మసాలాలు అధికంగా ఉన్న ఆహార పదార్థాలను సేవించడం వల్ల, జంక్‌ ఫుడ్‌ అధికంగా తినేవారిలోనూ గ్యాస్‌ ట్రబుల్‌ అధికంగా ఉన్నట్లు గుర్తించారు. తినే ఆహారపదార్థాలు సరిగ్గా జీర్ణం కాక గ్యాస్‌ ట్రబుల్‌ మనశ్శాంతి లేకుండా చేస్తుంది. ఈ సమస్యకు ఆయుర్వేద వైద్యంలోనూ అద్భుమైన పరిష్కార మార్గాలున్నాయి.

 
విధానం - 1
కావాల్సిన పదార్ధాలు- తమలపాకులు, అల్లం, ఇంగువ, సైంధవ లవణం
తయారు చేసుకునే విధానం - తమలపాకు 20 మిల్లీలీటర్ల ప్రమాణంలో రసంగా తయారు చేసుకోవాలి. ఈ రసానికి 20 మిల్లీ లీటర్ల అల్లం రసం కలుపుకోవాలి. ఈ రెండు రసాలను బాగా కలుపుకోవాలి. దీనికి చిటికెడు ఇంగువ, చిటికెడు సైంధవ లవణం కలుపుకోవాలి. ఈ రసాన్ని స్వ చ్ఛమైన నీటితో కలుపుకోవాలి. గ్యాస్‌ట్రబుల్‌ అధికంగా ఉన్నవారు రోజూ రెండు గ్లాసుల నీటిని ఉదయం సాయంత్రం తీసుకుంటే ఈ సమస్య నుంచి విముక్తి లభిస్తుంది.
 
విధానం - 2
కావాల్సిన పదార్ధాలు- మెంతులు, జీలకర్ర, సైంధవ లవణం.
తయారు చేసుకునే విధానం - 200 మిల్లీలీటర్ల మజ్జిగలో నెయ్యిలో వేయించిన అరచెంచాడు మెంతులు తీసుకుని పొడిగా చేసుకుని కలుపుకోవాలి. దీనికి ఒక చెంచా జీలకర్ర, ఒకటి లేదా రెండు చిటికెడు సైంధవ లవణాన్ని కలపుకోవాలి. రోజుకు రెండు సార్లు ఈ మజ్జిగను తీసుకుంటే గ్యాస్‌ సమస్య నుంచి ఉపశమనం కలిగిస్తుంది.
 
మెంతుల్లో పీచు పదార్థం సమృద్ధిగా ఉంటుంది. వంటల్లోనూ సాధ్యమైనంతవరకు మెంతులను వినియోగిస్తే చాలా మంచిది. దీని వల్ల మధుమేహం, కొలెస్ట్రాల్‌, హైబీపీ, స్థూలకాయం వంటి సమస్యలను దరిచేరనీయదు.
 
నెయ్యిలో పిడికెడు మెంతులు బాగా రోస్ట్‌ చేసుకుని పొడిగా చేసుకుని నీరు లేదా లేదా మజ్జిగలో కలుపుకుని భోజనం మధ్యలో తాగితే ఆహారం నుంచి విడుదలయ్యే షుగర్‌ ప్రమాణాన్ని గణనీయంగా నియంత్రిస్తుంది. పైగా రక్తనాళాల్లో బ్లాకేజీలు లేకుండా చేస్తుంది. చేదుగా ఉన్నా మెంతులు చేసే మేలు చాలా గొప్పది.