అమీబియాసిస్‌ను ఆపలేమా?

13-09-2017: కొన్నాళ్లుగా వేధిస్తున్న జిగట విరేచనాల కారణంగా ఇటీవల ఒక డాక్టర్‌ను సంప్రదిస్తే, నాకు అమీబియాసిస్‌ ఉన్నట్లు తేల్చేశాడు. ఈ సమస్యతో బాధపడుతున్న కొంత మంది మిత్రుల బాధలు నాకు తెలుసు. అసలే పని ఒత్తిళ్లతో సతమతమవుతున్న నాకు ఈ అమీబియాసిస్‌ కూడా తోడైతే, ఈ మార్కెటింగ్‌ రంగంలో నేను రాణించడం చాలా కష్టం. శుభ్రత విషయంలో నేను పెద్దగా నిర్లక్ష్యం వ హించింది కూడా ఏమీ లేదు. నాకీ సమస్య ఎందుకొచ్చిందంటారు? అసలు ఈ సమస్యను అధిగమించే అవకాశాలు ఏమైనా ఉంటే తెలియచేయండి.
                                                                                                                                                                                                  - ఎస్‌. కమల్‌ కుమార్‌, నెల్లూరు
 
పేగుల్లో ఏర్పడే అమీబిస్‌ ఇన్‌ఫెక్షన్లతో వచ్చే సమస్యనే అమీబియాసిస్‌ అంటారు. ఈ వ్యాధి ‘ఎంటామీబా హిస్టాలికా’ అనే ఒక సూక్ష్మక్రిమి ద్వారా వస్తుంది. ఈ సమస్యకు ప్రధాన కారణం అపరిశుభ్రతే. ప్రాథమికంగా, మనం తీసుకునే కలుషిత ఆహార పానీయాల ద్వారా ఈ అమీబా క్రిములు కడుపులోకి, అక్కడి నుంచి చిన్న పేవులు, ఆ తర్వాత పెద్ద పేవుల్లోకి చేరుకుంటాయి. ఆ తర్వాత ఈ క్రిములు పెద్ద పేగుల గోడల్లో తిష్టవేసి, పుండును తయారు చేస్తాయి. ఆ తర్వాత ఆ పుండునే నివాసంగా చేసుకుని, ఈ అమీబా క్రిములు విపరీతంగా వృద్ధి చెందడం మొదలెడతాయి. పుండులో తయారయ్యే కొత్త క్రిములు ఎప్పటికప్పుడు మనం వదిలే మలం ద్వారా ఇతరుల శరీరాల్లోకి ప్రవేశించడానికి సిద్ధంగా ఉంటాయి.
 
కారణాల్లో....
రోడ్డు పక్కన అమ్మే ఆహార పదార్థాల్ని తినడం వల్ల అమీబియాసిస్‌ సోకే అవకాశాలు చాలా ఎక్కువ. దానికి కారణం ఆ పదార్థాల తయారీలో పరిశుభ్రత పాటించకపోవడమే. ఆ వ్యాపారుల గోళ్లు బాగా పెరిగి ఉంటే, ఆ గోళ్ల కింద మట్టి పేరుకుంటుంది. ఆ మట్టిలోనే అమీబా గుడ్లు పెడుతుంది. ఆ చేతులతో ఇచ్చే ఆహార పదార్థాల ద్వారా వాటిని తీసుకునే వాళ్లకు సోకుతుంది. ఏ ఆహార పదార్థాన్నయినా ఉడి కించినప్పుడే అందులోని అమీబాలు నాశనమవుతాయి. అయితే చట్నీల కోసం వాడే కూరగాయల్ని కొందరు ఉడికించరు. ఉడికించకుండా ఇలా తయారు చేసే చట్నీల ద్వారా అమీబాలు చాలా తేలికగా శరీరంలోకి ప్రవేశిస్తాయి.

పరిశుభ్రంగా ఉన్నాయా లేదా అని చూడకుండా, ప్రయాణాల్లో చాలా మంది ఎక్కడబడితే అక్కడ నీళ్లు తాగుతుంటారు. ఇది కూడా అమీబియాసిస్‌కు దారితీస్తుంది. పేవుల్లో ఉండే అమీబా జీవులు రక్తం ద్వారా కాలేయానికి చేరుకుంటాయి. వెంటనే సరియైున చికిత్స అందకపోతే, కాలేయానికి కురుపు ఏర్పడవచ్చు. అరుదుగానే అయినా అమీబా శ్వాసకోశ ఇన్‌ఫెక్షన్లకు కూడా దారితీయవచ్చు. ఫలితంగా ఊపిరితిత్తుల్లో కూడా కురుపు ఏర్పడవచ్చు. మరికొన్ని సార్లు గుండె పై భాగానికి, మెదడుకు, వెన్నెముకకూ సోకి మెనెంజైటిస్‌ సమస్య తలెత్తవచ్చు.

అందుకే వెంటనే మలపరీక్ష చేయించి అమీబియాసిస్‌ ఉన్నట్లు తేలితే ఏ మాత్రం జాప్యం చేయకుండా వైద్య చికిత్సలు తీసుకోవడం చాలా అవసరం. ఇటీవల వచ్చిన కొన్ని కొత్త రకం మందుల అమీబియాసి్‌సను సమూలంగా తొలగించగలుగుతున్నాయి. అందువల్ల మీరేమీ ఆందోళన చెందాల్సిన అవసరం లేదు.
                                                                                                                                                                      - డాక్టర్‌ జి. ప్రవీణ్‌, కన్సల్టెంట్‌ గ్యాస్ట్రో ఎంటరాలజిస్ట్‌