నిలువెల్లా ఈ మంటేమిటి?

01-06-2018: నా వయసు 43. దాదాపు ఏడాదిగా శరీరమంతా మంటగా ఉంటోంది. పాదాల నుంచి మొదలుకుని, క్రమంగా తొడలు, నడుము, మెడలు, వీపు, చేతులు అలా నిలువెల్లా మంటగానే ఉంటాయి. న్యూరోఫిజిషియన్‌ రాసిన మందులు వాడితే, కొద్దిరోజులు తగ్గినట్లే తగ్గి మళ్లీ మొదలయ్యాయి. మరో డాక్టర్‌ను సంప్రదిస్తే, కొలెస్ట్రాల్‌, యూరిక్‌ యాసిడ్‌ పరీక్షలు చేయించాడు. రిపోర్టులన్నీ నార్మల్‌ అనే వచ్చాయి. నా సమస్య మాత్రం అలాగే ఉంది. ఈ సమస్య నుంచి పూర్తిగా విముక్తి పొందే మార్గం చెప్పండి.
- జాన్సన్‌, రాజమండ్రి
 
 
నరాల మీది పొర దెబ్బతినే ఈ వ్యాధిని ‘న్యూరోలేమా’ అంటారు. ఆహారపరమైన లోపాలే ఈ సమస్యకు ప్రధాన కారణంగా ఉంటాయి. సరియైున వేళకు భోజం చేయకపోవడంతో పాటు, ఉప్పు, మసాలాలు, పచ్చళ్లు అతిగా తినడం కూడా ఇందుకు కారణమే. తేన్పులు, కడుపు ఉబ్బరం ఎక్కువగా ఉండేవారిలో ఈ సమస్యలు ఎక్కువగా కనిపిస్తాయి. కాకపోతే మధ్యవయస్కులే ఈ సమస్యకు ఎక్కువగా గురవుతుంటారు. అయితే, పైత్యాన్ని తగ్గించి, నరాల శక్తిని పెంచే చికిత్సలు ఈ సమస్య నివారణలో ఉపయోగపడతాయి. వైద్య చికిత్సగా సీతాఫలాది చూర్ణాన్ని, ఉదయం ఒక చెంచా, సాయంత్రం ఒక చెంచా చొప్పున పాలతో తీసుకోవాలి. దీనితో పాటు అశ్వగంధ చూర్ణాన్ని కూడా ఉదయం ఒక చెంచా, రాత్రి ఒక చెంచా, చొప్పున పాలతోనే తీసుకోవాలి. మంటలు తగ్గడానికి తైల మర్ధన కూడా అవసరం. దానికి పిండ తైలం ఎంతో శ్రేష్టం. ఆహారంలో సొరకాయ, గుమ్మడికాయ, చిక్కుడు దాన్యాలు, పండ్లు తరుచూ తీసుకోవాలి. వంకాయ, పులుపు పదార్థాలు తగ్గించాలి. నీరు ఎక్కువగా తాగాలి. నిద్రా సమయం తగ్గకుండా చూసుకోవడం కూడా అవసరమే. బియ్యపు తవుడులో మంటలను తగ్గించే బి-1 విటమిన్‌ ఉంటుంది. అందువల్ల దంపుడు బియ్యం వాడటం మరీ మంచిది. అలాగే తవుడుతో తయారు చేసే రైస్‌బ్రాన్‌ నూనె వాడటం వల్ల కూడా ప్రయోజనం ఉంటుంది. ఈ విధానాలు పాటిస్తే, కొద్ది రోజుల్లోనే మీ సమస్య తగ్గుముఖం పడుతుంది.
- డాక్టర్‌ డి.విఠల్‌ రావు
ఆయుర్వేద నిపుణులు, శక్తి ఆయుర్వేద క్లినిక్‌, హైదరాబాద్‌