శరీరంలో నీటి ప్రాముఖ్యం ఎంత?

ఆంధ్రజ్యోతి, 24/08/2014: మన శరీరం జీవించాలంటే జీవనాధారాలు మూడు. మొదటి అవసరం ప్రాణవాయువు, రెండవ అససరం నీరు, మూడవ అవసరం ఆహారం. ప్రాణ వాయువు అందకపోతే మనం కొన్ని క్షణాల్లోనే మరణిస్తాం కాబట్టే ఇది మొదటి అవసరం. నీరు అందకపోతే మనం కొన్ని రోజుల్లో గానీ మరణించం కాబట్టే నీరు రెండవ స్థానాన్ని శరీరంలో కలిగి ఉంది. ఆహారం అందకపోతే మనం కొన్ని నెలల్లో గానీ మరణించం కాబట్టి ఆహారానికి ఈ శరీరంలో ఆ రెండింటి కంటే తక్కువ అవసరం ఉందని తెలుస్తుంది.
 
ఈ నగ్న సత్యాన్ని గుర్తించి శరీర అవసరాలను తగిన విధంగా తీరిస్తే మనిషి ఆరోగ్యం ఎందుకు చెడిపోతుంది. ఆరోగ్యం దెబ్బతింటున్నదీ అంటే, మనం ఎక్కడో తె లియకుండా తప్పు చేస్తున్నాం. ఆ తప్పు మనిషికి మాత్రం చాలా చిన్నదిగా కనిపిస్తున్నది. అందుకే పట్టించుకోవడం లేదు. అది శరీరానికి మాత్రం చాలా పెద్ద పొరపాటు. అదేమిటంటే మన శరీరానికి మొదటి అవసరం విషయంలో ఎవరూ తప్పు చేయడం లేదు. తప్పు చేస్తున్నదల్లా రెండు, మూడు అవసరాలలోనే. నీరు ఈ శరీరంలో 70 శాతం ఆక్రమించి ఉంది. మిగతా 30 శాతం పదార్దం. పదార్థం 30 శాతమంటే కండరాలు, నరాలు, ఎముకలు మొదలగునవి.
 
ఈ ప్రకృతిలో మూడు వంతులు నీరు, ఒక వంతు భూమి ఉన్నట్లుగానే మనలో కూడా మూడువంతుల నీరు, ఒక వంతు పదార్థం ఉంది. ఈ సత్యాన్ని బట్టి మనం ప్రతిరోజూ నీటికి మూడు వంతులు ఇచ్చి, ఆహారానికి ఒక వంతు మాత్రమే ప్రాధాన్యాన్ని ఇవ్వాలి. కాని మనం దాన్ని తారుమారు చేశాం. మీరు చేశామని ఎందుకొప్పుకుంటారు. మనం ప్రతిరోజూ చేసేదేమిటంటే, 70 శాతం ఆహారం తిని 30 శాతం నీరు తాగుతున్నాం. కాదంటారా? అలా అయితే రోజులో మీ లోపలకు ఆహారం ఎక్కువ వెళుతున్నదా? లేదా నీరు ఎక్కువ మోతాదులో వెళుతున్నదా పరిశీలన చేయండి. ఇప్పుడు అందరూ ఒప్పుకుంటారు. ఇలా కనీస అవసరాలను ఎందుకు తారుమారు చేస్తున్నామంటారు. నాకు తెలిసి ఒకటే కారణం. అది ఏమిటంటే తింటే రుచి వస్తుంది. తాగితే ఏమి వస్తుంది? ఒంటేలు తప్ప! అందుకని రెండవ అవసరమైన నీటిని మూడవ అవసరంగా మార్చి, ఆహారాన్ని రెండవ అవసరంగా మార్చి జీవనయానం సాగిస్తున్నాం. శరీర అవసరాలనే తారుమారు చేస్తే మనకు ఆరోగ్యం ఎలా వస్తుందో చెప్పండి? నీరు తాగితే ఆరోగ్యం అని మరచి, తింటేనే ఆరోగ్యం అని ఎక్కువ తింటున్నాం. ఉదాహరణకు ప్రతి ఇంట్లో తల్లి గానీ, భార్య గానీ, నీటికంటే తిండికి ప్రాముఖ్యతనిస్తూ ఇలా అంటూ ఉంటారు. ఏవండీ! ఇంకొంచెం పెట్టుకోండి. ఇంకొక ఇడ్లీ తినమ్మా బలం వస్తుంది. స్కూలుకెళ్లే పిల్లవాడు ఆత్రంగా గ్లాసుతో నీళ్లు తాగుతుంటే, ఇక తాగింది చాల్లే ఈ పాలు తాగు అని నోటిలోని గ్లాసుని లాగేసుకుంటారు. ఈ రోజు తిన్నది ఇంకా అరగదు. ఏవండీ! రేపు ఏమి కూర వండమంటారని భర్తను అడుగుతారు. ఈ విధంగా తిండికి ప్రాధాన్యం ఇచ్చి రకరకాలు వండి పెడుతూ ఉంటారు. నీటిని శరీరానికి రెండవ అవసరంగా గుర్తించి మనం జీవిస్తూ ఉంటే మనందరి నోట ఎలాంటి మాటలు రావాలో తెలుసా? ఏవండీ ఈ కాసిని నీళ్లు తాగేయడి,. ఇంకొంచెం నీళ్లు పోయనా? ఈ రోజు ఎన్ని నీళ్లు తాగారండీ! ఇలాంటి మాటలు మన ఇళ్లల్లో వినపడాలి. మనం జీవించాలంటే ఆహారం కూడా చాలా ముఖ్యమే కానీ నీరంత ముఖ్యం కాదని గ్రహించి ప్రతిరోజు అలానే మనం గడపాలి.
 
ఎంత నీరు తాగాలి? 
నీరు తాగే విషయంలో ఎవరికి తోచినన్ని, ఎవరికి కుదిరినన్ని వారు తాగుతున్నారే తప్ప శరీర ధర్మాలను, నీటి అవసరాన్ని దృష్టిలో ఉంచుకొని నీటిని తాగటం లేదు. ఈ అవసరాలను దృష్టిలో ఉంచుకొని మనం ఎన్ని తాగితే బాగుంటుందో ఆలోచిద్దాం. వైద్యులు చెప్పేది అయితే, ఎంత నీరు రోజుకు ఖర్చు అవుతున్నదో అంత తాగితే సరిపోతుందని.
 
ఊపిరితిత్తుల ద్వారా, చెమట ద్వారా, మలమూత్రాల ద్వారా రోజుకు రెండున్నర లీటర్ల నీరు ఖర్చు అవుతుంది. అందుచేత 2 నుంచి రెండున్నర లీటర్ల నీరు ప్రతిరోజు తాగితే సరిపోతుందని చెబుతారు. ఈ లెక్కల ప్రకారంగా అది కరెక్టే. మనిషి కూడా లెక్క ప్రకారంగా, నియమంగా రోజు మొత్తంలో వండినవి తినకుండా పండ్లు, గింజలు, పచ్చి కూరలను తిని జీవిస్తే పైన చెప్పిన కొలత సరిపోతుంది కానీ మనం అలా కాకుండా ప్రకృతి విరుద్దంగా ఆహారాన్ని వార్చి, వేయించి, మాడ్చి వాటికి రకరకాల రుచులను కలుపుకొని తింటున్నాం. ఇలా మనం తింటున్న రుచులనే కాలుష్యాలను పూర్తిగా బయటకు గెంటడానికి, శరీరం కడుక్కోవడానికి 2 నుంచి రెండున్నర లీటర్ల నీరు సరిపోతుందా ఆలోచించండి. తప్పు చేస్తున్నాం కాబట్టి తప్పును సవరించడానికి ఎక్కువ నీటి ఖర్చు ఉంటుంది. వంటపాత్రలు మాడితే, బాగా అంటుకుపోతే వాటిని వదిలించడానికి ఎక్కువ సబ్బు, ఎక్కువ నీరు మామూలు కంటే పెరగడం లేదా! అలానే మన శరీరానికి కూడా నీటి అవసరం పెరుగుతుంది. నాకు తెలిసి ఈ రోజుల్లో మనిషికి నీరు అసలు చాలదు. శరీరానికి మనం తాగిన నీరు చాలకపోతే వచ్చే లక్షణాలు ఎలా ఉంటాయో ఇప్పుడు తెలుసుకుందాం.
 
శరీరంలో ఎప్పుడన్నా మీకు ఉడుగ్గా అనిపించినా లేదా వేడి చేసినట్లుగా అనిపించినా, నోరు, పెదాలు ఎండినట్లుగా ఉన్నా, మూత్రం చిక్కగా ఉన్నా, ఆ మూత్రం పచ్చగా మీ కంటికి కనిపించినా, మూత్రం పోశాక అంగం దగ్గర కొంచెం మంటగా అనిపించినా, మూత్రం పోశాక బాత్‌రూమ్‌ వాసన వచ్చినా, ఎండలోకి వెళ్లినపుడు చర్మం చుర్రుమన్నా, ఎండలో మాడు నొప్పి గానీ, పోటుగానీ వచ్చినా ఆ సమయంలో శరీరంలో నీరు అవసరాలకు సరిపడినంత లేదని శరీరం మీకు తెలియజేస్తుంది. ఈ లక్షణాలన్నీ పోయే వరకూ మీరు నీరు తాగి చూడండి. ఎంత నీరు తాగితే సరిపోతుందో మీకే తెలుస్తుంది. మా లెక్క ప్రకారం అయితే రోజుకు 4 నుంచి 5 లీటర్ల నీరు తాగితే గానీ ఈ లక్షణాలు పోవటం లేదు. ప్రకృతి ధర్మం, శరీర ధర్మం ప్రకారం ఆలోచిస్తే, ఆహారం, నీరు 1:3 అనే నిష్పత్తి ప్రకారం ఉండాలని తెలియజేస్తుంది. ఆహారం కంటే నీరు ఎక్కువగా కావాలని శరీరం కోరుతుంది. మనం ప్రతిరోజూ సుమారు రెండు కిలోల ఆహారంపైనే తప్పని సరిగా తింటూ ఉంటాం. అలా చూసినా 5 లీటర్ల నీరు ప్రతిరోజూ తాగాలి. మనలో ఉన్న 70 శాతం నీరు పరిశుభ్రంగా ఉండాలంటే రోజుకు 7,8 గ్లాసుల నీరు గానీ లేదా 2 లీటర్ల నీరు గానీ ఒక మూలకు రావు. ‘చరక సంహిత’ అనే ఆయుర్వేద గ్రంధంలో కూడా సూర్యోదయానికి ముందే రెండున్నర లీటర్ల నీటిని ( 8 దోసిళ్లు) తాగమని సుమారు మూడువేల సంవత్సరాల క్రితమే చెప్పారు. రేపటి నుంచి అయిదు లీటర్ల నీటిని తాగి చూడండి. మీ శరరం ఎలాంటి మంచి మార్పులను అందిస్తుందో మీకే తెలుస్తుంది. చిన్న పిల్లలకు (1-15 సంవత్సరాల లోపు) 1 లీటర్ల నుంచి 4 లీటర్ల వరకు వారి వయసును బట్టి తాగించండి. 16 సంవత్సరాల నంఉచి 60 సంవత్సరాల మధ్య వయసు వారు రోజు 5 లీటర్లు నీటిని తాగితే సరిపోతుంది. 60 సంవత్సరాలు పైబడిన వారు రోజుకు 4 లీటర్ల వరకూ తాగవచ్చు. మజ్జిగ, కొబ్బరినీళ్లు, కూల్‌డ్రింక్స్‌ మొదలగు వాటిలో ఉన్న నీటిని లెక్కవేయకండి. ఈ 5 లీటర్ల నీటిని ఎప్పుడు పడితే అప్పుడు తాగినా లేదా మొత్తం ఒకేసారి తాగితే తొందరగా పనై పోతుంది అని తాగినా లాభం కంటే నష్టమే ఎక్కువ ఉంటుంది. మన శరీరానికి నీరనేది పగటిపూట, పరగడుపున రెండు వేర్వేరు ప్రయోజనాల కోసం అవసరం. ఈ రెండు అవసరాలకు 5 లీటర్ల నీటిని విడగొట్టి తాగాలి. పరగడుపున రెండున్నర లీటర్లు, పగటిపూట రెండున్నర లీటర్లు తాగితే మంచిది. ఎండలో బాగా కష్టపడి పని చేసుకునే వారు, బాగా మలబద్దకం ఉన్న వారు రోజుకు 6 లీటర్ల వరకు కూడా నీటిని తాగవచ్చు. 6 లీటర్లకు మించి నీటిని తాగవద్దు. 

ఆరోగ్యానికి సంబంధించి డాక్టర్‌ మంతెన సత్యనారాయణరాజు ఉచిత సలహాల కోసం ప్రతి రోజు ఉదయం 7 నుంచి 10 గంటల వరకూ 9848021122కు కాల్‌ చేయవచ్చు.