తులసితో కఫానికి కట్టడి

22-07-2017: ప్రతి ఇంటా తులసి మొక్క ఉండాలనీ, ప్రతి రోజూ తులసి పూజ చేయాలనే ఆలోచన వెనుక భక్తి విషయం మాత్రమే లేదు. తులసిలో అనేక వ్యాధులను నయం చేస్తూ, సంపూర్ణ ఆరోగ్యాన్ని నిలబెట్టే అద్భుతమైన ఔషధ గుణాలున్నాయి. అయితే, తులసి కోసం ఎక్కడో వెతికే పని లేకుండా, ఇంట్లోనే పెంచడం ద్వారా ప్రతి రోజూ తులసి ఆకులను వినియోగించుకునే అవకాశం ఉంటుంది. అందుకే ఎక్కువ మంది ఇళ్లల్లో మనకు తులసి మొక్క దర్శనమిస్తుంది.
 
తులసి ఆకు రసాన్ని ఒక చెంచా తేనెతో కలిపి సేవిస్తే కఫంతో వచ్చే దగ్గు తగ్గిపోతుంది.
తులసి వేరునూ, శొంఠినీ సమతూకంలో తీసుకుని ఈ రెంటినీ మెత్తగా నూరి, కుంకుడు గింజ పరిమాణంలో మాత్రను తయారు చేసుకోవాలి. ఆ మాత్రల్ని ప్రతి రోజూ ఒకటి చొప్పున ఉదయాన్నే గోరు వెచ్చని నీటితో సేవిస్తే, చాల రకాల చర్మ వ్యాధులు తగ్గిపోతాయి.
తులసి, వెల్లుల్లిని నూరి, వాటి రసాల్ని చెవిలో వేస్తే చెవి పోటు తగ్గుతుంది.
ఒక చెంచా తులసి గింజలను ఒక కప్పు నీటిలో వేసి కాసేపు ఉంచి తాగితే, మూత్రం సాపీగా రావడంతో పాటు కాళ్ల వాపులు తగ్గుతాయి.
ప్రతి రోజూ నాలుగైదు తులసి ఆకులు నమిలి మింగితే మానసిక ఆందోళనలు కూడా చాలా వరకు తగ్గే అవకాశాలు ఉన్నాయని ఇటీవలి పరిశోధనల్లో వెల్లడయ్యింది.