ప్రోస్టేట్‌ గ్రంథికి ఏమన్నా అయితే....!

02-04-2018:రోజుకు నాలుగైదు లీటర్ల దాకా నీళ్లు తాగాలి. కానీ, ఆ తాగిన నీటిలో చాలా భాగం మూత్రం ద్వారా తిరిగి బయటికి వెళ్లిపోవాలి కదా! ఆ ప్రక్రియ సాఫీగా సాగిపోకుండా, తరచూ అంతరాయం ఏర్పడుతుంటే అప్పుడు ఏం చేయాలి? ప్రోస్టేట్‌ గ్రంథి వ్యాధిగ్రస్థమైనప్పుడు వచ్చే చిక్కే ఇది. ఇంతకీ ప్రోస్టేట్‌ గ్రంథి ఏమిటి? అది వ్యాధిగ్రస్థం కావడం ఏమిటి?

 
మనమంతా ప్రోస్టేట్‌గా పేర్కొనే గ్రంథి వాస్తవానికి అనేకమైన చిన్న చిన్న గ్రంథుల సమూహం. పురుషుల్లో మాత్రమే ఉండే ఈ గ్రంథి, మూత్రాశయానికి దిగువన, మూత్రనాళానికి చుట్టుకుని బాదం గింజంత పరిమాణంలో ఉంటుంది. నిజానికి, దేహ వ్యవస్థకు ప్రత్యేకించి ఆరోగ్యవ్యవస్థకు ఈ గ్రంథి ఎలా తోడ్పడుతుందో ఇప్పటికీ స్పష్టంగా తెలియదు. కాకపోతే, రేతస్సు ఉత్పత్తికీ, దాని విడుదలకూ ఒక వాహకంగా పనిచేస్తుంది.
 
అయితే మిగతా అవయవాలలా కాకుండా, ప్రోస్టేట్‌ గ్రంథిలోని పాత జీవకణాలు చనిపోయి, బహిష్కరించబడక ముందే వాటికన్నా అధిక సంఖ్యలో కొత్త కణాలు ఉత్పత్తి అవుతాయి. ఫలితంగా దాని పరిమాణం అతిగా పెరుగుతుంది. దేహ ఆరోగ్య వ్యవస్థకు విరుద్ధంగా ఈ ప్రక్రియ ఎందుకు జరుగుతుందో ఇప్పటికీ స్పష్టంగా తెలియదు. నిజంగానే ఎవరికైనా ఈ పరిస్థితి ఏర్పడినప్పుడు మూత్రాన్ని బయటికి నెట్టడానికి, మూత్రాశయం గట్టిగా ప్రయత్నిస్తుంది.
 
ఈ ప్రక్రియలో మూత్రాశయం గోడలు మందం కావడంతో పాటు గట్టిపడ తాయి. పర్యవసానంగా క్రమక్రమంగా మూత్రాశయం చిన్నదైపోయి, పదేపదే మూత్ర విసర్జన చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. విసర్జనలోని అంతరాయం వల్ల మూత్రం లోపలే నిలిచిపోతుంది. ఫలితంగా అందులోని వ్యర్థ, విషపదార్థాలు సూక్ష్మజీవుల ప్రభావంతో మూత్రాశయం కంపరానికి గురై, కందిపోయి నొప్పి మొదలవుతుంది.
 
ఈ క్రమంలో మూత్రాశయంతో పాటు మూత్రపిండాలూ వ్యాధిగ్రస్థమై రెండింటిలోనూ రాళ్లు ఏర్పడవచ్చు. సూక్ష్మ జీవుల వల్ల ప్రోస్టేట్‌ గ్రంథి వ్యాధిగ్రస్థమైనప్పుడు వాచి, కంది, గడ్డలు కట్టి, చీముపట్టి బాధలు, పోట్లు కలిగించవచ్చు. దీన్నే ప్రోస్టటైటిస్‌ అంటారు. ఈ వ్యాధికి వయసుతో నిమిత్తం లేదు. కొందరి ప్రోస్టేట్‌ గ్రంథిలో కేన్సర్‌ వ్యాధి సంభవించి, విషపూరిత కణాలు కుప్పతెప్పలుగా ఉత్పన్నం కావచ్చు. అందుకే ప్రోస్టేట్‌ సమస్యలతో బాధపడుతున్నవారు తమకున్న అసలు సమస్య ఏమిటో వైద్య పరీక్షల ద్వారా నిర్ధారించుకోవడం చాలా అవసరం.
 
కారణాల్లో కొన్ని.....
50 ఏళ్లకు పైబడిన పురుషుల్లో వివిధ కారణాల వల్ల వారి ప్రోస్టేట్‌ గ్రంథిలో డైహైడ్రో టెస్టోస్టిరాన్‌ అనే రసాయన సాంద్రత పెరుగుతుంది, దీనికి ప్రోస్టేట్‌ గ్రంధిలోని జీవకణాలను కుప్పతెప్పలుగా పెంచే గుణం ఉందని వైద్య శాస్త్రజ్ఞుల నమ్మకం. అయితే ఏ వయసులోనైనా మూత్ర విసర్జనకు సంబంధించి ఏ చిన్న సమస్యనైనా నిర్లక్ష్యం చేయడం ఆరోగ్యానికి హానికరం.
 
మూలికా వైద్యం...
ప్రోస్టేట్‌ అసహజ పెరుగుదలకు, బాధాకరమైన ప్రోస్టటైటిస్‌ సమస్యలకూ సమర్థమైన మూలికా చికిత్సలు ఉన్నాయి.
సాపాల్మిట్టో అనే మూలికతో కలిగే ఉపయోగాలు చాలా ఎక్కువ. ప్రత్యేకించి, ప్రోస్టేట్‌ గ్రంథి పెరుగుదలకు, జీర్ణవ్యవ స్థలకు సంబంధించిన అనేక వ్యాధులు నయమవుతున్నాయి. యూరోపియన్‌ దేశాలు అన్ని రకాల మూత్ర వ్యవస్థాపరమైన, ప్రోస్టేట్‌ గ్రంథిపరమైన వ్యాధులకు ఈ మూలికనే వాడుతున్నారు.
చైనీస్‌ జిన్నింగ్స్‌ అనే మూలికనూ, తేనెటీగెలు సేకరించిన పుప్పొడినీ కూడా ఈ వ్యాధులకు వాడుతున్నారు.
అమెరికాలోని మహగొని అనే చెట్టు చిదుకు పుల్లలకు, ఆకులకు, బెరడుకు కూడా ప్రోస్టేట్‌ గ్రంథి పెరుగుదలనూ, బ్యాక్టీరియాతో వ్యాధిగ్రస్థమైన ప్రోస్టేట్‌ గ్రంధినీ, ప్రోస్టేట్‌ కేన్సర్‌నూ నయం చేయగల శక్తి ఉందని కనుగొన్నారు.
కూచ్‌గ్రాస్‌, ఎకినేసియా, హైడ్రెంజియా, బెర్బరీస్‌, బచ్చు, స్టింగింగ్‌ నెట్టిల్‌ అనే మూలికలను కూడా ప్రోస్టేట్‌ గ్రంథులకు వాడి, శస్త్ర చికిత్సతో అవసరం లేకుండా చేస్తున్నారు.
అయితే ప్రోస్టేట్‌ పెరుగుదలకు, మిగతా ప్రోస్టేట్‌ వ్యాధులకూ, దేహ వ్యవస్థలోని మిగతా రుగ్మతలను గమనిక లోకి తీసుకుని అందిస్తారు. అంతే తప్ప మూలికల పేర్లు తెలియగానే వైద్య నిపుణుడి ప్రమేయం లేకుండా, స్వయంగా వైద్యం చేసుకోవాలనుకోవడం ఎంతమాత్రం శ్రేయస్కరం కాదు.
 
సహజ పరిమాణానికి మించి ప్రోస్టేట్‌ గ్రంథి పెరిగిపోయినప్పుడు అది మూత్రనాళాన్ని లోపలికి నెట్టి మూత్రం సాఫీగా విడుదల కాకుండా ఆటంకపరుస్తుంది. మూత్రం అనుకున్న వెంటనే రాకపోవడం, వచ్చినా ఏదో ఇరుక్కున్నట్లు సన్నగా రావడం, మూత్రం ఆగి ఆగి, చుక్కలు చుక్కలుగా రావడం, రాత్రిపూట తరుచూ మూత్రం రావడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. ఇవ న్నీ పరిమితిని మించి ప్రోస్టేట్‌ గ్రంథి పెరగటాన్ని సూచిస్తాయి.
 
-డాక్టర్‌ జి. లక్ష్మణరావు,
మూలికా వైద్య నిపుణులు,
ఆస్ట్రేలియన్‌ హెర్బల్‌ క్లినిక్‌,
హైదరాబాద్‌