ముళ్ల బాధకు మహత్తర చికిత్స!

19-11-2018: ఆర్శమొలలు ప్రతి ఒక్కరినీ జీవితంలోని ఏదో ఒక దశలో బాధిస్తాయి. ఈ సమస్యకు ఆయుర్వేదంలో సమర్థమైన చికిత్సలున్నాయి. మొదట్లోనే గుర్తించి చికిత్సను ఆశ్రయిస్తే మొలల బాధ నుంచి విముక్తి పొందడం సులువే! (నేడు అంతర్జాతీయ ఆర్శమొలల దినం)

 
కారణాలు అనేకం
ఈ వ్యాధి కారణాలు, రోగి శరీరంలో వచ్చే మార్పుల గురించిన విషయాలు ఆయుర్వేదంలో చక్కగా అర్థం చేసుకోబడ్డాయి.
ఆహారవిహారాల్లో అవకతవకలు, వ్యాధులు, జీవనశైలి, బీజ దోషాలు.... ఇలా మొలలకు ఎన్నో కారణాలున్నాయి. పీచు తక్కువగా ఉండి, మినప్పప్పు, సెనగపప్పులతో కూడిన వంటకాలు ఎక్కువగా తింటూ, జీర్ణమవడానికి కష్టంగా ఉండే పదార్థాలను ఎక్కువగా తీసుకుంటూ ఉంటే మలబద్ధకం ఏర్పడుతుంది. ఫలితంగా మొలలు తయారవుతాయి. ధూమపానం, మద్యపానం వల్ల కూడా మొలలు ఏర్పడతాయి.
తగినంత మంచినీళ్లు తాగకపోవడం, ఆకలి లేకపోయినా భోజనం చేయడం, రాత్రులు ఎక్కువ సమయం మేలుకోవడం.... లాంటి అలవాట్ల వల్ల కూడా మొలలు ఏర్పడతాయి.
మలబద్ధకంతో లేదా విరేచనాలతో బాధపడేవారికి, అజీర్తి, ఎసిడిటీతో ఇబ్బంది పడేవారికీ, పెద్ద పేగులకు, గర్భాశయానికి కణుతులు ఏర్పడినా మొలల బాధ తప్పదు.
గర్భధారణలో కూడా మొలలు కనిపిస్తాయి. వరుస ప్రసవాలు జరిగిన మహిళల్లో పెద్దపేగు రక్తనాళాలపై అదే పనిగా భారం పడి మొలలు ఏర్పడతాయి.
 
ఆయుర్వేద చికిత్సలున్నాయి
అంతర్లీన ఔషధ చికిత్స, శస్త్ర చికిత్స, క్షార చికిత్స, అగ్నికర్మ చికిత్స అనే 4 పద్ధతులను అనుసరించి మొలలకు చికిత్స చేయవచ్చు. వివిధ రకాల మలాములు, కషాయాలతో టబ్‌ బాత్‌లు చికిత్సలో ఉంటాయి. మొలల రకాన్నిబట్టి శస్త్ర చికిత్స, క్షార పాతన చికిత్స, అగ్నికర్మ చికిత్స, రక్తస్రావ చికిత్సలను అనుసరించవలసి ఉంటుంది.
 
వీటికి దూరం
మొలలు పూర్తిగా తొలగిపోయేవరకూ మినప్పప్పు, సెనగపప్పుతో తయారైన పదార్థాలకు దూరంగా ఉండాలి. పెరుగు, మాంసాహారం, అరటిపళ్లు, పనసపళ్లు, సీతాఫలాలు, ఎక్కువ నూనెతో వండిన వంటకాలు తినకూడదు. వడ, దోశ, ఊతప్పం, మైసూరు బజ్జీలు మొదలైన అరగడానికి కష్టంగా ఉండే పదార్థాలను తినడం తగ్గించాలి. కూరగాయలు, ఆకుకూరలు తినవచ్చు. సమయానికి భోజనం చేయాలి. తగినంత నీరు తాగాలి. రాత్రివేళ పెందలకడనే భోజనం ముగించాలి.
ఆయుర్వేద చికిత్స వల్ల ఎటువంటి దష్ప్రభావాలూ కలగవు. మలవిసర్జన మీద అదుపు తప్పడం, వ్యాధి తిరగబెట్టడం లాంటివి ఉండవు. కాబట్టి మొలల వ్యాధిగ్రస్థులు నిస్సందేహంగా ఆయుర్వేద చికిత్సతో వ్యాధిని నయం చేసుకోవచ్చు.
 
-డాక్టర్‌ ఎన్‌. శ్రీధర్‌, ప్రొఫెసర్‌, హెచ్‌ఒడి,
డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ పిజి శల్య తంత్ర,
డాక్టర్‌. బి.ఆర్‌.కె.ఆర్‌ గవర్నమెంట్‌ ఆయుర్వేదిక్‌ కాలేజ్‌ అండ్‌ హాస్పిటల్‌,
ఎర్రగడ్డ, హైదరాబాద్‌.