తీపి శత్రువు కాదు..!

13-11-2017: మధుమేహాన్ని తీపి శత్రువు అని పిలుచుకుంటాం! కానీ చక్కని అవగాహనతో ఈ రుగ్మత ప్రతికూలతలను ఎదుర్కోగలిగితే మధుమేహం తీపి శత్రువు కాదు మిత్రుడు అని అర్థమవుతుంది. మిగతా వాటితో పోలిస్తే పారదర్శకంగా ఉండి, శరీరంలోని ఒడుదొడుకులను అద్దంలో ప్రతిబింబంలా చూపించే ఒకే ఒక్క రుగ్మత...‘మధుమేహం’!

అన్నం తినకూడదు, అరటిపండు జోలికి వెళ్లకూడదు. స్వీట్ల వైపు కన్నెత్తి చూడకూడదు. ఛీ...ఇవేవీ తినలేని జీవితం ఒక జీవితమేనా? అనిపించటం సహజం. అయితే ఒత్తిడి, వంశపారంపర్యం, అధిక బరువు...కారణం ఏదైనా ఒకసారి సుగర్‌ బారిన పడితే, దాంతో స్నేహం చేసి మచ్చిక చేసుకోవాలిగానీ, శతృత్వం పెంచుకోకూడదు. అలాగని...సుగర్‌ వచ్చింది కాబట్టి మందులు వాడుతూ దాన్ని అదుపులో ఉంచుకుంటే సరిపోతుందిలే! అనుకోవటం కూడా కరెక్టు కాదు. ఒంట్లో దొంగలా నక్కి ఉండే సుగర్‌ మీద ఎప్పుడూ ఓ కన్నేసి ఉంచాలి. దాంతో నేరుగా లేదా డొంక తిరుగుడుగా జతకట్టే ఆరోగ్య సమస్యలను ఎప్పటికప్పుడు కనిపెడుతూ, వాటిని తిప్పి కొడుతూ ఉండాలి. అప్పుడే సుగర్‌ ఫ్రీ లైఫ్‌ మీ సొంతమవుతుంది. ఇవన్నీ చేయాలంటే అన్నిటికంటే ముందు మధుమేహంతో ముడిపడిన ఆరోగ్య సమస్యలమీద అవగాహన పెంచుకోవాలి.
 
నయనం ప్రధానం
మధుమేహం అదుపు తప్పితే కంట్లో ఉండే చిన్న రక్తనాళాలు చిట్లి రెటీనా పాడవుతుంది. దీంతో అంధత్వం రావొచ్చు. ఈ సమస్యలో లక్షణాలేవీ కనిపించవు. రెటినోపతీలో చాప కింద నీరులా జరగాల్సిన నష్టం జరిగిపోతూ హఠాత్తుగా కంటి చూపు పోతుంది.
 
ముందస్తు పరీక్ష: ఇంత నష్టాన్ని నివారించాలంటే ముందస్తు పరీక్ష ఒక్కటే మార్గం. ఆ పరీక్షే...‘ఫండస్‌ ఎగ్జామినేషన్‌’. కంటి చూపు బాగుంది కాబట్టి నా కళ్లకేం ప్రమాదం లేదులే అని మధుమేహులు అనుకోకూడదు. కంట్లో డ్రాప్స్‌ వేసి 15 నిమిషాలు కూర్చోబెట్టి కంటిని పరీక్ష చేస్తే రెటీనోపతి ఉందా? ఏ దశలో ఉంది? అనే విషయాలు వైద్యులు తేలికగా కనిపెట్టేస్తారు. కాబట్టి ఏడాదికోసారి తప్పనిసరిగా మధుమేహులు కంటి పరీక్ష చేయించుకుంటూ ఉండాలి.

వడపోసే జల్లెడలు

పెద్ద రక్తనాళాలతో సంబంధం ఉండే మూత్రపిండాలు మధుమేహం అదుపు తప్పితే దెబ్బ తింటాయి. రక్తంలోని చక్కెర నేరుగా సరఫరా అవుతూ ఉంటే మూత్రపిండాల నుంచి ప్రొటీన్లు లీక్‌ అవటం మొదలు పెడతాయి. ఇదే కొనసాగితే మూత్రపిండాలు పాడై పని చేయకుండా పోతాయి. అప్పుడిక డయాలసిస్‌ మీద ఆధారపడాల్సి వస్తుంది. ఈ సమస్యలోనూ చివరి దశ వరకూ లక్షణాలేవీ ఉండవు. కాళ్ల వాపులు కనిపించినా అప్పటికే మూత్రపిండాల సమస్య చివరి దశకు చేరుకుందని అర్థం.
ముందస్తు పరీక్ష: మూత్రపిండాలను సంరక్షించుకోవాలంటే ప్రొటీన్‌ లీకేజ్‌ను ముందుగానే గుర్తించి దాన్ని నియంత్రించే చికిత్స తీసుకోవాలి. ఇందుకోసం సంవత్సరానికోసారి ‘ప్రొటీన్‌ ఎక్స్‌క్రీషన్‌ ఫ్రమ్‌ కిడ్నీ’ (మైక్రో ఆల్‌బ్యుమిన్‌) పరీక్ష చేయించుకుంటూ ఉండాలి.
 
గుండెలోని మర్మం
 
మధుమేహుల్లో గుండెకూ నష్టం జరగొచ్చు. వీళ్లకు నిశ్శబ్ద గుండెపోట్లు (సైలెంట్‌ మయొకార్డియల్‌ ఇన్‌ఫాక్షన్‌) రావొచ్చు. మామూలు వ్యక్తుల్లోలా వీళ్లలో ఛాతీ నొప్పి, వాంతులు లాంటి లక్షణాలు కనిపించకపోవచ్చు. కొద్దిగా ఎడమ భుజం నొప్పి అనిపించినా భుజం నొప్పే అనుకుంటారు తప్ప గుండెపోటుగా భావించరు. ఇంకొందరికి ఆయాసం రావొచ్చు. దీన్ని అలసటగా భావిస్తారు. కానీ మధుమేహుల్లో ఎడమ భుజం నొప్పి, ఆయాసం గుండెపోటు లక్షణాలు. కాబట్టి ఛాతీలో మంట, ఆయాసం, ఎడమ భుజం నొప్పి లాంటి లక్షణాలు కనిపిస్తే ఆలస్యం చేయకుండా వైద్యుల్ని సంప్రదించాలి.
ముందస్తు పరీక్ష: గుండె ఆరోగ్యాన్ని చిటికెలో కనిపెట్టగలిగే పరీక్ష ‘ఈసీజి’. కాబట్టి గుండెపోటు వచ్చేవరకూ ఆగకుండా ఏడాదికోసారి ఈసీజీ తీయించుకుంటూ ఉండాలి.
 
మెదడు పోటు
గుండె నుండి మెడ ద్వారా మెదడుకు రక్తాన్ని సరఫరా చేసే పెద్ద రక్తనాళంలో రక్తం గడ్డ అడ్డు పడితే వచ్చే సమస్య ఇది. ఈ స్ట్రోక్‌ హఠాత్తుగా వస్తుంది. దీన్ని నివారించాలంటే గుండెను పరీక్షించుకుంటూ ఉండాలి. ధూమపానం అలవాటుంటే మానుకోవాలి.
 
ముందస్తు పరీక్ష: ‘కెరోటిన్‌ డాప్లింగ్‌’...ఈ పరీక్షలో గుండె నుంచి మెదడుకు రక్తాన్ని సరఫరా చేసే రక్తనాళంలో రక్తం గడ్డలు ఉన్నాయేమో తెలుస్తుంది. అయితే ఇది ఫుల్‌ ప్రూఫ్‌ పరీక్ష కాదు. కొందరికి రక్తం గడ్డ ఉన్నా బ్రెయిన్‌ స్ట్రోక్‌ రాకపోవచ్చు. ఇంకొందరికి అప్పటిదాకా సాఫీగా ఉన్న రక్తనాళంలో అప్పటికప్పుడు గడ్డలు ఏర్పడి స్ట్రోక్‌కు దారి తీయొచ్చు. కాబట్టి మధుమేహులు ఈ సమస్య రాకుండా ధూమపానం మానేయటం, మధుమేహం, రక్తపోటు, కొలెస్ట్రాల్‌లను అదుపులో పెట్టుకోవటం లాంటి ముందు జాగ్రత్తలు పాటించాలి.
 
రక్తం తగ్గిన కాళ్లు
కాళ్లలో ఉండే పెద్ద రక్తనాళాలు ఇరుకుగా మారి, రక్త సరఫరా తగ్గటం వల్ల కాళ్లు కుళ్లిపోవటం మొదలు పెడతాయి. పుండ్లు ఏర్పడే గాంగ్రీన్‌ అనే ఈ సమస్యను ప్రారంభంలోనే గుర్తించపోతే చికిత్స మరింత క్లిష్టమవుతుంది. కాబట్టి నడుస్తున్నప్పుడు కాళ్లలో నొప్పి ఉంటే సాధారణ కాళ్ల నొప్పులుగా భావించకుండా వెంటనే వైద్యుల్ని కలవాలి.
ముందస్తు పరీక్ష: ఈ సమస్యను ముందుగానే కనిపెట్టాలంటే కాళ్ల నొప్పులు అనిపించిన వెంటనే వైద్యుల్ని కలిసి పరీక్ష చేయించుకోవాలి.
మధుమేహంతో ప్రత్యక్ష సంబంధం కలిగి ఉండే ఆరోగ్య సమస్యలు కొన్నైతే, పరోక్ష సంబంధ కలిగి ఉండే ఇబ్బందులు మరికొన్ని. ప్రత్యక్ష సంబంధం కలిగి ఉన్నవి మధుమేహాన్ని అదుపులో ఉంచుకోకపోతే బయటపడేవి. పైన చెప్పిన రుగ్మతలన్నీ ఆ కోవకు చెందినవే! ఇప్పుడు పరోక్ష సంబంధం కలిగి ఉన్న ఆరోగ్య సమస్యల గురించి తెలుసుకుందాం! ఇవి సుగర్‌ లేని వ్యక్తులతో పోలిస్తే సుగర్‌ ఉన్న వ్యక్తుల్లోనే ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. అవేంటంటే....
 
రక్తపోటు, అల్జీమర్స్‌, డిప్రెషన్‌
మధుమేహానికి తమ్ముడు రక్తపోటు. ఈ రెండిటికీ అవినాభావ సంబంధం ఉంటుంది. కాబట్టి మధుమేహులు క్రమం తప్పకుండా రక్తపోటును పరీక్షించుకుంటూ ఉండాలి. అలాగే కొలెస్ట్రాల్‌ను అదుపులో ఉంచుకోవాలి.
 
మధుమేహం గురించిన పరిశోధనల్లో ఇంకా కొన్ని ఆరోగ్య సమస్యలకు మధుమేహంతో సంబంధం ఉంటున్నట్టు తేలింది. వాటిలో అల్జీమర్స్‌, డిప్రెషన్‌, వినికిడి తగ్గటం, ఫ్యాటీ లివర్‌, ప్రాస్టేట్‌ క్యాన్సర్‌, ఎముకలు విరగటం చెప్పుకోదగినవి.
 
ఈ పరీక్షలు తప్పనిసరి
సంవత్సరానికోసారి మధుమేహులు ఈ పరీక్షలను తప్పనిసరిగా చేయించుకోవాలి.
రెటీనోపతి: కళ్లను పరీక్షించి తేలికగా కనిపెట్టగలిగే సమస్య ఇది.
యూరినరీ మైక్రో ఆల్‌బ్యుమిన్‌: మూత్రంలో ప్రొటీన్లు పోతున్నాయేమో కనిపెట్టే పరీక్ష.
క్రియాటినిన్‌: మూత్రపిండాల పనితీరును కనిపెట్టే పరీక్ష
రక్త పరీక్ష: రక్తంలో కొలెస్ట్రాల్‌ శాతం కనిపెట్టే పరీక్ష
సిటి కొరొనరీ యాంజియోగ్రామ్‌: ఈసీజీతోపాటు అవసరమైతే ఈ పరీక్ష చేయించుకోవాలి.
అల్ట్రా సౌండ్‌: ఫ్యాటీ లివర్‌ కనిపెట్టడం కోసం చేసే పరీక్ష
చెవి పరీక్ష: వినికిడి తగ్గితే ఈ పరీక్ష చేయించుకోవాలి
డయాబెటిక్‌ ఫుట్‌: మధుమేహ వైద్యుల్ని కలిసిన ప్రతిసారీ కాళ్లు, పాదాలు పరీక్ష చేయించుకోవాలి. చర్మం, దాని రంగు, చర్మం పైను ఉండే వెంట్రుకలు, కాలి వేళ్ల మధ్య సందులను పరీక్షించి సమస్యను ముందుగానే గుర్తించవచ్చు.

మధుమేహానికి పంచకర్మ

మందులతోపాటు జీవనశైలి, ఆహార నియమాల్లో మార్పులు చేయటం ద్వారా చికిత్సనందించటం ఆయుర్వేద చికిత్సా విధానం. ఆయుర్వేద చికిత్స అనగానే అందరూ వైద్యులిచ్చే మందుల గురించే ఆలోచిస్తారు కానీ, వైద్యులతోపాటు రోగి కూడా కొన్ని నియమాలు పాటించినప్పుడే ఆయుర్వేద చికిత్స సత్ఫలితాలనిస్తుంది. ఆయుర్వేదంలో మధుమేహ చికిత్స రెండు మూడు దశల్లో... రెండు, మూడు కోణాల్లో ఉంటుంది. మూడు దశల్లో ఇచ్చే మందులు, చికిత్సా పద్ధతులు వేర్వేరుగా ఉంటాయి. ప్రారంభ దశలో ఉన్నవాళ్లకి ఆయుర్వేద మందులతో మధుమేహాన్ని పూర్తిగా తగ్గించే వీలుంది. మొదటి దశలో ఉన్న మధుమేహులకు ఆమం పద్ధతి ద్వారా శరీరంలో పేరుకున్న విషాలను విసర్జింపజేస్తారు. ఆమం అంటే...మనం తినే ఆహారంలో పూర్తిగా జీర్ణం కాకుండా శరీరంలో ఇంకి ఉండిపోయే టాక్సిన్లు పిత్తాశయం, కండరాలు...ఇలా శరీరంలోని వివిధ ప్రాంతాల్లో పేరుకుపోతూ ఉంటాయి. ఇవి ఇతర శరీర జీవిక్రియలకు అడ్డు పడుతూ ఉంటాయి. ఆ క్రమంలో శరీరంలో ఇన్సులిన్‌ను తయారు చేసే కణాల పనితీరును కూడా ఈ టాక్సిన్లు అడ్డుకుంటూ ఉంటాయి. కాబట్టి వీటిని శరీరంలోనుంచి పారదోలటం కోసమే ఆమం, విరేచనం పద్ధతులను అవలంబించాల్సి ఉంటుంది. అలాగే నీరుగారిన కణాలను ఉత్తేజపరిచి చురుగ్గా పనిచేయించటం వల్ల కూడా మధుమేహం అదుపులోకొస్తుంది. ఈ మొత్తం చికిత్సా విధానాన్ని ‘పంచకర్మ చికిత్స’ అంటారు. దీన్లో వమనం (మసాజ్‌, ఆవిరి స్నానం, వాంతులు చేయించటం), విరేచనాలను అనుసరించి చికిత్స చేస్తే ప్రారంభ దశలో ఉన్న మధుమేహం నయమయ్యే అవకాశాలు మెరుగ్గా ఉంటాయి.
 
మధుమేహ పానీయం
ఒక భాగం పసుపు, రెండు భాగాలు ఉసిరి పొడి రెండూ గోరువెచ్చని నీళ్లలో కలిపి తాగితే ప్రారంభంలో ఉన్న మధుమేహం అదుపులోకొస్తుంది. ఇలా రోజుకి రెండు సార్లు భోజనానికి ముందు తీసుకోవాలి. పసుపు వల్ల పిత్తాశయంలోని మలినాలు విసర్జింపబడి, పిత్తాశయం శుభ్రపడుతుంది. ఉసిరి వల్ల అనారోగ్యానికి కారణమైన ఫ్రీ ర్యాడికల్స్‌ను శరీరం నుంచి తొలగిస్తుంది.
 
- డాక్టర్‌ డి.వి. ప్రశాంత్‌ కుమార్‌,
ఆయుర్వేద వైద్యులు,
శక్తి ఆయుర్వేదిక్‌ క్లినిక్‌,
సికింద్రాబాద్‌.
 
స్పర్శనిచ్చే నరాలు
చిన్న నరాల మీద మధుమేహం ప్రభావం ఎక్కువ. ఇలాంటి చిన్న నరాలు పాదాల్లో ఉంటాయి కాబట్టి ముందుగా అవే దెబ్బ తింటాయి. దాంతో పాదాల్లో స్పర్శ తగ్గి ఎక్కడ అడుగేస్తున్నామో చూసుకోకుండా నడిచేస్తాం. దాంతో పొరపాటున పుండ్లు ఏర్పడతాయి. ఇవి మానటానికి మొండికేస్తాయి. కాబట్టి మధుమేహులు పాదాల్లో మంటలు మొదలవగానే ఆలస్యం చేయకుండా వైద్యుల్ని సంప్రదించాలి. చాలామందికి పాదాల మంటల ద్వారానే మధుమేహం బయటపడుతూ ఉంటుంది.
ముందస్తు పరీక్ష: డయాబెటిక్‌ ఫుట్‌ రాకుండా ఉండాలంటే సంవత్సరానికోసారి వైద్యులను కలుస్తూ పాదాలు పరీక్ష చేయించుకుంటూ ఉండాలి. నరాల పటుత్వం ఏ మేరకు ఉన్నదీ వైద్యులు చేత్తో పరీక్షించి కనిపెట్టగలుగుతారు.
 
హోమియో ఏం చెప్తోంది?
అల్లోపతి వాడుతూ హోమియోపతి మందులు కూడా తీసుకోవచ్చా? అసలు మధుమేహాన్ని అదుపులో ఉంచుకోవటం కోసం అల్లోపతి మందులు వాడుతున్నప్పుడు అదనంగా హోమియోపతి మందులు ఎందుకు వాడాలి? ఇలాంటి సందేహాలు కలగటం సహజమే! అయుతే అల్లోపతి మందులతో మధుమేహం అదుపులో ఉంటున్నా, ఆ మందుల దుష్ప్రభావాల వల్ల ప్రధానంగా న్యూరైటిస్‌ అనే నరాల సంబంధ సమస్యలు తలెత్తుతాయి. కాళ్లలో తిమ్మిర్లు, చురుకులు, పోట్లు, మంటలు లాంటి ఇబ్బందులు కనిపిస్తాయి. ఈ సమస్యలను తగ్గించటం కోసం అల్లోపతిలో అదనంగా మందులు వాడాల్సి ఉంటుంది. కానీ హోమియోపతిలో మధుమేహంతోపాటు, మధుమేహ సంబంధ ఇతరత్రా ఆరోగ్య సమస్యలకు కూడా కలిపి ఒకే మందు ఉంటుంది. పైగా అల్లోపతి మందుల ప్రభావంతో కలిగే దుష్ప్రభావాలను అధిగమించటంలో హోమియోపతి మందులు చురుకైన, ప్రభావవంతమైన పాత్ర పోషిస్తాయంటున్నారు హోమియో వైద్యులు, డాక్టర్‌. శివ శంకర్‌. ఇక అల్లోపతి వాడుతున్న వాళ్లు, హోమియోపతి వాడాలనుకుంటే వాటిని పూర్తిగా మానేయాల్సిన అవసరం కూడా లేదు. అల్లోపతి మందులను తగ్గించి, ఆహార నియమాలు పాటిస్తూ హోమియోపతి మందులను వాడొచ్చు. అలాగే మధుమేహం వల్ల కంటిలోని రెటీనా దెబ్బ తింటుంది. ఈ సమస్యను నియంత్రించగలిగే సమర్ధమైన మందులు కూడా హోమియోపతిలో ఉన్నాయి.
 
డాక్టర్‌. శివశంకర్‌ కూనపరెడ్డి,
రిటైర్డ్‌. ప్రిన్సిపాల్‌,
గవర్నమెంట్‌ హోమియోపతి కాలేజ్‌, హైదరాబాద్‌.