టీ, కాఫీలు మానండి

ఆంధ్రజ్యోతి, 14/12/2014: ఇది కాఫీ టైమ్‌... ఇది టీ టైమ్‌ అని అందరికీ ఉంటుంది. అంటే అంత టైమ్‌ ప్రకారం మానకుండా వాటిని తాగేటట్లుగా మనిషి అలవాటు పడిపోయాడు. తెల్లదొరలు మన దేశాన్ని పాలించినపుడు వాళ్ల అలవాట్లను మన వాళ్లు నేర్చుకొని దాన్ని మానకుండా తాగుతూ దేశమంతటా అంటువ్యాధి లాగా ఒకరినొకరు ముట్టించుకొని, ఓనమాలు నేర్చుకోనివారి దగ్గర నుంచి బాగా చదువుకున్న వారి వరకు అందరూ తాగుతున్నారు.

కాఫీ, టీలను తాగడాన్ని ఎవరూ దురలవాటుగా అనుకోరు. ఎవరూ దురలవాటని అనడం లేదు. మన దేశంలో బ్రాందీ, విస్కీ తాగితే దాన్ని దురలవాటుగా చెప్పుకుంటారు. అదే ఇతర దేశాల్లో బ్రాందీ, విస్కీ తాగినా ఎవరూ దాన్ని దురలవాటు అని అనరు. ఎందుకంటే అక్కడ ఆడ, మగ, పిల్ల, పెద్ద అందరూ కలిసి కూర్చొని తాగుతారు. ఇలా అందరూ తాగేవారే కాబట్టి ఇంక అది దురలవాటనే వారు ఎవరుంటారు? అదే మన దేశంలో అయితే బ్రాందీ, విస్కీలను తాగే వారు 40, 50 శాతం మంది ఉంటే మిగతా వారు తాగడం లేదు కాబట్టి, వీరు అనడానికి మిగిలారు. అందుకని అది దురలవాటుగా పేరు పడింది. మరి కాఫీ, టీలను దురలవాటుగా ఎందుకనటం లేదంటే, అందరూ తాగుతున్నారు కాబట్టి ఇక అనేవారెవరు, నాలాంటి వాడు అనాలి తప్ప. వాస్తవానికి కాఫీ, టీలు కూడా సిగరెట్లు, గుట్కాలు, విస్కీలు, జరదా, కిళ్లీలలాగా ఒక వ్యసనమే. వ్యసనం అంటే, కొన్ని రోజులు తాగాక అది తాగకుండా ఒక రోజు మానినపుడు, ఆ టైముకు మీరు మరిచినా అది మరవకుండా తాగమని గుర్తు చేస్తూ ఉంటుంది. మీరు సంవత్సరం పాటు రోజూ ఒక టైమ్‌ ప్రకారం మజ్జిగ తాగి, ఎప్పుడన్నా ఒక రోజు మాని చూడండి. ఆ సమయానికి మీరు మజ్జిగ తాగలేదని మీ శరీరం ఇబ్బంది పడుతుందేమో. ఇది ఆహార పదార్థం కాబట్టి అలా ఇబ్బంది అనిపించదు. మరి టీ, కాఫీలు ఆహార పదార్థాలా? ప్రతిరోజూ ఎన్నోసార్లు, ఎంతమంది కోసం తాగుతున్నాం. ఎంతమందికో మన చేతులతో ఇస్తున్నాం. టీ, కాఫీల్లో ఏముంటుందో చూద్దాం.
 
వాటిలో ఏముంటుందంటే... 
ఒక కప్పు కాఫీలో 150 మిల్లీగ్రాముల కెఫీన్‌ అనే మందు ఉంటుంది. ఒక కప్పు టీలో 150 మిల్లీగ్రాముల టీన్‌ అనే మందు ఉంటుంది. ఈ రెండు మందులను నరాలకు సంబంధించి, రక్తనాళాలకు సంబంధించి ఇబ్బందులు వచ్చినపుడు వాడితే వాటిని తగ్గించుకోవడానికి పనిచేస్తాయి. నేను బి. ఫార్మసీ చదివినపుడు మాకు కాఫీ, టీల నుంచి ఆ సారాన్ని తీసి మందులుగా తయారు చేడయం తెలిసింది. ఎవరికన్నా నరాల, రక్తనాళాల ఇబ్బందులు వచ్చినపుడు వైద్యులు ఆ నరాలు చురుగ్గా పనిచేయడానికి ఈ మందులను వాడతారు. మనం రోజులో ఒక కప్పు కాఫీ గాని, టీ గానీ తాగితే నరాలకు సంబంధించి 150 మిల్లీగ్రాముల టాబ్లెట్‌ వేసుకున్నట్లే. ఎవరైనా కొందరు కాఫీ చెడ్డది, టీ మంచిది అని అంటూ ఉంటారు. వాస్తవానికి ఈ రెండూ ఒకే జాతి. అక్కాచెల్లెళ్లు, అంతే భేదం. మనం రోజుకు ఎన్ని కప్పులు తాగుతున్నాం. అంటే, కొందరు 10, 12 కప్పులని, మరికొందరు 5, 6 సార్లని ఇలా లెక్క వస్తుంది. ఈ విధంగా రోజు మొత్తంలో ఆ మందును ఎంత ఎక్కువగా మనలోకి పంపుతున్నామో ఆలోచించండి. ఇలా ఒక్క రోజు లేదా రెండు రోజులా? ఎన్ని సంవత్సరాల నుంచి ఈ శరీరాన్ని ఆ ఉద్రేకపర్చే పదార్థాలతో ఇబ్బంది పెడుతున్నాం కదా! కాఫీ, టీలు తాగిన తర్వాత మనలో ఏం జరుగుతుందో చూద్దాం. మామూలుగా మనలోని నరాలు సమస్థితిలో పనిచేసుకుంటూ ఉంటాయి. మీరు కాఫీ, టీలను తాగిన అరగంటలో అందులోని మందు మీలో పనిచేయడం మొదలుపెడుతుంది.
 
కెఫిన్‌, టీన్‌ ప్రభావం... 
కెఫిన్‌, టీన్‌ల ప్రభావం వల్ల మనలోని నరాల వ్యవస్థ ఒక్కసారే చురుగ్గా, హుషారుగా పనిచేయడం ప్రారంభిస్తుంది. మామూలుగా నడిచే ఎద్దు కొరడా దెబ్బ వేస్తే స్పీడ్‌గా పరిగెత్తినట్లుగా మనలో నరాలు కూడా అలానే పనిచేస్తూ ఉంటుంది. ఆ పవరు సుమారుగా 2, 3 గంటల పాటు మనలో ఉంటుంది. ఆ పవరు పనిచేసినంతసేపు మీరు మరీ హుషారుగా, చురుగ్గా మనసు తేలికగా చకా చకా చేసుకుందామనే ఊపులో ఉంటారు. ఇలా ఉంటే మంచిదేగదా అని మీరు అనవచ్చు. పరుగెత్తిన ఎద్దు కొంతసేపటికి అలుపు వచ్చి మామూలుగా నడిచే నడక కూడా నడవకుండా, దున్నపోతు నడకకు తగ్గిపోతుంది. అలాగే మనలో కూడా నరాలు సహజ స్థితిలో పనిచేయాల్సింది పోయి మరీ దిగజారిపోయి పనిచేస్తుంటాయి. అలాంటప్పుడు మీకు నీరసంగా, బద్ధకంగా, హుషారు తగ్గిపోయినట్లుగా ఉంటుంది. ఆ సమయంలో శరీరం మళ్లీ నాకు కాఫీ కావాలని లేదా టీ కావాలని గుర్తు చేస్తూ ఉంటుంది. ఆ టైముకు శరీరం అడిగినా మీరు అందివ్వకపోతే మీకు వెంటనే తలనొప్పిగా మనసు పనిచేయనట్లుగా అనిపించి నీరసంగా అయిపోతారు. అందుకే మీకు కాఫీ, టీల టైము అయినపుడు ఎక్కడున్నా ముందు వాటిని తాగేవరకు తోచదు. ఈ అలవాట్లు శరీరాన్ని, మనసును దిగజారిపోయేట్లు చేస్తాయి. అందుకే వీటిని దురలవాట్లు అన్నారు. ఉత్తి పుణ్యానికి మామూలుగా పనిచేసే నరాలను ఉద్రేక పరచడమెందుకు, ఆపై మనం ఇబ్బందులు పడటమెందుకు? మనిషి అంటే ఎప్పుడూ సమస్థితిలో ఉండాల్సిన వాడు. అంతే కానీ, రోజూ శరీరాన్ని, మనసును ఉద్రేక పర్చుకునే వాడు కాదు.
 
నష్టాలెన్నో...
కాఫీ, టీలను తాగడం వల్ల నష్టాలు ఆలోచిద్దాం. పేగులపై వీటి ప్రభావం పడి ఆహారం మీద వాంఛ పోతుంది. ఆకలి చావడం అందరికీ అనుభవమే. పొట్ట, పేగుల్లో మంటలను, పూతలను రాకుండా ఒక రకమైన జిగురు పదార్థం కాపాడుతుంది. ఆ జిగురును పుట్టించే గ్లోబ్లెట్‌ కణాలపై వీటి ప్రభావం పడి ఆ జిగురు ఉత్పత్తిని సగానికి సగం తగ్గించి వేస్తాయి. దాంతో కడుపులో మంటలు, పేగు పూతలు, అల్సర్లు వస్తాయి. మనం ఈ సమస్యలు వచ్చినపుడు కారం, పులుసులను మానుతున్నామే గాని, టీ, కాఫీలను మానం. ఆ సమస్యలు అందుకే పూర్తిగా తగ్గడం లేదు. పొట్ట, పేగులలో ఆహారాన్ని అరిగించడానికి ఎన్నో ఎంజైములు ఊరతాయి. వాటి ఉత్పత్తిని తగ్గించివేస్తాయి. నరాలు ఎక్కువగా ఉద్రేకపడి పనిచేస్తున్నందుకు త్వరగా అలసటకు గురవుతాయి. కాఫీ, టీల పవరు మనలో అయినపుడు మనం వాటిని మళ్లీ తాగకపోతే వెంటనే తలనొప్పి వస్తుంది. అలా అలవాటు అయిన తలనొప్పి రోజులో ఏదో ఒక టైములో వస్తూనే ఉంటుంది. 50, 60 శాతం తలనొప్పులకు కాఫీ, టీలే కారణాలు అని అనవచ్చు. కాఫీ, టీలు కిడ్నీలపై ఉండే ఎడ్రినల్‌ గ్రంధులపై పనిచేసి కొంచెం కొంచెం మూత్రం ఎక్కువ సార్లుగా పోసి అతిమూత్ర వ్యాధి వచ్చేట్లుగా చేస్తాయి. మన లివర్‌కు ప్రతిరోజు ఒక కప్పు తాగినందుకు వచ్చిన దోషాన్ని శుభ్రం చేసుకోవడానికి రోజు పడుతుంది. మనం రోజుకి 5,6 కప్పులు తాగితే మిగతా కప్పులలో మందు ప్రభావాన్ని శుద్ధి చేయలేక లివరుకు సమస్యగా మారుతుంది. మెదడును ఎక్కువగా పనిచేయించడం చేత ఎక్కువగా ఆలోచనలు రావడం, స్థిరంగా లేనట్లుగా అనిపించడం, చిరాకుగా ఉండడం, జరుగుతుది,. నరాలు ఎప్పుడూ ఉద్రేకంలో ఉండడం వల్ల రిలాక్సు కావు. దాంతో సరిగా నిద్ర రాదు. పడుకున్న వెంటనే నిద్ర పట్టదు. పొద్దున్నే కాఫీ, టీలు తాగడం వల్ల మన శరీరానికి విసర్జన క్రియ ఆగిపోతుంది. పరగడుపున మన శరీరం మనలో ఉన్న చెడును క్లీన్‌ చేసుకుంటూ ఉంటుంది. ఇవి తాగిన వెంటనే ఆ చెడు వదిలే కార్యక్రమాన్ని ఆపి సడన్‌గా ఉద్రేకపడి ఈ గొడవలో పడిపోతుంది. 
 
కాలక్షేపానికి తాగకండి 
కాలక్షేపానికి కాఫీ, టీలు తాగే వాళ్లుంటారు. కాలక్షేపానికి మీ ఇంటికి కాస్త బురద పూసుకుంటారా? మీ కారు ఆయిల్‌ ట్యాంకులో కాస్త ఇసుక పోసుకుంటారా? అలా చెయ్యరే! కాఫీ, టీ తాగే అలవాటును పూర్తిగా వదిలేయండి. మీ ఇంటికి బంధువులు వచ్చినా ఇవ్వకండి. 


ఇవి తాగటం మేలు 
మీ ఇంటికి బంధువులు వస్తే వారిని కూర్చోబెట్టి పెద్ద చెంబుతో మంచినీళ్లు తెచ్చివ్వండి. ఎక్కువ నీటిని తాగడం వల్ల శరీరం శుద్ధి అవుతుంది. కాఫీ, టీలపై వాంఛను పొగొట్టుకోవటానికి గోరువెచ్చని నీటిలో ఒకటి, రెండు నిమ్మకాయలు పిండి పుల్లగా ఉండేటట్లు తాగండి. కాఫీ, టీలు మానివేసినందున తలనొప్పిగా ఉంటే రెండు పూటలా తలస్నానం చన్నీళ్లతో చేయండి. కాఫీ, టీ లకు బదులు తేనె నిమ్మరసం నీళ్లు, చెరకురసం, కొబ్బరినీళ్లు తాగడం అలవాటు చేసుకోండి. 


ఆరోగ్యానికి సంబంధించి డాక్టర్‌ మంతెన సత్యనారాయణ రాజు ఉచిత సలహాల కోసం ప్రతి రోజు ఉదయం 6.30 నుంచి 8.30 గంటల వరకూ 0863 - 2333388కు కాల్‌ చేయవచ్చు.