మెరుగైన ఆరోగ్యానికి మొలకెత్తిన గింజలు

ఆంధ్రజ్యోతి, 26/10/2014: మొలకెత్తిన విత్తనాలను నాలుగు సంవత్సరాల పిల్లల నుంచి ముసలివారి వరకు అందరూ తినవచ్చు. నమలలేని వారు ఈ గింజలను వడల పిండిలాగా (మరీ మెత్తగా కాకుండా) నూరుకొని చప్పరించి మింగవచ్చు. మిగతా వారు బాగా నమిలి తినాలి. సరిగా నమలకపోతే ముక్కలు ముక్కలుగా అరగనట్లుగా విరేచనం ద్వారా వచ్చేస్తాయి.
 
మొలకెత్తిన విత్తనాలను సాయంకాలం 6, 7 గంటల ప్రాంతంలో తినకూడదు. చాలామంది అప్పుడే కొని తింటూ ఉంటారు. అన్నింటికంటే ఉదయం పూట తినడం శ్రేష్ఠం. ఎప్పుడన్నా కుదరకపోతే అప్పుడప్పుడు మధ్యాహ్నం భోజనం లాగా తినండి. వేరుశనగ పప్పులను నానబెడితే సరిపోతుంది. వాటికి మొక్కలు అక్కర్లేదు. పచ్చి కొబ్బరిని యథావిధిగా ఎదిగే వయసులో ఉన్న పిల్లలు, బాగా ఎండలో కష్టపడి పనిచేసేవారు, బరువు పెరగాల్సిన వారు, కండపట్టాలనుకునే వారు, నీరసం ఎక్కువగా ఉన్నవారు తప్పనిసరిగా తినాలి. బరువు తగ్గాల్సిన వారు, కొలెసా్ట్రల్‌ తగ్గాల్సిన వారు వేరుశనగపప్పులను మానండి. పచ్చి కొబ్బరిని కొద్దిగా తినండి. బరువు తగ్గాలనుకునే వారు, షుగర్‌ వ్యాధి ఉన్న వారు మొలకెత్తిన విత్తనాలు 3, 4 రకాలను బాగా తినాలి. వేరుశనగపప్పులు, కొబ్బరి తినేవారు వాటితో పాటు 2, 3 రకాల మొలకలను తప్పనిసరిగా పెట్టుకొని తింటే మంచిది. మొలకలను ఒక దోసెడు నిండా ప్రతిరోజూ తినవచ్చు. పొట్టకు సరిపడా తినండి. గ్యాస్‌ ట్రబుల్‌ ఉన్నవారు, బాగా మలబద్ధకం ఉన్నవారు, ఆకలి అసలు వేయని వారు మొలకల టిఫిన్‌ 10, 15 రోజులు మాని, పండ్లు టిఫిన్‌గా తింటే మంచిది. ఆ తర్వాత మొలకలు తినవచ్చు. బెల్లం వాడవద్దు. షుగర్‌ ఉన్నవారు తినకూడదు. బరువు తగ్గాల్సిన వారు 7, 8 పండ్లు వరకూ తింటే, సన్నగా ఉన్నవారు, నీరసం ఎక్కువగా ఉన్నవారు, రక్తం తక్కువగా ఉన్నవారు 10, 15 ఖర్జూరం పండ్లను ప్రతిరోజూ ఉదయం తినడం ఎంతో మంచిది. ఈ మొలకలను ఉదయం పూట తినమంటున్నాం. మరి రోజూ తినే టిఫిన్‌ సంగతేమిటని అందరి అనుమానం. ఇడ్లీలు, దోసెలు తింటూ ఉంటే మన ఆరోగ్యం ఇంత కంటే దిగజారి పోతుంది. కాబట్టి వాటిని నెలలో 3, 4 సార్లుగా ఎప్పుడన్నా తినండి. రోజూ మాత్రం మొలకలనే తినండి. మొలకలు తినేటప్పుడు వాటితోపాటు ఉడికినవి ఏమీ తినకూడదు. ఇక రోజులో మిగతా టైములో గింజలను మనం వాడకుండా గింజల్లో లాభాన్నంతా ఉదయాన్నే అందిద్దాం. స్త్రీలకు ఎంత లాభమో చూడండి. రేపటి నుంచి పొద్దున్నే హడావుడి పడుతూ టిఫిన్‌లు, చట్నీలు చేయాల్సిన పనిలేకుండా నలుగురికీ నాలుగు మూటలు కట్టి ఎవరి మూట వారికి పారేస్తే పనై పోతుంది. సుఖపడటం తెలియాలి. చుట్టాలొచ్చినా వీటితోనే మర్యాద చేద్దాం. ఈ మంచి అలవాటును వారికి కూడా నేర్పిద్దాం.

ఎలాంటి కొబ్బరి తినాలి? 
కొబ్బరి అంటే కొలెస్ట్రాల్ అనే భయం అందరిలోనూ వచ్చి, ఇప్పుడు పూర్తిగా దాన్ని తినడం మానేశారు. ఇతర గింజల కంటే కూడా గొప్ప ఆహారం ఇది. మానవుని మేధాశక్తిని, తెలివితేటలను అభివృద్ధి చేసుకునేవి అన్నీ కొబ్బరిలో ఉన్నట్లు మన పెద్దలు గ్రహించి, దానిని ప్రసాదం రూపంలో తినిపించారు. పెళ్లి చేసేటపుడు కూడా చివరకు కొబ్బరికాయనే చేతిలో పెట్టి మరీ చేస్తారు. శుభకార్యాలకు దాన్నే ముందు కొడతారు. ఇతర రాష్ట్ర ప్రజలతో పోలిస్తే కొబ్బరి బాగా తినే కేరళ వారికే మేధాశక్తి ఎక్కువగా ఉండడం అందరికీ తెలిసిందే. మనమందరం విడిగా కొబ్బరి కాయను కొట్టి వాడుకోవటం లేదు. ఎప్పుడన్నా దేవుడికి కొట్టినపుడు మాత్రమే దాన్ని వాడుకుంటున్నాం. ఎలాంటి కొబ్బరి తింటే లాభం వస్తుందో ఆ రకంగా పక్వానికి వచ్చిన కాయనే దేవుడి దగ్గర కొట్టాలని నియమం పెట్టారు. దేవుడి దగ్గర కొట్టడానికి పనికి రాని కొబ్బరికాయకు మూడు లక్షణాలు చెప్పారు. అవి మొదటిది నీళ్లు నిండా ఉన్న కాయ (ఊపితే మోగదు) పనికిరాదన్నారు. అందులో కొబ్బరి లేతగా ఉండి వట్టి పిండి పదార్థమే తప్ప ఇతర పోషక పదార్థాలు తయారు కావు కాబట్టి వద్దన్నారు. రెండవది, నీళ్లు ఊపినా మోగని కురిడీ కాయను ఎందుకంటే అందులో కొబ్బెర బాగా ముదిరిపోయి ఉంటుంది. అది తింటే మనకు నష్టం కాబట్టి దాన్ని వద్దన్నారు. మూడవది, తొడిమ లేని కొబ్బరికాయ దేవుడికి కొట్టడానికి పనికి రాదనడంలో అర్థం చూస్తే, తొడిమ ఊడిన కాయ కూడా బాగా ముదిరిపోయి ఉంటుంది.
 
కాబట్టి వద్దన్నారు. ఏ కాయ కొట్టమన్నారంటే, ఊపితే మూడు వంతులు నీరు మోగే ముప్పేటకాయను, అందులో కొబ్బరి తేలిగ్గా జీర్ణమయ్యే స్థితిలో ఉంటుంది. హాని కలిగించే కొవ్వు పదార్థాలు అందులో తయారయి ఉండవు. కొబ్బరి పాలు కారే స్థితిలో ఉంటుంది. అన్ని పోషక పదార్ధాలుండి, ఏ నష్టమూ లేని స్థితిని గ్రహించిన మన పెద్దలు దూరదృష్టితో ఈ అలవాటు చేశారు. శాస్త్రజ్ఞులు, డాక్టర్లు చెప్పినవే ఈ మధ్య ప్రజలు వింటున్నారు గానీ పెద్దలు చెప్పినవి పక్కన పెడుతున్నారు. ఆ కొబ్బరిలో కొలెసా్ట్రల్‌ పదార్థాలుండవు. కొబ్బరి తింటే గుండె జబ్బులు వస్తాయన్నది అపోహ. లెక్క ప్రకారం ఇండియాలో బాగా కొబ్బరి తినే కేరళ రాష్ట్ర ప్రజలకు ఎక్కువ గుండె జబ్బులుండాలి. విచిత్రమేమిటంటే, ఇండియాలో కేరళ రాష్ట్రమే అతి తక్కువ మంది గుండె రోగులున్నట్లు కేరళ శాస్త్రజ్ఞులు నిరూపిస్తున్నారు. కొబ్బరిలో అలాంటివి ఎన్నో మంచి గుణాలున్నాయి. నములుతుంటే బాగా పిప్పి వచ్చే కొబ్బరి కాకుండా , పాలు వచ్చే కొబ్బరిని రోజుకు ఒక కాయ చొప్పున ప్రతి మనిషీ తింటే ఎంతో మంచిది. తిరుగులేని బలం. పోషక పదార్థాల గని పచ్చికొబ్బరి. ప్రతిరోజు విడిగా తినడం కుదరని వారు కూరల్లో పొయ్యి మీద నుంచి దించే ముందు చల్లుకొని తినడం మంచిది. ప్రతి ఇంట్లో గుడ్లను పగులగొట్టే సంప్రదాయాన్ని పక్కకు పెట్టి కొబ్బరి కాయలను కొట్టడం ప్రారంభిద్దాం.


ఆరోగ్యానికి సంబంధించి 
డాక్టర్‌ మంతెన సత్యనారాయణరాజు ఉచిత సలహాల కోసం ప్రతి రోజు ఉదయం 7 నుంచి 10 గంటల వరకూ 9848021122కు కాల్‌ చేయవచ్చు.