రోమకూపాల్లో ఈ బాధేమిటి?

02-05-2018: నా వయసు 26 ఏళ్లు. దాదాపు రెండు మాసాలుగా చర్మం పైన, ప్రత్యేకించి సన్నసన్నని వెంట్రుక కుదుర్లలో దురద, నొప్పి, మంట ఉంటున్నాయి. అవి పొక్కులుగా తయారై అక్కడక్కడ చీము కూడా వస్తోంది. తొడలు, నడుము భాగాల్లో ఈ సమస్య మరీ ఎక్కువగా ఉంది. పలు రకాల క్రీములు రాయడంతో పాటు యాంటీబయాటిక్స్‌ కూడా వాడాను. అయినా ఏ మాత్రం మార్పు రాలే దు. ఈ సమస్య నన్ను బాగా చికాకు పెడుతోంది. పరిష్కారం చెప్పండి.

- డి. సునీత, గుంటూరు
 
మీకున్న సమస్యను ‘అరుంశిక’ (ఫాలికులైటిస్‌) అంటారు. రోమ కూపాల్లో ఇన్‌ఫెక్షన్లు చేరడం వల్ల ఈ సమస్య తలెత్తుతుంది. సహజంగా మన చర్మంలో ఉండే తైల గ్రంధులు చర్మాన్ని ఇలాంటి సమస్యలన్నింటి నుంచి కాపడుతుంటాయి. అయితే కొందరిలో ఈ గ్రంధులు దెబ్బ తింటాయి. ఈ స్థితికి గల కారణాల్లో శరీరంలో మొత్తంగానే వ్యాధి నిరోధక శక్తి తగ్గడం, లేదా ఆయా భాగాల్లో ఈ శక్తి తగ్గడం, అతిగా యాంటీబయాటిక్స్‌ వాడటం వంటివి ఉంటాయి.ఈ కారణాల వల్ల ఈ గ్రంధుల్లోని తైలాంశాలు ఎండిపోతాయి.
 
ఈ పరిస్థితికి డెటాల్‌ ఎక్కువగా ఉండే సబ్బులు వాడటం, స్నానం చేసే నీళ్లల్లో ఎక్కువ మోతాదులో డెటాల్‌ ద్రావణం కలపడం కూడా ఈ సమస్యకు కారణమవుతాయి. ఎక్కువగా చెమటలు పోసేవారు, చర్మంలో జిడ్డుతనం ఎక్కువగా ఉండేవారు ఈ సమస్యకు గురయ్యే అవకాశాలు ఎక్కువ. ఇలాంటి వాళ్లు రోజూ రెండు సార్లు స్నానం చేయడం తప్పనిసరి. బిగుతైన దుస్తులు ధరించడం వల్ల చ ర్మం పైన, రోమ కూపాల పైన ఒత్తిడి పడి, లోలోపల ఉష్ణోగ్రత పెరుగుతుంది. ఇది కూడా ఈ చర్మ సమస్యకు కారణమవుతూ ఉంటుంది. అందువల్ల వదులైన దుస్తులు ధరించడం అన్నిరకాలా శ్రేయస్కరం. ఈ జాగ్రత్తలన్నీ పాటిస్తూ అసలు ఈ సమస్య రాకుండానే చూసుకోవడం ఎంతో ఉత్తమం.
 
ఒకవేళ సమస్య అప్పుటికే మొదలై ఉంటే, 100 గ్రాముల కొబ్బరినూనె ను వేడిచేసి, అందులో పావు చెంచా పసుపు పొడి వేసి మరోసారి వేడిచే సి ఉంచుకోవాలి. ఆ తర్వాత స్నానం చేసి చర్మం కొంచెం తడిగా ఉన్నప్పుడే ఆ మిశ్రమాన్ని తీసుకుపి పలుచగా ఒంటిమీద పట్టించాలి. అయితే వెంట్రుకలు ఏ వైపు వాలిపోయి ఉంటే ఈ మిశ్రమాన్ని అదే వైపు లేపనంగా వేయాలి. దీనికి తోడు కైశోరా గుగ్గులను ఒక్కొక్కటి చొప్పున భోజనం తర్వాత మూడు పూటలా వేసుకోవాలి. వేప మాత్రలు కూడా ఈ సమస్యకు బాగానే పనిచేస్తాయి, సమస్య మరీ ఎక్కువగా ఉన్నప్పుడు ఇవేవీ పనిచేయకపోవచ్చు. అలాంటప్పుడు డాక్టర్‌ను సంప్రదించడం తప్పనిసరి! ఎందుకంటే, ఈ సమస్యకు వైరస్‌, బ్యాక్టీరియా, ఫంగస్‌ వీటిలో ఏది కారణమో పరీక్షల ద్వారా తెలుసుకుని అవసరమైన వైద్య చికిత్సలు చేయవలసి ఉంటుంది.
 
 
-డాక్టర్‌ డి. వి. ప్రశాంత్‌ కుమార్‌
ఆయుర్వేద వైద్యులు
శక్తి ఆయుర్వేద క్లినిక్‌, హైదరాబాద్‌