అన్నింటికీ కారణం కాలుష్యమే

ఆంధ్రజ్యోతి, 17/08/2014: రోగాలు రావటానికి ప్రధాన కారణం శరీరంలో కలుషిత పదార్ధాలు పేరుకుపోవటం. కలుషిత పదార్ధాలను శుభ్రం చేసేందుకు వీలుగా మన శరీరానికి జీవనాధారమైన నీటిని ఎక్కువగా తాగాలి. కాలుష్యం వల్ల వచ్చే రోగాలపై డాక్టర్‌ మంతెన సత్యనారాయణరాజు చెపుతున్న వివరాలు... 

కంట్లో నలుసు, పంటిలో పీచు శరీరానికి ఇబ్బంది కలిగించకుండా ఉండటానికి, వాటిని పూర్తిగా బయటకు గెంటే వరకూ శరీరానికి మనశ్సాంతి ఉండదు. అలాంటి గుణం ఉన్న మన శరీరంలో పేరుకుపోతున్న నాలుగు రకాల కాలుష్య పదార్ధాలను విసర్జకావయవాలనే మురుగు కాల్వల ద్వారా బయటకు గెంటడానికి సర్వవిధాలా ప్రయత్రిస్తూ ఉంటుంది. ఆ కాలుష్య పదార్థాలు గేటు వరకూ వస్తున్నాయి. మనం అవకాశం ఇవ్వక పోయేసరికి చేసేది లేక మళ్లీ వెనక్కి పోతున్నాయి. ఇలా శరీరం ఎన్నో రోజులు ప్రయత్నించి, చివరకు విఫలమై ఈ చెత్తను గెంటడం ఇక నా వల్ల కాదు, దీన్ని ఎక్కడో ఒక చోట, అడ్డులేని చోట దాస్తే బాగుంటుందని నిర్ణయించుకుంటుంది. పొలంలో నీరు ఎక్కడ నిల్వ ఉంటుందీ అని అడిగితే ఎక్కడ పల్లం ఉంటే అక్కడ అని అంద రూ సమాధానం చెబుతారు. అలాగే మనలో కూడా శరీరంలో ఎక్కడ బలహీనత (పల్లం) ఉంటే లేదా ఏ భాగంలో కదలికలు తక్కువగా ఉంటే, ఆ భాగంలో ఆ కాలుష్యం చేర్చబడుతుంది. అందుచేతనే ఇంట్లో అందరూ ఒకే రకంగా తిన్నా, అందరికీ ఒకే రకమైన రోగాలు రాకపోవటంలో ఉన్న అర్ధం ఇదేనన్నమాట. కాలుష్య పదార్థాలు రోగ పదార్థాలుగా ఎలా మారతాయో తెలుసుకుందాం.
 
ఎన్నెన్నో క్రిములు 
మంచినీటిని పదిరోజులు కదపకుండా అలా బిందెలో ఉంచితేనే అందులో ఎన్నో క్రిములు పుడుతున్నాయి. రాత్రి తినగా మిగిలిన అన్నాన్ని, కూరలను ఒక రోజు నిల్వ ఉంచితేనే కంటికి కనబడే క్రిములు అందులో పుడుతున్నాయి. నిల్వ ఉంచే సరికి మంచి నుంచి అయినా చెడు పుట్టడం మనం చూస్తున్నాం. అలాంటిది. మన శరీరం అక్కర్లేదనుకొని బయటకు గెంటుకునే కాలుష్య పదార్థాలనే మనం నిల్వ ఉంచితే, అవి ముందు ముందు రోగ పదార్ధాలుగా రూపాంతరం చెందుతాయి. మంచినీరు గోతిలో నిల్వ ఉంటే ముందు బురద నీరుగా మారి, ఆ తర్వాత బురద నీరు క్రిమికీటకాదులను పుట్టించే నిలయం అవుతుంది. అలాగే కాలుష్య పదార్థాల నుంచి తయారైన రోగ పదార్థాలు నిదానంగా రోగ క్రిములను పుట్టించడం మొదలు పెడతాయి.
 
క్రిములతోనే రోగాలు 
ఆ రోగ క్రిములు ఏ అవయవాన్ని, ఏ భాగాన్ని చేరితే ఆ భాగం రోగగ్రస్తమవుతుంది. దాన్నే వైద్య పరిభాషలో ఇన్ఫెక్షన్‌ అంటారు. ఆ రోగక్రిములు ఏ భాగాన్ని చేరి పాడు చేస్తుంటే ఆ భాగానికి ఒక్కొక్క పేరు పెట్టారు. ఆ రోగ క్రిములు కీళ్ల మధ్యలో పేరుకుంటే ఆర్థరైటిస్‌ (కీళ్లవాతం) అని, గాలి గొట్టాల్లో పేరుకుంటే బ్రాంకైటిస్‌ అని, అదే ముక్కు చుట్టుపక్కల భాగంలో పేరుకుంటే సైనసైటిస్‌ అని ఇలా రకరకాలుగా పేర్లు మారుతునాయి. అది ఎలా అంటే, ఉదాహరణకు బంగారపు ముద్దను కరిగించి ఒక ఆకారంగా పోసి దాన్ని చేతికి పెడితే గాజు అని, మెడలో వేస్తే గొలుసని, నడుముకు పెడితే వడ్డాణమని అంటుంటాం. అన్నింటా ఉన్నది బంగారమే అయినా ఒక్కొక్క భాగాన్ని బట్టి ఆ బంగారానికి పేరు మారినట్లుగా మనలో కూడా జబ్బు పేర్లు మారుతున్నాయి. ఆలోచిస్తే దానికి మూలకారణం రోగ పదార్ధం. దానికి ఆధారం వ్యర్థ పదార్ధం. చివరకు మనం తిన్న ఆహారం, తాగిన నీరు, పీల్చిన గాలి లోపలకు సరిగా వెళ్లడమే గానీ బయటకు పూర్తిగా రావాల్సిన విధంగా రాకపోయేసరికి, అవే మన రోగాలకు పునాది రాళ్లుగా మారుతున్నాయని ఎందరు తెలుసుకుంటున్నారు. మన కళ్లను మన చేతులతోనే పొడుచుకున్నట్లుగా, మనిషి ఈ శరీరాన్ని తనే చేతులారా రోగగ్రస్థం చేసుకుంటున్నాడు. తను చేసుకున్నది తనే అనుభవించక తప్పదు కదా! అందుచేత తన తప్పును తనే సరిదిద్దుకోవాలి. తనే తన ఆరోగ్యానికి మంచి బాటను వేసుకోవాలి. తనలో కాలుష్యం పేరుకోవడానికి వాతావరణ కాలుష్యం గానీ, ఎరువులు, పురుగుమందులు కారణాలు కాదు. తనలో పేరుకునే కాలుష్యానికి తల్లిదండ్రుల పాత్ర గానీ, వయసుతో గానీ సంబంధం లేదు. నీలో చెడు పేరుకోవడానికి నీవే బాధ్యుడవు. ఈ వాస్తవాన్ని గుర్తించి చెడును వదిలిపెట్టడంలో శరీరానికి సహకరించండి.
 
కాలుష్యం ఎలా ప్రయాణిస్తుంది? 
మన శరీరంలో జీవకణాల్లో జీవకార్యం నడిచేటపుడు కాలుష్య పదార్థాలు విడుదలవుతూ ఉంటాయి. ఈ కాలుష్య పదార్థాలన్నీ నీటిలో తేలిగ్గా కరిగి అక్కడ నుంచి ఒక్కొక్క విసర్జకావయవానికి విసర్జనకు చేర్చబడతాయి. ఎవరైతే సరైన సమయంలో సరిపడినన్ని నీళ్లు తాగుతారో, వారిలో మాత్రం ఏ రోజు కాలుష్యం ఆ రోజు నీటిలో కరిగి విసర్జన క్రియ సవ్యంగా జరుగుతుంది. నీరు తాగితే ఏమి వస్తుందిలే, నీటికి టేస్టు ఏముందిలే అని ఆలోచించే వారికి ఆ కాలుష్యం ఎందుకు పోతుంది. చివరకు కణాల్లో ఎక్కువగా పేరుకుపోతుంది. ఇంటిని కడుక్కోవడానికి బోలెడు నీళ్లు కావాలంటారు, స్నానం చేయడానికి బక్కెటు నీళ్లు కావాలనుకుంటున్నారు, కానీ శరీరాన్ని లోపల కడుక్కోవడానికి కోటాను కోట్ల జీవకణాలను స్నాం చేయించడానికి కొంచెం నీళ్లతో సరిపెడుతున్నారు. శరీరం బయటకొచ్చిన మలమూత్రాదులను కడుక్కోవడానికి ఎక్కువ నీరు ఖర్చు చేసి సంతృప్తి పడుతున్నారే గానీ, ఆ మలమూత్రాదులు పుట్టిన కణాలను, అవి ప్రయాణించే మార్గాలను పరిశుభ్రం చేయడానికి నీరే కావాలని తెలుసుకోలేక పోతున్నారు. కొంతమంది విడిగా నీటిని తాగలేక కొబ్బరినీళ్లనో, మజ్జిగనో, కూల్‌డ్రింక్‌నో, బార్లీ నీటినో నీళ్ల బదులుగా తాగుతూ ఉంటారు. ఇలాంటి పానీయాలు కూడా శరీరాన్ని లోపల శుభ్రం చేస్తాయి గదా అని భ్రమపడుతూ ఉంటారు. అవి ఎలాంటివంటే, ఆ పానీయాలు పోసిన గ్లాసును కూడా చివరకు మంచినీళ్లతోనే శుభ్రం చేయాల్సి వస్తున్నదంటే, అవి ఎంతవరకు మనలో కాలుష్యాన్ని శుభ్రం చేస్తాయో ఆలోచించండి! మన లోపల గానీ, బయట గానీ దేనినన్నా శుభ్రం చేయాలంటే నీటికి నీరే సాటి. నీరే మన జీవనాధారం. 

మంచినీటిని పదిరోజులు కదపకుండా అలా బిందెలో ఉంచితేనే అందులో ఎన్నో క్రిములు పుడుతున్నాయి. రాత్రి తినగా మిగిలిన అన్నాన్ని, కూరలను ఒక రోజు నిల్వ ఉంచితేనే కంటికి కనబడే క్రిములు అందులో పుడుతున్నాయి. నిల్వ ఉంచే సరికి మంచి నుంచి అయినా చెడు పుట్టడం మనం చూస్తున్నాం. అలాంటిది. మన శరీరం అక్కర్లేదనుకొని బయటకు గెంటుకునే కాలుష్య పదార్థాలనే మనం నిల్వ ఉంచితే, అవి ముందు ముందు రోగ పదార్ధాలుగా రూపాంతరం చెందుతాయి. 

ఆరోగ్యానికి సంబంధించి డాక్టర్‌ మంతెన సత్యనారాయణరాజు ఉచిత సలహాల కోసం ప్రతి రోజు ఉదయం 7 నుంచి 10 గంటల వరకూ 9848021122కు కాల్‌ చేయవచ్చు.