భయం లేదు!

11-09-2017: బాహ్య వాతావరణం నుంచి శరీరంలోకి ప్రవేశించే వాటిని ఆగంతుజ రోగాలని, శరీరంలోనే వచ్చిన మార్పుల వల్ల కలిగే వాటిని నిజరోగాలని అంటారు. అయితే, స్వైన్‌ ప్లూ విషయంలో ఈ రెండు మూలాలు ఉంటాయి. ఈ ఫ్లూ బాహ్య వాతావరణం నుంచి శరీరంలోకి ప్రవే శించినా అది వ్యాపించడానికి, బలపడ టానికీ శరీర స్థితి కూడా కారణమే. వైరస్‌ ఎంత శక్తివంతమైనదైనా వ్యాధి నిరోధక శక్తి బలంగా ఉన్న శరీరంలో దాని ప్రభావమేమీ ఉండదు. శరీరంలోనే దోషం ఉంటే వ్యాధి నిరోధక శక్తి లోపించి వైరస్‌ శరీరంలో నివాసం ఏర్పరుచుకోవడానికీ, వృద్ధి చెందడానికీ వైర్‌సకు సులువవుతుంది.
 
అందుకే మనిషి చేయవలసిందల్లా వ్యాధికారకాలను లోనికి ప్రవేశించకుండా ఒక అడ్డుగోడ నిర్మించుకోవడమే. ఆ అడ్డుగోడే వ్యాధి నిరోధక శక్తి. అప్పుడిక బయటినుంచి వచ్చే ఆగంతుజ రోగమేదీ శరీరంలో ఉండిపోయే నిజరోగంగా మారదు.
 
స్వైన్‌ ఫ్లూ అని తెలియగానే వైరస్‌ లోనికి ప్రవేశించకుండా మాస్క్‌లు ధ రిస్తున్నాం. అయితే ఇది కేవలం బాహ్యమైన కవచం మాత్రమే. అది అవసరమే అయినా అంతకన్నా ముఖ్యమైనది శరీరంలోపల మాస్క్‌ ధరించడం. అంటే జీవశక్తిని, వ్యాధినిరోధక శక్తినీ పెంచుకోవడమే. వ్యాధి నిరోధక దిశగా పనిచేసే క్రమంలో ఆయుర్వేదం రెండు రకాల చికిత్సలకు ప్రాధాన్యతనిస్తుంది. వాటిలో ఒకటి రోగహర చికిత్స. రెండవది దోషహర చికిత్స, మొదటిది వ్యాధి సోకిన తరువాత చేసే చికిత్స. రెండవది శరీరంలో వ్యాధికి గురయ్యే దోష గుణాలను తొలగించే చికిత్స.
 
ఎలాంటి మందులు ?
ప్రస్తుత స్థితిలో జలుబు, దగ్గు, గొంతునొప్పి, జ్వరం, కండరాల నొప్పుల వంటి లక్షణాలు ఏ కాస్త కనిపించినా చాలు అది ఫ్లూ యేమో అన్న అనుమానం కలగవచ్చు. కానీ, నిజంగానే ఫ్లూవ్యాధికి గురయ్యే వారి సంఖ్య చాలా తక్కువ. ఒకవేళ నిజంగానే వ్యాధి గ్రస్తుల విషయంలో ఒక విషయాన్ని దృష్టిలో ఉంచుకుంటే మంచిది. ఫ్లూవ్యాధికి సంబంధించినవిగా అనిపించే లక్షణాలు కనిపించగానే, వెంటనే క్రోసిన్‌, పారసిటమాల్‌ వంటి బలమైన మందులు తీసుకోకూడదు. దీనివల్ల వ్యాధి లక్షణాలు తగ్గిపోయి వ్యాధి మాత్రం లోలోపల పెరుగుతూ పోవచ్చు. ఈ స్థితిలో అతి సూక్ష్మస్థాయిలో పనిచేసే మందులు మాత్రమే వాడాలి. మందులు వ్యాధి లక్షణాలను తగ్గించడంతో పాటు వ్యాధినిరోధకంగా పనిచేసేవిగా ఉండాలి. మందులేవీ తీసుకోకుండా కేవలం వ్యాధినిరోధక శక్తిని పెంచుకోవడానికే పరిమితం కావడం ఈ దశలో సరికాదు. అలా చేస్తే వ్యాధినిరోధక శక్తి రెండు రెట్లు పెరిగే సరికి వ్యాధి ఎనిమిది రెట్లు పెరుగుతుంది. అందుకే వ్యాధిని తగ్గించే మందులతో పాటు, వ్యాధినిరోధక శక్తిని పెంచే మందులు కూడా తీసుకోవాలి.
 
సులువైన తయారీ
వ్యాధి చికిత్సకూ, వ్యాధినిరోధకానికీ ఒక ఔషధ తయారీని ఇక్కడ చెప్పుకుందాం. దీన్ని ఎవరికి వారు అతి సునాయాసంగా తయారు చేసుకోవచ్చు. పెద్ద ఖర్చేమీ లేకుండా సిద్ధం చేసుకునే ఈ మిశ్రమాన్ని అన్ని వయసుల వారూ వాడుకోవచ్చు . పైగా బొత్తిగా దుష్ప్రభావాలు ఉండ వు. మిశ్రమం కోసం గుప్పెడు తమలపాకులు, గుప్పెడు తులసి ఆకులు, గుప్పెడు ఓమ ఆకులు, సగం గుప్పెడు వేపాకులు (మరీ లేతవిగానీ, మరీ ముదురువి కానీ కాకుండా ) మూడు వెల్లుల్లి పాయలు, అరస్పూను మిరియాలు తీసుకోవాలి. వీటిని దంచకుండా చేతితో తుంచాలి లేదా కత్తిరించాలి. మిరియాలను మాత్రల చిన్న చిన్న రవ్వలయ్యేలా దంచాలి. చివరగా పావు చెంచా అతి మధురం (యష్టిమధు)కూడా తీసుకుని అన్నింటినీ రెండు గ్లాసుల నీటిలో వేయాలి.
 
చిన్న మంటతో రెండు గ్లాసుల నీరు ఒక గ్లాసు అయ్యేంత వరకూ మరిగించాలి. ఆ తరువాత వడపోసి తీసిన కషాయాన్ని నాలుగు భాగాలుగా చేసుకుని రోజుకు నాలుగు పూటలా తాగాలి. కషాయం కొంత చేదుగానూ, కాస్త ఘాటుగానూ ఉంటుంది కాబట్టి పిల్లల కోసమైతే తీపికోసం కొంచెం కండచెక్కర కలపాలి. పెద్దలకైతే ప్రతి పూటకూ అరచెంచా తేనె కలుపుకుని తాగవచ్చు. ఈ కషాయాన్ని వారం రోజుల పాటు తీసుకుంటే మంచిది. లేదంటే కనీసం మూడు రోజులు తాగినా చాలు. దీనివల్ల దగ్గు, జలుబు, జ్వరం వంటి లక్షణాలన్నీ పోవడంతో పాటు అద్భుతమైన వ్యాధి నిరోధక శక్తి వస్తుంది. ఇందులో వాడిన తులసి ఆకు, వేప ఆకు, వె ల్లుల్లి, యష్టిమధులల్లో వైర్‌సను హరించే అంశాలు పుష్కలంగా ఉన్నాయి. ఇది ఎన్నో పరిశోధనల్లో రుజువైన నిజం. అయితే, గర్భిణీ స్త్రీలు తాగే కషాయంలో మాత్రం యష్టిమదును వాడకూడదు. ఆ ఒక్క అంశాన్ని కలపకపోయినా అంత పెద్ద నష్టమేమీ ఉండదు. ఈ కషాయాన్ని తయారు చేసుకోవడం వీలు కాని వారికోసం ఆయుర్వేద ఔషధ దుకాణాల్లో కొన్ని మందులు లభిస్తాయి.
 
మహా సుదర్శన చూర్ణం
500 మి, గ్రా. మోతాదులో రోజుకు రెండు సార్లు పరగడుపున వేసుకోవాలి. అయితే ఇది బాగా చేదుగా ఉంటుంది. కాబట్టి ఈ చూర్ణాన్ని క్యాప్సుల్‌లో పెట్టుకుని వేసుకోవాలి.
 
మహా లక్ష్మీవిలాస రసం
శరీర ఉష్ణోగ్రత బాగా ఎక్కువగా ఉన్నప్పుడు ఈ చూర్ణం బాగా పనిచేస్తుంది. 125 మి. గ్రా. మోతాదులో తేనెతో కలిపి రోజూ రెండు పూటలా పరగడుపున వేసుకోవాలి.
 
త్రిభువన కీర్తి రసం
చిన్న పిల్లలకోసం ఇది మేలు. వారి వయసును బట్టి 65 నుంచి 125 మి గ్రాముల వరకు తేనెతో కలిపి రెండు పూటలా పరగడుపున ఇవ్వవచ్చు
 
కంటకారి లేహ్యం
శ్వాసకోశ సమస్యలు తీవ్రంగా ఉన్నప్పుడు ఉదయం ఒక స్పూను, సాయంత్రం ఒక స్పూను పరగడుపున తీసుకోవచ్చు.
 
చవన్‌ ప్రాశ్‌
శ్వాస సమస్యలతో పాటు, వ్యాధినిరోధక శక్తిని పెంచడానికి ఉదయం ఒక స్పూను, సాయంత్రం ఒక స్పూను పరగడుపున తీసుకోవచ్చు. అయితే ఆ తరువాత వెంటనే గోరువెచ్చని ఆవుపాలు గానీ, లేదా గోరు వెచ్చని నీళ్లుగానీ తీసుకుంటే అది సులువుగా జీర్ణమవుతుంది. ఏ జబ్బూ లేకపోయినా రోజూ చవన్‌ప్రాశ్‌ తీసుకుంటూ క్రమం తప్పకుండా ప్రాణాయామం చేస్తే వైరస్‌ సంబంధిత సమస్యలనుంచి చాలా వరకు దూరంగా ఉండవచ్చు.
 
ద్రాక్షారిష్టం
నాలుగు చెంచాల ద్రావణాన్ని ఎనిమిది చెంచాల నీటితో కలిపి ఉదయమూ, సాయంత్రమూ భోజనం తరువాత తీసుకోవాలి. ఇవన్నీ వ్యాధి నిరోధకంగానూ, చికిత్సగానూ పనిచేస్తాయి.
 
వ్యాధి తీవ్రతలో
వ్యాధి సోకి సమస్య చాలా తీవ్రంగా ఉన్నప్పుడు ఒక మిశ్రమాన్ని తయారుచేసి వాడుకోవచ్చు. వాటిలో స్వర్ణలఘు సూత శేఖరరసం మాత్రలను పొడి చేసి అందులో నింబాది చూర్ణం, తాలిసాది చూర్ణం, హరిద్రాకండ చూర్ణం కలుపుకుని రోజూ మూడు పూటలా 500 మి. గ్రాముల చొప్పున తేనెలో కలుపుకుని తీసుకోవాలి. శ్వాసకోశ సమస్య తీవ్రంగా ఉన్నప్పుడు నువ్వులనూనెలో కర్పూరం కలిపి గొంతు నుంచి ఛాతీ దాకా మర్ధన చేయాలి. మందులు వేసుకోవడం కూడా కష్టంగా ఉన్నప్పుడు నాలుగు చుక్కల వే ప నూనె ముక్కులో వేయాలి. ఇది మంచి యాంటీబయాటిక్‌గా పనిచేస్తుంది.
 
                                                                                                                                                                                                     - డా . డి. ప్రశాంత్‌ కుమార్‌
                                                                                                                                                                                                     ఆయుర్వేద వైద్య నిపుణులు