ఆయుర్వేదం అరికడుతుంది

25-09-2017: డెంగ్యూను ఆయుర్వేదం ‘వాతపిత్త జ్వరం’గా గుర్తిస్తుంది. అయితే సాధారణ జ్వరానికీ, డెంగ్యూ జ్వరానికీ మధ్య లక్షణాల పరమైన తేడాలు ఉన్నాయి. ఆ తేడాలు తెలియకపోతే అది డెంగ్యూ జర్వమని గానీ, దానికి సంబంధిత ప్రత్యేక చికిత్సలు అవసరమని గానీ గుర్తించకపోయే ప్రమాదం ఉంది.
 
డెంగ్యూ లక్షణాలు
డెంగ్యూ వ్యాధిలో ప్రధానంగా మూడు లక్షణాలు కనిపిస్తాయి.
తలనొప్పితో పాటు కళ్లు లాగడం, కళ్లనొప్పి ఉంటాయి. వీటితో పాటు ఒంటి నొప్పులు, కండరాల నొప్పులు, ఎముకలు విరిచేస్తున్న నొప్పి కూడా ఉంటాయి.
వాంతులు కావడం లేదా వికారం ఉంటాయి.
చర్మం మీద అక్కడక్కడా దద్దుర్లలా కాకుండా శరీరంలో అత్యధిక భాగం ఎర్రబారుతుంది.
ఇవి డెంగ్యూ బాధితుల్లో కనిపించే ప్రధాన లక్షణాలు. అందరిలో ఈ మూడూ కాకపోయినా వీటిలోని ఏ రెండు లక్షణాలైనా తప్పనిసరిగా ఉంటాయి.
ఈ లక్ష ణాలతో పాటు చర్మాన్ని ఎక్కడైనా నొక్కితే అప్పటిదాకా ఎర్రగా ఉన్న చర్మం కాసేపు తెల్లగా కనిపిస్తుంది. డెంగ్యూ వైరస్‌ ఎముక మజ్జను దెబ్బ తీయడం వల్ల రక్తంలోని ప్లేట్‌లెట్ల సంఖ్య పడిపోతుంది. పలితంగా గడ్డకట్టే తన సహజ లక్షణాన్ని రక్తం కోల్పోతుంది. అందుకే రక్రస్రావం అయ్యే పరిస్థితి ఏర్పడుతుంది. .
డెంగ్యూలో కనిపించే ఒంటి నొప్పులు, తలనొప్పి, వాంతులు అనేవి వాత లక్షణాలు. చర్మం ఎర్రబారడం అనే ది పిత్త లక్షణం. ఈ రెండు లక్షణాలూ ఉండడం వల్ల ఆయుర్వేదం డెంగ్యూనూ ‘వాతపిత్త జ్వరం’గా పేర్కొంటుంది.

ఇంట్లో చేసుకుని తాగచ్చు!

ఏ రకమైన జ్వరమైనా శరీరంలోని ద్రవాలు తగ్గిపోతాయి. ద్రవాంశం తగ్గినప్పుడు సహజంగానే శరీర ఉష్ణోగ్రత పెరుగుతుంది. అందుకే శరీరాన్ని చ ల్లబరిచే గుణాలున్న ద్రవాలు, ఔషధాలు ఇవ్వాలి.
వాటిలో ప్రధానంగా..... ధనియాల పొడి, ఉసిరి పొడి, వాస, పర్పతి, యాలకులు, వీటితో పాటు అతి మధురం, చందనం గానీ, రక్తచందనం గానీ, కండ చక్కెర గానీ కొద్ది మోతాదులో కలిపి మిశ్రమాన్ని తయారు చేసుకోవాలి.
ఒక లీటర్‌ మామూలు నీళ్లలో రెండు చెంచాల మిశ్రమాన్ని కలిపి ఉంచుకోవాలి.

ఆ తర్వాత వాస - 20 గ్రాములు, పటిక భస్మం 10 గ్రాములు, తుంగ ముస్తలు 10 గ్రాములు, అమృత సత్వం 20 గ్రాముల మిశ్రమాన్ని తయారుచేసుకున్న ద్రావణంలో పావు చెంచా చొప్పున మిళితం చేసుకుని, మూడు పూటలా తాగాలి.

వేసుకోవాల్సిన మాత్రలు
ద్రావణం తాగడంతోపాటు వైర్‌సను, తగ్గించడానికీ, వ్యాధి నిరోధక శక్తిని పెంచడానికీ సుదర్శనా ఘనవటి మాత్రలు పూటకు ఒకటి చొప్పున మూడు పూటలా వేసుకోవాలి.
అలాగే శంశమనివటి మాత్రలు పూటకు ఒకటి చొప్పున, మూడు పూటలా వేసుకోవాలి.
వీటితో పాటు అమృతోత్తర కషాయం రెండు చెంచాలు ఉదయం, రెండు చెంచాలు సాయంత్రం తీసుకోవాలి. దీనితో డెంగ్యూ సమస్యలు చాలా వరకు తగ్గుతాయి.
అప్పటికీ ఉండే మరో ప్రధాన సమస్య ప్లేట్‌లెట్‌లు పడిపోవడం. దీనికి బొప్పాయి చెట్టు లేత ఆకుల్ని దంచి, రెండు చెంచాల మోతాదులో రెండు పూటలా నేరుగా తినేయాలి. దీంతో ప్లేట్‌లెట్ల సంఖ్య పెరగడం మొదలవుతుంది.
- డాక్టర్‌. డి. విఠల్‌ రావు,
రిటైర్డ్‌ ప్రొఫెసర్‌, ప్రభుత్వ ఆయుర్వేద కళాశాల, హైదరాబాద్‌