పరగడుపున పొట్టను శుభ్రపర్చడం ఎలా?

ఆంధ్రజ్యోతి, 31/08/2014: నిద్ర లేచిన దగ్గర నుంచి టిఫిన్‌ తినే ముందు వరకు ఉన్న సమయాన్ని పరగడుపు సమయం అంటారు. ఈ సమయంలో 2 నుంచి 3 లీటర్ల వరకు నీటిని తాగవచ్చు. ఎవరి స్థితిని బట్టి వారు ఇబ్బంది పడకుండా తాగండి. ఫ్రిజ్‌లో పెట్టిన నీరు తాగవద్దు. రాగి పాత్ర ఉన్నవారు రాత్రి అందులో నీరు పోసి ఉదయాన్నే తాగడం శ్రేష్ఠం. కడుపులో మంటలు, పేగుపూత లేదా అల్సర్‌, ఆస్తమా, దగ్గు లేదా కఫం, ముక్కురొంప, ఇస్నోఫిలియా మొదలగు ఇబ్బందులున్న వారు నీటిని గోరువెచ్చగా చేసుకుని తాగడం మంచిది. ఇలా సమస్యలు తగ్గేవరకూ చేయాలి. 

మొదటి దఫా నీరు 
నిద్ర లేచిన వెంటనే అవసరమైతే మూత్రానికి వెళ్లివచ్చి, నోరు వాసనగా ఉంటే పుక్కిలించి ఊసి నీటిని తాగడం ప్రారంభించండి. సీసాతో గానీ చెంబుతో గానీ నిండుగా తీసుకొని ఎత్తి పట్టుకొని తాగడానికి ప్రయత్నించండి. ఒక్క బిగువన ఎంత వరకు ఇబ్బంది లేకుండా తాగగలిగితే అంత నీరు తాగండి. లీటరు కంటే తక్కువగా నీరు తాగిన వారు 4, 5 నిమిషాలు విశ్రాంతి ఇచ్చి మిగతా నీటిని తాగే ప్రయత్నం చేయవచ్చు. మరీ కష్టంగా ఉంటే మళ్లీ 2, 3 నిమిషాలు ఆగి తాగవచ్చు. మొత్తంమీద ఒక్కసారిగా గానీ, 2, 3 సార్లుగా గానీ 5, 6 నిముషాల వ్యత్యాసంలో లీటరు నుంచి లీటరున్నర వరకు మీ ఓపికను బట్టి (లీటరుంపావు-మధ్యస్తంగా అందరికీ బాగుంటుంది) నీటిని తాగండి. కొత్తలో కొన్ని రోజులు వికారంగా ఉండడం గానీ, తిప్పడం గానీ, వాంతులు కావడం గానీ జరగవచ్చు. అయినా ఏమీ కాదు. అలాంటి వారు కొద్దిగా నీటిని తగ్గించి తాగడం మంచిది. ఇలా నీటిని తాగాక మీరు టీవీ చూసినా, కబుర్లు చెప్పుకున్నా, పేపరు చదువుతున్నా, పనిలో పడినా మీకు విరేచనం సాఫీగా కాదు. విరేచనం లేచిన వెంటనే జాడించి వెళ్లాలంటే నేను చెప్పినట్లు చేస్తే తేలిగ్గా పనవుతుంది.
 
నీళ్లను తాగాక మీ మనసును, ఆలోచనలను పొట్ట, పేగులపై (బొడ్డు కిందిభాగం) పెట్టి 5, 10 నిముషాల అటూ ఇటూ నడుస్తూ పరిశీలించండి. మీరు తాగిన ఎక్కువ నీటి బరువు మీ మలం పేగుపై పడి మలాన్ని ముందుకు గెంటుతూ ఉంటుంది. వేరే ఆలోచనలు మీరు చేయకపోతే మలం పేగుకు ఉండే నరాలు బాగా రిలాక్సయ్యి ఎక్కువ మలం జరిగి ముందుకు వస్తుంది. నీళ్లు తాగాక పేగులపై మనసు లగ్నం చేయడమనేది సుఖ విరేచనానికి అతి ముఖ్యమైన రహస్యం. బాగా అర్జంట్‌ అయ్యేవరకు బయటే తిరగండి. ఇక ఆపుకోలేకుండా వచ్చేస్తున్నదీ అన్నపుడు దొడ్లోకి వెళితే, ఒకే ఇన్‌స్టాల్‌మెంటులో ముక్కకుండా తేలిగ్గా పడిపోతుంది. మీకు హమ్మయ్య ! అనిపిస్తుంది. ఇలా మొదటి విరేచనం అయితే మీరు నిన్న మధ్నాహ్నం తిన్న భోజనం తాలూకు మల పదార్థం పూర్తిగా బయటకు వచ్చేస్తుంది. మీరు తాగిన నీరు పొట్ట, పేగుల నుంచి 15, 20 నిముషాల్లో రక్తంలోనికి వెళ్లి, అక్కడ నుంచి కణాలలోనికి వెళ్లి కాలుష్యాన్నంతా నానబెడుతుంది. నీళ్లను తాగిన 20 నిమిషాల తర్వాత ఏదన్నా పని చేసుకోవచ్చు లేదా వ్యాయామాలు చేయడం ప్రారంభించవచ్చు. మొదటిసారి నీరు తాగి విరేచనం అయ్యాక ఎవరన్నా వ్యాయామం చేసినా లేదా రెక్కలు కదిలే పనులు చేసుకున్నా ప్రాణవాయువు లోపలకు బాగా వెళ్లి లోపల ఉన్న చెడు బాగా దహనం చెంది, అదంతా బాగా నీటిలో కరుగుతూ ఉంటుంది.
 
రెండవ దఫా నీరు 
మొదటిసారి లీటరు నీటిని మాత్రమే తాగిన వారు గంట విరామం తర్వాత రెండవ దఫా నీరు తాగవచ్చు. మొదటిసారి లీటరుంపావు తాగిన వారు గంటంపావు గ్యాప్‌, లీటరున్నర తాగిన వారు గంటన్నర గ్యాప్‌ ఇవ్వడం మంచిది. ఇలా తాగితే శరీరానికి ఇబ్బంది ఉండదు. కొంతమంది టైమ్‌ లేక తొందరగా రెండవసారి నీరు తాగేసరికి ముఖం ఉబ్బడం, తల డిమ్‌ అవ్వడం, కళ్లు తిరగడం జరుగుతాయి. అలా ఎవరూ చేయకండి. నీటిని మళ్లీ ముందులా బాటిల్‌లో గానీ చెంబులో గానీ తీసుకొని లీటరు నుంచి లీటరుంపావు వరకు 5, 6 నిమిషాల గ్యాప్‌లో తాగడానికి ప్రయత్నించండి. అలా నీటిని తాగాక మనసును పేగులపై పెట్టి అటూ, ఇటూ నడుస్తూ రెండవ విరేచనం అవ్వడానికి ప్రయత్నించండి. మొదటిసారే చాలా వెళ్లిపోయింది, ఇంకా ఏముంటుంది అని అనిపించవచ్చు లేదా ఒకసారి వెళితే రోజుకు సరిపడా అనుకోవచ్చు. ఇది పొరపాట. మన విరేచనం పేగు మీటరున్నర పొడవు ఉంటుంది. మొదటిసారి వచ్చిన విరేచనం అర మీటరు భాగం పేగులోనిదై ఉంటుంది. మిగతా పేగులోని బోలెడు మలమంతా మొదటి విరేచనం అయిన అరగంటలోనే మలద్వారం వద్దకు జరిగి విసర్జనకు రెడీగా ఉంటుంది. మీరు నేను చెప్పినట్లు ప్రయత్నం చేయండి.
 
అర్జెంట్‌ అనిపించే వరకూ బయటే తిరగండి. అప్పుడు వెళ్లండి. రెండవ విరేచనం ఇంకా సాఫీగా, కాస్త పలుచగా, మరికొందరికి నీళ్లలా వచ్చేస్తుంది. నీళ్లుగా రెండవ విరేచనం అయినా కంగారు పడనవసరం లేదు. మనం తాగిన నీళ్లే కొన్ని అలా వచ్చి పేగుల్ని క్లీన్‌ చేస్తున్నాయి. రెండవ విరేచనంలో వచ్చే మల పదార్థం నిన్న సాయంకాలం తిన్న టిఫిన్‌ తాలూకు, రాత్రి తిన్న భోజనం తాలూకు పదార్ధమై ఉంటుంది. ఇలా రెండు విడతలా విరేచనం అయితే మీ పేగు మొత్తం పూర్తిగా పరిశుభ్రం అయినట్లుగా భావించండి. కొంతమందికి రెండవసారి విరేచనం అవ్వదు. కంగారు వద్దు. నిదానంగా దారిలో పడుతుంది. మీరు తాగిన రెండవ దఫా నీరు 15, 20 నిముషాల్లో మీ రక్తంలోనికెళ్లి ఇంతకు ముందు నానిన కాలుష్యాన్ని, రక్తంలోని దోషాలను పట్టుకొని అటు చెమట గుండా, ఇటు మూత్రం గుండా బయటకు లాక్కొచ్చేస్తుంది. ఇలా రెండు దఫాలుగా మీరు తాగిన నీరు మీలోని 5 లీటర్ల రక్తాన్ని, 70 శాతం నీటిని, కోటానుకోట్ల జీవకణాలను స్నానం చేయిస్తుది. ఇన్నాళ్ళూ మనకు పైకి స్నానం చేయడమే తెలిసింది గానీ లోపలకు స్నానం చేయడం ఇప్పుడు తెలుసుకున్నారు. మన శరీరం తనలో ఉన్న కాలుష్యాన్ని తెల్లవారుజాము సమయం నుంచి టిఫిన్‌ తినే ముందు వరకూ బయటకు గెంటుకునే ప్రయత్నంలో ఉంటుంది. కాబట్టి మనం పరగడుపున నీటిని తాగి శరీరానికి భారాన్ని తగ్గించిన వారమయ్యాం. ఇలా ప్రతిరోజూ మనం శరీరానికి అవసరమైన నీటినిచ్చి ఆరోగ్యాన్ని పుచ్చుకుందాం. మొదటి, రెండవ దఫాలలో నీటిని బాగా తక్కువ తాగిన వారు మూడవ దఫాగా ఇంకొంచెం తాగవచ్చు. అలవాటులో నీటిని రెండు దఫాలుగా ముగించి వేయడం మంచిది. ప్రయాణాల్లో లేదా ఎప్పుడన్నా కుదరనప్పుడు కాస్త సడలించుకోండి.

ఆరోగ్యానికి సంబంధించి డాక్టర్‌ మంతెన సత్యనారాయణరాజు ఉచిత సలహాల కోసం ప్రతి రోజు ఉదయం 7 నుంచి 10 గంటల వరకూ 9848021122కు కాల్‌ చేయవచ్చు.