వండిన ఆహారం తినొచ్చా..?

ఆంధ్రజ్యోతి, 12/10/2014: ఆహారంలోని వివిధ రకాల పోషక పదార్థాలు శరీరంలోని వివిధ అవయవాల తయారీకి ఉపయోగపడతాయి. ఈ శరీరాన్ని ప్రతిరోజూ వాడుకుంటూ ఉంటే ఇందులోని పోషక పదార్థాలు తరుగుతూ ఉంటాయి. ఏ రోజు తరుగుదలను ఆ రోజు మంచి ఆహారం ద్వారా పూరిస్తుంటే శరీరంలోని అవయవాలు అలసట లేకుండా సవ్యంగా పనిచేస్తూ ఉంటాయి. 

కారును ప్రతిరోజూ నడుపుతూ ఉంటే ఆయిలు, గాలి, నీరు, ఇంజన్‌ ఆయిల్‌ మొదలగునవి ఎంతో కొంత అరుగుతూ ఉంటాయి. మనం వాటిని మళ్లీ భర్తీ చేస్తూ ప్రయాణం చేస్తూ ఉంటాం. ఏది ఎంత తగ్గితే, దాన్ని అంతే తిరిగి పోస్తూ ఉంటాం. మన శరీరంలో ఏ రోజు వచ్చిన తరుగుదలను ఆ రోజు సరిగా పూరిస్తున్నామా? పూరిస్తే శరీరానికి లోపాలెందుకొస్తాయి. లోపాలు వస్తున్నాయంటే మనం అందించే ఆహారంలోనే లోపాలున్నట్లు అర్ధం కాలేదా? అదే ఉడికిన ఆహారం . ఈ ప్రకృతిలో మనిషి తప్ప ఏ ప్రాణీ ఆహారం యొక్క సహజరూపాన్ని మార్చి ఉడికించి తినే ప్రయత్నం చేయడం లేదు. అందుచేతనే వాటికి కళ్లు, కాళ్లు, కీళ్లు, కండరాలు, నరాలు చివరకు అన్ని అవయవాలు ఆయుష్షు ఉన్నంత వరకూ పూర్తిగా పనిచేస్తున్నాయి. అంటే అవి తీసుకునే ప్రకృతి సిద్ధమైన ఆహారం మన శరీర అవసరాలకు కావాల్సిన సకల పోషక పదార్థాలు ఏ పాళ్లలో ఉండాలో, ఏ స్థితిలో ఉంటే శరీరం గ్రహించగలదో ఆ రూపంలో ఉండి మనం తినడానికి అనువుగా రకరకాల రుచులతో రకరకాల రూపాలతో రూపొందించబడింది. నాగరికత పెరిగాక మనం సదుపాయం కోసం వండుకోవడం ప్రారంభించాం. వంట వల్ల వచ్చే సదుపాయం కేవలం నోటికి, నాలుకకు మాత్రమే గదా! ఈ రెండు అవయవాలు సంతోషించినా బారెడు శరీరం మాత్రం అవస్థ పడుతూనే ఉంది. దేనినైనా కాల్చడం, బూడిద చేయడం, నాశనం చేయడం అగ్నికున్న గుణాలు. మనల్ని పెంచి పోషించాల్సిన ఆహారాన్నే మనం అగ్నికి సమర్పిస్తుంటే, చివరకు అందులో మన అవసరాలు ఇంకా ఏమి మిగిలి ఉంటాయి.
 
దాన్ని తింటే మన శరీరానికొచ్చే లాభమేమిటి? ఆహారాన్ని వండడం వల్ల అందులో ఉండే ఎంజైమ్‌లు పూర్తిగా నశిస్తాయి. విటమిన్లు మూడువంతులు ఆవిరి అయిపోతాయి. ప్రాణశక్తులు, జీవశక్తులు నశిస్తాయి. ఆహారంలో ఉండే తేలిగ్గా జీర్ణమయ్యే స్థితి మారిపోతుంది. మాంసకృత్తులు, కొవ్వు పదార్థాలు రూపాంతరం చెంది శరీరానికి భారంగా మారతాయి. పైగా ఆహారంలో ఉండే రోగనిరోధక శక్తి అంతా పోయి రోగాన్ని పెంచే శక్తిగా మారుతుంది. ఇన్ని విధాలా మైనస్‌ పాయింట్లున్న ఆహారాన్ని రోజుకు 3, 4 సార్లుగా తింటూ జీవితంలో ఆరోగ్యంగా బతకాలని కోరుకుంటున్నాం. ఉడికిన ఆహారం అంటే మైనస్‌ ఆహారం. అందుకే దీన్ని నెగెటివ్‌ ఫుడ్‌ అనవచ్చు. ప్రకృతి సిద్ధమైన ఆహారం అంటే ప్లస్‌ ఆహారం. దీన్ని పాజిటివ్‌ ఫుడ్‌ అనవచ్చు. మన ఆరోగ్యం పెరగాలన్నా, తరగాలన్నా మనం తినే ఆహారాన్ని బట్టి ఉంటుంది. ఆహారాన్ని వండితే ఎంత నశిస్తుందనేది ఇంకొక ఉదాహరణ ద్వారా చెబుతాను.
 
మనం సంవత్సరానికి సరిపడా సరుకులు తెచ్చుకొని, ఎండాకాలంలో రెండు రోజుల పాటు వాటిని బాగా ఎండలో ఎండనిచ్చి, డబ్బాలో దాచుకుంటే మళ్లీ వచ్చే సంవత్సరం వరకు పుచ్చకుండా నిల్వ ఉంటాయి. ఆ సరకులను ఎండలో పెట్టడం బదులుగా మూకుడులో దోరగా వేయించి నిల్వ చేయండి. అవి 10, 15 రోజుల్లో మెత్తబడి వెంటనే పుచ్చిపోతాయి. రైతులు పొలంలో నారు పోసేముందు గింజలను ఎండబెట్టి, ఆ తర్వాత మొక్కకట్టుకుంటారు. ఆ గింజలను ఎండకు బదులుగా వేడిచేసి నారు పోస్తే ఒక్క గింజ కూడా మొలకెత్తదు. ఆ కొద్ది వేడికే ఆ గింజలోని ప్రాణశక్తులు, జీవ పదార్థాలు అంత నశిస్తుంటే, మనం రోజూ వండే వంటల్లో, వేయించుకునే వాటిల్లో మన కోసం అగ్నిహోత్రుడు ఏమన్నా మిగుల్చుతాడా? మనం కూరలను వండుకునేటప్పుడు అవి సుమారు 100 డిగ్రీల వద్ద వేడిచేసినా, నూనెలో వేయించినా, నూనెలో దేవినా ఆ పదార్థం 300 డిగ్రీల వేడికి గురవుతుంది.
 
విటమిన్ల లోపం నివారణకు మందులా? 
వండిన ఆహారం తినబట్టే, అవసరాలకు కావాల్సిన పోషక పదార్థాల అప్పు కోసం శరీరం ఎదురు చూస్తోంది. దాన్ని నివారించడానికి వైద్యులు వాటికి సంబంధించిన మందు బిళ్లలను (కాల్షియం, విటమిన్‌, మినరల్‌ బిళ్లలు) ప్రతి రోగికి తప్పనిసరిగా వాడమని చెపుతున్నారు. ఆ విటమిన్ల లోపాన్ని నివారించుకోవడానికి మందులు మింగాలని తెలుస్తుంది కానీ మంచి ఆహారాన్ని తిననందుకు నాకు ఈ లోపం వచ్చింది, ఇకనైనా తప్పనిసరిగా తిందాం అని మాత్రం తెలియడం లేదు. కనీసం రోగం వచ్చాక అయినా తెలియాలి గదా! నాకు అది కావాలి, నాకు ఇది కావాలని శరీరం రోగం రూపంలో ప్రాధేయపడుతున్నది గదా! అయినా దాని గోడు వినిపించుకోకపోతే శరీరం ఏమి చేస్తుంది. నష్టం మనకే దగా. అనుభవించాల్సింది మనమే గదా! కాబట్టి ప్రకృతి మన కోసం అందించిన ఆహారాన్ని ప్రతిరోజూ తినడానికి మళ్లీ మనం అలవాటు పడితే, ఈ శరీరం మంచి రోజులు మళ్లీ తిరిగివస్తాయి. రేపటినుంచి కనీసం 50, 60 శాతమన్నా వండకుండా ప్రకృతి సిద్ధమైన ఆహారాన్ని యథావిధిగా తినండి. క్రమేపీ 75 శాతం సహజ ఆహారాన్ని తినడానికి అలవాటు పడవచ్చు. అవకాశమొచ్చినపుడు పూర్తిగా రోజంతా సూర్యాహారాన్నే తినండి. ఇలాంటి మంచి పనిచేసి మనల్ని మనమే రక్షించుకుందాం.
 
వండకపోతే శరీరానికి హాని కాదా? 
ఈ రోజుల్లో ప్రతి ఒక్కరి మనసుల్లో మెదిలే ప్రశ్న ఇది. ఆహారాన్ని వండకపోతే అందులో ఉన్న సూక్ష్మజీవులు, హాని కలిగించే క్రిములు, వాటి గుడ్లు మన శరీరంలోనికి నేరుగా వెళ్లి ప్రాణహాని కలిగించే అవకాశముంటుంది కదా అనుకుంటారు. ఆహారాన్ని వండి తింటే ఈ దోషాలన్నీ శుద్ధి చేయబడతాయని ఆలోచిస్తూ ప్రకృతిలో లభించే సహజ ఆహారాన్ని తినడానికి వెనడుగు వేస్తున్నారు. ఆహారాన్ని వండినపుడు నష్టం కలిగించే వాటితోపాటు ప్రాణాన్ని ఎక్కువ రోజులు నిలిపే మనకు లాభాన్ని కలిగించే జీవపదార్ధం అంతా పోతున్నది. ఆ క్రిముల వల్ల వచ్చే నష్టం కంటే, మనం తప్ప అన్ని జీవులు ఆహారాన్ని సహజంగా ఉన్నది ఉన్నట్లుగా తింటున్నప్పటికీ ఆ క్రిమికీటకాదులు ఆ జీవులను ఏ రకమైన ఇబ్బందులకు గురి చేస్తున్నాయో చెప్పండి. వైరస్‌ జ్వరాలు గానీ, మలేరియాలు గానీ, టైఫాయిడ్‌లు గానీ, విరేచనాలు, వాంతులు గానీ వాటికి మనలాగా రావడం లేదే! ప్రస్తుతం మనమందరం తినేది సాంతం ఉడికినదే. రోజంతా ఇదే. మనకు ఏ ఇన్ఫెక్షన్‌లు రోగాలు అసలు రాకుండా ఉంటే అది నిజం అనుకోవచ్చు. ఉండాల్సిన జబ్బులన్నీ మనిషికే ఉన్నాయి.
 
మనం తినబోయే ఆహారంలో ఏవన్నా హాని కలిగించే సూక్ష్మజీవులుంటే వాటినుంచి రక్షించే శక్తి మన పేగులలోనూ మన లివర్‌లోనూ బోలెడుంది. వాటి సంగతి అవి చూసుకుంటాయి. మనం పూర్తిగా ఉడికినవి, అందులో నూనె, నేతులు వేసుకొని తింటూ ఉంటే మన పేగులు, లివరు పూర్తిగా బలహీనమై పోతున్నాయి. ఇంకా మనల్ని ఏమి రక్షించగలవు ? ఇంకొకటి మీరు ఆలోచించండి. ఈ ప్రకృతిలో క్రిమికీటకాదులు అనేవి సహజం. అవన్నీ జీవితంలో భాగాలు మనం సహజమైన ఆహారం తింటూ, సహజంగా జీవిస్తూ ఉంటే, ఆ క్రిములు శరీరంలో సహజంగా సంహరించబడతాయి. పంది తినే ఆహారం నిండా క్రిమికీటకాదులే ఉంటాయి. అయినా పందికి రోగనిరోధక శక్తి బాగా ఎక్కువట. పందిని ఆ నీచాహారం తినమని పుట్టించిన ప్రకృతి, ఆ నీచాన్నుండీ రక్షించే శక్తిని పందికివ్వకుండా తినమని బుద్ధి పుట్టించదు కదా! మనం ఇతర చెత్తలు తినడం మానితే మనలో ఒరిజినల్‌ పవర్‌ బోలెడు మిగులుతుంది. బెండకాయ, వంకాయ, కాలిఫ్లవర్‌ మొదలగు కూరలు వండుకోవడానికి కోసుకునే ముందు, అందులో పురుగులున్నాయేమోనని జాగ్రత్తగా ఏరి మరీ కోసుకుంటారు. ఆ పురుగులను ఏరి మరీ ఇష్టంగా తినే పిట్టలను, కోళ్లను కావాలని కోసుకొని కేజీకి తగ్గకుండా తింటారు. అక్కడ సహజంగా వచ్చే పురుగులను వద్దనడం ఎందుకు, ఇక్కడ కావాలని పురుగులతో తయారైన మాంసాన్ని కోరుకోవడం ఎందుకు?

ఆరోగ్యానికి సంబంధించి డాక్టర్‌ మంతెన సత్యనారాయణరాజు ఉచిత సలహాల కోసం ప్రతి రోజు ఉదయం 7 నుంచి 10 గంటల వరకూ 9848021122కు కాల్‌ చేయవచ్చు.