చికున్‌గున్యాకు చెక్‌

09-09-2019: కీళ్లనొప్పులుతో, ఒళ్లు నొప్పులతో చికున్‌గున్యా నిలువెల్లా ఛిద్రం చేస్తుంది. భరించరాని నొప్పులకు మారుపేరుగా నిలిచే ఈ వ్యాధి అదే పేరుగల వైరస్‌ సోకడం ద్వారా సంక్రమించే సమస్య.
 
ఎందుకొస్తుంది?
ఎక్కువగా 50 ఏళ్లకు పైబడిన వారిలో, వ్యాఽధి నిరోధక శక్తి తగ్గిపోయిన వారిలోనే చికున్‌గున్యా వైరస్‌ ప్రభావం ఎక్కువగా కనిపిస్తుంది. జీర్ణశక్తి లోపించినవారిలో, జీవ క్రియలు కుంటుపడిన వారిలోనే ఈ వైరస్‌ తీవ్రత కనిపిస్తుంది.
 
ఏం తినాలి?
జ్వరంతో పాటు జీర్ణక్రియ మందగించడంతో ఆహార పదార్థాలు, ‘ఆమవిషం’ గా మారతాయి. ఈ స్థితిలో జీర్ణవ్యవస్థ పైన మరింత భారం పడకుండా, తేలికగా జీర్ణమయ్యే పదార్థాలు తీసుకోవాలి.
ద్రవాహారమైతే మరీ మేలు. ముఖ్యంగా జావ, అంబలి, పండ్లు, పండ్ల రసాలు, పలుచని పాలు, మజ్జిగ, పలుచని పప్పు, ఉడికించిన కూరగాయల రసం, కొబ్బరి నీళ్లు, గోరువెచ్చని నీళ్లు తీసుకోవాలి.
గృహ వైద్యం!
ధనియాలు లేదా శొంఠి కషాయాన్ని అరకప్పు మోతాదులో రోజుకు నాలుగు సార్లు సేవిస్తే, జ్వరంతో పాటు నొప్పులూ తగ్గుతాయి.
శొంఠి కషాయంలో ఒక చెంచా ఆముదం కలిపి తీసుకుంటే, నొప్పులు తగ్గడంతో పాటు పేగులు శుభ్రపడి జీర్ణశక్తి పెరుగుతుంది.
తిప్పతీగ రసం గానీ, కషాయం గానీ తాగితే జ్వరం తగ్గడంతో పాటు రోగ నిరోధక శక్తి పెరుగుతుంది.
ఉసిరి, నిమ్మరసాలను నిత్యం తాగాలి. వీటితో పాటు నీళ్లు కలపకుండా తీసిన తిప్పతీగ రసం, రోజూ ఒక స్పూను చొప్పున పరగడుపున తీసుకోవాలి.
ఒక కప్పు పాలు, 8 కప్పుల నీళ్లు కలిసిన ద్రావణంలో 5 గ్రాముల వెల్లుల్లిపాయల గుజ్జును కలిపి మరిగించాలి. కప్పు పాలు మాత్రమే మిగిలేదాకా మరిగించి ఆ తర్వాత చల్లార్చి పరగడుపున రోజుకోసారి తాగాలి.
బొప్పాయి ఆకు రసాన్ని ఒక స్పూను తేనెతో కలిపి సేవిస్తే రోగనిరోధానికీ, వ్యాధినిరోధకశక్తికీ తోడ్పడుతుంది.
చికిత్సా విధానం!
ఆకలిని సంరక్షించడం, శరీరంలోని ఆమ్ల, విష ఘటకాలను (ధాతుగత అమం) నిర్వీర్యం చేయడం, నొప్పులు, జ్వరానికి ఉపశమన మందులు వాడటం, రోగ నిరోధకంగా పని చేసే రసాయన మందులను శక్తికారక మందులను ఇవ్వడం ద్వారా చికున్‌గున్యాను తగ్గించే వీలుంది.
 
-డాక్టర్ డి. ప్రశాంత్ కుమార్ 
ఆయుర్వేద వైద్య నిపుణులు
గురు ఆయుర్వేద క్లినిక్, హైదరాబాద్