బాబోయ్‌.. బీపీ, షుగర్‌

రాష్ట్రంలో బీపీ, షుగర్‌ వ్యాధిగ్రస్తుల సంఖ్య ప్రమాదకరస్థాయిలో పెరుగుతోంది. 30 ఏళ్లు దాటిన చాలా మంది వీటి బారిన పడుతున్నారు. ప్రభుత్వం నిర్వహిస్తున్న ఎన్‌సీడీ స్ర్కీ నింగ్‌లో ఆందోళనకు గురిచేసే గణాంకాలు వెల్లడవుతున్నాయి. దేశంలో అత్యధికంగా రక్తపోటు, మధుమేహ బాధితులున్న రాష్ట్రంగా ఇప్పటికే కేరళ పేరుగాంచింది. తెలంగాణ త్వరలోనే ఆస్థానంలో చేరుతుందనిపిస్తోంది. అంటువ్యాధులు కాని వ్యాధులతో ఎంతమంది బాధపడుతున్నారో గుర్తించే ఎన్‌సీడీ స్ర్కీనింగ్‌ ప్రొగ్రామ్‌ను కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ ఆదేశాలతో రాష్ట్రంలో 2017 నుంచి చేపట్టారు. 33 జిల్లాల్లో 3 దశల్లో కార్యక్రమం చేపట్టాలని నిర్ణయించారు. తొలిదశ స్ర్కీనింగ్‌ 12 జిల్లా ల్లో నడుస్తుండగా, ఫిబ్రవరి 15నుంచి మరో 11 జిల్లాల్లో కొనసాగుతోంది. జూన్‌ నుంచి మిగిలిన జిల్లాల్లోనూ ఎన్‌సీడీ నిర్వహించి ఆగస్టు నాటికి రాష్ట్రవ్యాప్తంగా పూర్తి చేయాలని వైద్య ఆరోగ్యశాఖ నిర్ణయించింది.