అంతా ‘ఫెయిర్‌’ ఏనా?

30-5-2017: దేశంలో యేటా 3 వేల కోట్ల ఫెయిర్‌నెస్‌ క్రీమ్‌ల వ్యాపారం జరుగుతోందంటే వీటికున్న డిమాండ్‌ను అర్థం చేసుకోవచ్చు. అయితే తెల్లనివన్నీ పాలు కానట్టే! చర్మాన్ని తెల్లగా మార్చే ఈ క్రీములన్నీ సురక్షితమైనవి కావు. వీటిలో దాదాపు 10 శాతం క్రీమ్‌లలో హానికారక స్టిరాయిడ్లు ఉంటున్నాయని డాక్టర్లు హెచ్చరిస్తున్నారు.

చర్మపు రంగు గురించిన స్పృహ పెరిగిపోతోంది. ఈ తీరుతో కొత్త కొత్త ఫెయిర్‌నెస్‌ క్రీమ్‌ల తయారీ పెరిగింది. వైద్యుల ప్రిస్ర్కిప్షన్‌తో పని లేకపోవటం, మార్కెట్లో తేలికగా దొరుకుతుండటంతో వీటి వాడకం కూడా పెరిగిపోతోంది. చర్మాన్ని తెల్లబరుస్తాయని అంటే చాలు! ఎంత డబ్బైనా వెచ్చించి వాటిని కొనుగోలు చేసే యువత శాతం క్రమేపీ పెరుగుతోంది. అయితే...ఇలా దొరికే ఫెయిర్‌నెస్‌ క్రీములన్నీ సురక్షితం కావు. చర్మం మీద ప్రభావం చూపించి తెల్లగా  మార్చటం కోసం వీటిలో స్టెరాయిడ్లు, బ్లీచింగ్‌లు కలుపుతున్నారు. వీటి వల్ల తాత్కాలికంగా చర్మం తెల్లబడినట్టు అనిపించినా దీర్ఘకాలంలో తిరిగి సరిదిద్దలేని చర్మ సమస్యలు తలెత్తుతాయంటున్నారు వైద్యులు. 
స్టెరాయిడ్లు, బ్లీచింగ్‌లు దుష్ప్రభావాలు

ఇవి చర్మం పై పొర తొలగిపోయేలా చేస్తాయి. దాంతో చర్మం అడుగునున్న తెల్లని పొర బయటపడి చర్మం తెల్లబడినట్టు అనిపిస్తుంది. కానీ తిరిగి తొలగిపోయిన చర్మపు పొర తయారయ్యే సమయం ఇవ్వకుండానే పదే పదే స్టిరాయిడ్‌లతో తయారైన ఫెయిర్‌నెస్‌ క్రీమ్స్‌ వాడటం వల్ల చర్మపు పొరలు తొలగిపోయి పుండ్లు పడతాయి. ఇన్‌ఫెక్షన్లు బాధిస్తాయి. చర్మం పలుచగా తయారై మరింత సున్నితమవుతుంది. ఎండకు గురైతే కమిలిపోవటం, సన్‌ ట్యాన్‌ సమస్యలు ఎక్కువవుతాయి. దీర్ఘకాలం వాడటం వల్ల చర్మం నల్లబడిపోతుంది. 

సహజసిద్ధంగా తెల్లబడాలంటే?
ఫెయిన్‌నెస్‌, వైటెనింగ్‌ క్రీముల దుష్ప్రభావాలను లోనుకాకుండా ఉండాలంటే వీటి వాడకం పూర్తిగా మానేయాలి. మచ్చలు, మొటిమలు, సన్‌ట్యాన్‌తో చర్మం నల్లబడిన వారు చర్మ వైద్యుల్ని సంప్రతించి తమ చర్మ తత్వానికి తగిన చికిత్స తీసుకోవాలి. పోషకాహారం తీసుకుంటూ వైద్యులు సూచించిన స్కిన్‌ క్రీమ్స్‌ వాడితే చర్మం సహజసిద్ధమైన మెరుపుదనం సంతరించుకుంటుంది. చర్మపు తత్వానికి తగిన సబ్బు, సన్‌స్ర్కీన్‌, మాయిశ్చరైజింగ్‌ లోషన్లను వాడుతూ.. ఈ క్రింది జాగ్రత్తలు కూడా పాటిస్తే ఎలాంటి స్టిరాయిడ్‌ బేస్‌డ్‌ క్రీమ్‌లతో పని లేకుండానే ఆరోగ్యకరమైన రీతిలో తెల్లబడొచ్చు.

ఎండలోకి వెళ్లేటప్పుడు చర్మాన్ని కవర్‌ చేసుకోవాలి.
రోజుకి 8 నుంచి 10 గ్లాసుల నీళ్లు తాగాలి.
7 నుంచి 8 గంటల నిద్ర తప్పనిసరి.
తాజా పళ్ల రసాలు, ఆకు కూరలు, కూరగాయలు తీసుకోవాలి.
చక్కెర వాడకం తగ్గించాలి.
16 ఏళ్ల లోపు యువతులు ఎలాంటి ఫేస్‌ క్రీమ్స్‌ 
వాడకూడదు.
ఇంట్లో తయారు చేసుకుని వేసుకునే ప్యాక్స్‌ వల్ల తాత్కాలిక ఫలితం మాత్రమే ఉంటుంది.
చర్మానికి సంబంధించిన ఎలాంటి సమస్య వచ్చినా సొంత వైద్యం మాని చర్మ వైద్యులను సంప్రతించాలి.