కాలిన బొబ్బలు మానేందుకు

30-5-2017: నిప్పు రవ్వలు పడటం వల్లగానీ, తీవ్రమైన ఎండలో తిరగడం వల్లగానీ, శరీరం మీద బొబ్బలు రావచ్చు. రసాయన పదార్థాలు,  రేడియేషన్‌ వల్ల కూడా ఒంటి మీద బొబ్బలు రావచ్చు. ఒక స్థాయి వరకు వీటిని గృహవైద్యంతోనే నయం చేసుకోవచ్చు. అందుకు గృహ చిట్కాగా.....

చర్మం కాలినప్పుడు కనీసం 10 నిమిషాల పాటు కాలిన చోట చల్లని నీటిని   ధారలా పడేలా ఉంచాలి. ఒకవేళ పొక్కులు వస్తే వాటిని తొలగించే ప్రయత్నం చేయకూడదు. అలా తొలగిస్తే అందులో ఇన్‌ఫెక్షన్లు తలెత్తే ప్రమా దం ఉంది.

 కలబంద గుజ్జును  తమలపాకు మందంగా, కాలిన గాయాలపై రాయాలి. గుజ్జుకాకపోతే, కలబంధ రసాన్ని ఆ గాయాలపైన రాయవచ్చు. రోజుకు రెండుసార్లు ఈ రసాన్ని రాస్తే ఎంతో ఫలితం కనిపిస్తుంది. కలబంద వెంటనే లభించని పక్షంలో పసుపు పొడిలో శుద్ధమైన తేనె కలిపి కూడా రాయవచ్చు. ఇదే కాకుండా కొబ్బరి టెంకెను బాగా కాల్చి దాని చూర్ణాన్ని కొబ్బరి నూనెతో కలిపి రాస్తే కూడా ఎంతో ప్రయోజనం ఉంటుంది.

గోరింటాకు ముద్దలో వెనిగెర్‌ గానీ, నిమ్మరసాన్ని గానీ కలిపి గాయాలపై పూస్తే కాలిన గాయాల తాలూకు మంట తగ్గుతుంది.

కోడిగుడ్డులోని తెల్లని సొనలో తుమ్మబంక పొడి , కొబ్బరి నూనె కలిపి పూస్తే ఎంతో ఉపశమనం కలుగుతుంది.

అయితే కాలిన గాయాలు శరీరంలో 10 శాతం కన్నా మించితే వెంటనే ఆసుపత్రిలో చేర్పించి తక్షణమే అవసరమైన చికిత్సలు ఇప్పించాలి.