సౌందర్యానికి చల్లటి తైలం

29-06-2017:డ్రై, సెన్సిటివ్‌ చర్మాలకు ప్రత్యేక కేర్‌ అవసరం. ఈ చర్మాలకు కోల్డ్‌ ప్రెస్‌డ్‌ ఆయిల్స్‌ తగినంత రక్షణ అందిస్తాయి. మృదుత్వాన్ని కాపాడుతూ తేమ కోల్పోకుండా సంరక్షించటంలో కోల్డ్‌ ప్రెస్‌డ్‌ అయిల్స్‌కు మించిన సౌందర్య సాధనం మరొకటి లేదు.

 
కోల్డ్‌ ప్రెస్‌డ్‌ ఆయిల్స్‌ అంటే?
చల్లని వాతావరణంలో విత్తనాలు, నట్స్‌ నుంచి తీసే నూనెను కోల్డ్‌ ప్రెస్‌డ్‌ ఆయిల్‌ అంటారు. ఈ నూనెల్లో ట్రాన్స్‌ ఫ్యాట్స్‌ ఉండవు. ఇతరత్రా విషపూరిత రసాయనాలు కూడా ఉండవు. రసాయనాలు ఉపయోగించకుండా నూనె తీసే పద్ధతి ఉపయోగించటం వల్ల ఈ నూనెల ధర కూడా ఎక్కువగానే ఉంటుంది.
 
ఈ నూనెలు మేలైనవి
క్లిష్టమైన పద్ధతులు ఉపయోగించటం వల్ల తయారయ్యే నూనె తక్కువ మొత్తంలో ఉన్నా ఎంతో నాణ్యత కలిగి ఉంటుంది. సహజసిద్ధమైన పోషకాలు, యాంటి ఆక్సిడెంట్లు, సువాసనలు ఈ నూనెల్లో పుష్కలంగా ఉంటాయి. ఈ పద్ధతిలో కాకుండా రసాయనాలు, వేడి ఉపయోగించి తీసే నూనెల్లో సహజ గుణాలు లోపిస్తాయి. ఈ నూనెలు తక్కువ కాలం నిల్వ ఉంటాయి. కాబట్టి ఎండ తగలని ప్రాంతంలో నిల్వ ఉంచి సాధ్యమైనంత త్వరగా ఉపయోగించాలి.
 
కొబ్బరి నూనె
చర్మానికి కొబ్బరినూనె తేమనందిస్తుంది. కోల్డ్‌ ప్రెస్‌డ్‌ ప్రాసె్‌సలో తయారైన కొబ్బరి నూనె చర్మానికి రెండింతల మేలు చేస్తుంది. యాంటి ఆక్సిడెంట్లు, పోషకాలు చర్మంలోకి ఇంకి ముడతలు మటుమాయం చేయటంతోపాటు చర్మాన్ని నునుపుగా మారుస్తాయి.