ఎండకు చర్మం కమిలిందా?

23-5-2017: ఎండలో బాగా తిరగడం వల్ల చర్మం నల్లబడుతుంది. స్కిన్‌ టోన్‌ దెబ్బతింటుంది. చర్మం కమలిపోతుంది. వీటిని ఇంట్లో లభ్యమయ్యే సహజమైన పదార్థాలతో తగ్గించుకోవచ్చు అవి!

చర్మంపై కలబంద బాగా పనిచేస్తుంది. ఇందులో 99 శాతం నీరు ఉంటుంది. మిగతా ఒక శాతంలో 150 రకాల మినరల్స్‌, విటమిన్స్‌, క్యాల్షియం, సోడియం, మెగ్నీషియం, కాపర్‌, జింక్‌ వంటివెన్నో ఉంటాయి. అందుకే ఎండవేడిమికి దెబ్బతిన్న చర్మంపై కలబంద చికిత్స బాగా పనిచేస్తుంది.
చల్లటి నీటితో ముఖం కడుక్కోవడం వల్ల కూడా ఎండకు దెబ్బతిన్న చర్మం తేటపడుతుంది. చల్లటి నీరు ముఖానికి తగలడంతో చర్మంలోని వేడి వల్ల ఉబ్బిన ముఖం పలచబడుతుంది. చల్లటి నీళ్లు తాగడం కూడా చర్మంపై మంచి ప్రభావం ఉంటుంది. నేత గుడ్డను చల్లటి నీళ్లల్లో తడిపి కమిలిన చర్మంపై కాసేపు ఉంచాలి. అలా 10-15 సార్లు చేస్తే మంచి ఫలితం ఉంటుంది. ఇలా రోజులో ఎన్నిసార్లయినా చేయొచ్చు.
చల్లటి నీళ్లల్లో కాసేపు ఉండడం వల్ల కూడా కమిలిన చర్మం తేటపడి సాంత్వన పొందుతారు. అలా వీలు లేకపోతే షవర్‌ని ఉపయోగించవచ్చు.
సూర్యరశ్మి వల్ల దెబ్బతిన్న చర్మంపై యాపిల్‌ సిడార్‌ వెనిగర్‌ రాస్తే మంచి ఫలితం ఉంటుంది. దీనివల్ల సూర్యరశ్మి వల్ల దెబ్బతిన్న చర్మం మండడం తగ్గుతుంది. అందుకే శుభ్రంగా ఉన్న నేత బట్టను తీసుకుని దాన్ని వెనిగర్‌లో తడిపి దెబ్బతిన్న చర్మంపై కాసేపు ఉంచాలి. రెండు మూడు నిమిషాల తర్వాత ఆ గుడ్డను తీసేసి మాయిశ్చరైజర్‌ను (కొబ్బరినూనెను కూడా వాడొచ్చు) ఆ ప్రదేశంలో రాయాలి. తర్వాత యాపిల్‌ సిడార్‌ వెనిగర్‌ వేసిన నీటితో స్నానం చేయాలి.