ఇలా అవసరమేనా?

28-08-2017:అవాంఛిత రోమాలను తొలగించుకోవటం అందరికీ అలవాటే! కాకపోతే అందుకు అనుసరించే సురక్షిత పద్ధతుల గురించి అవగాహన లేక టీనేజర్లు చాలామంది సమస్యల్లో పడుతూ ఉంటారు. స్టయిల్స్‌, ట్రెండ్స్‌కు తగ్గట్టు ఉండాలనే తాపత్రయంలో తోచిన పద్ధతిని అనుసరించకుండా కాస్త అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిస్తున్నారు వైద్యులు.
 
కాలం వేగంగా పరిగెత్తుతోంది. దాంతోపాటే శరీర జీవక్రియల వేగం కూడా పెరిగింది. దాంతో పిల్లల్లో చిన్న వయసులోనే హార్మోన్ల విడుదల మొదలయిపోతోంది. ఫలితంగా 12, 13 ఏళ్ల పసి వయసులోనే అవాంఛిత రోమాలు మొలకెత్తటం మొదలవుతోంది. మగపిల్లలైతే మీసాలు, గడ్డాలు రావటం, ఆడపిల్లలకు బాహుమూలల్లో, కటి ప్రదేశంలో వెంట్రుకలు రావటం జరుగుతోంది. అయితే ఈ రోమాల విషయంలో మరీ ముఖ్యంగా ఆడపిల్లలకు కొన్ని ఇబ్బందులుంటాయి. అందంగా కనిపించటం కోసం లేదా అందవిహీనంగా కనిపించకుండా ఉండటం కోసం ఈ రోమాల్ని తొలగించుకోవాలని అనుకుంటారు. అయితే ఇందుకోసం వ్యాక్సింగ్‌, త్రెడింగ్‌, షేవింగ్‌, హెయిర్‌ రిమూవల్‌ క్రీమ్స్‌ వాడటం... బ్యూటీ పార్లర్లలో లేదా ఇంట్లో తమకు అనుకూలంగా ఉన్న పద్ధతిని అనుసరిస్తూ ఉంటారు. అయితే...వీటిలో ఏ పద్ధతి సురక్షితం? అసలు అవాంఛిత రోమాలను తొలగించుకోవటం ఎంత వరకూ అవసరం?
 
వెంట్రుకలతో ఉపయోగమే!
శరీరం మీద పుట్టుకతో ఉండే వెంట్రుకలను తొలగించుకోకపోవటమే ఉత్తమం. వెంట్రుకలు చర్మానికి రక్షణనిస్తాయి. సూర్యరశ్మి నుంచి కాపాడతాయి. చర్మానికి కావలసిన తేమనిచ్చి పొడిబారకుండా సంరక్షిస్తాయి. కాబట్టే చేతులు, కాళ్ల మీద ఉండే వెంట్రుకలను తొలగించుకోకపోవటమే మంచిది. అయితే పై పెదవి మీద మొలిచే వెంట్రుకలను, చిక్కని కనుబొమల్లోని అదనపు వెంట్రుకలను తొలగించుకోవచ్చు. బాహుమూలలు, కటి ప్రదేశాల్లోని రోమాలను తప్పనిసరి పరిస్థితుల్లోనే తొలగించుకోవాలి. వాటి కారణంగా కొన్ని రకాల దుస్తులు వేసుకోలేకపోతుంటే తొలగించుకోవటంలో తప్పు లేదు. కొందరికి ఆ ప్రదేశాల్లో విపరీతమైన చమట వల్ల పొక్కులు, కురుపులు, ఇన్‌ఫెక్షన్లు రావటం జరుగుతుంది. ఇలాంటివాళ్లు తప్పనిసరిగా తొలగించుకోవాల్సిందే!
 
ఇన్‌ఫెక్షన్లు, వ్యాధులు సోకే ప్రమాదం!
వ్యాక్సింగ్‌, త్రెడింగ్‌, ప్లకింగ్‌, షేవింగ్‌....పద్ధతి ఏదైనా సరైన శుభ్రత పాటించకపోతే బ్యాక్టీరియా, వైరల్‌ ఇన్‌ఫెక్షన్లు సోకే ప్రమాదం ఉంటుంది. అలాగే క్షయ లాంటి అంటు రోగాలు కూడా! బ్యూటీ పార్లర్లు, సెలూన్లలో ఒకరికి వాడిన వస్తువులనే ఇంకొకరికి వాడటం, వస్తువులను శుభ్రం చేయకపోవటం వల్ల ఈ ఇన్‌ఫెక్షన్లు ఒకరి నుంచి మరొకరికి సోకుతూ ఉంటాయి. నైఫ్‌ను వ్యాక్స్‌లో పదే పదే ముంచి తీసి ఎంతోమందికి అప్లై చేస్తూ ఉంటారు. అలాగే వ్యాక్సింగ్‌ కోసం వాడే క్లాత్‌ కూడా సరిగా శుభ్రం చేయకుండా వాడుతూ ఉంటారు. ఇది సరైన పద్ధతి కాదు. త్రెడింగ్‌ కోసం వాడే దారం, వ్యాక్సింగ్‌ కోసం వాడే కత్తి, క్లాత్‌ ప్రతి ఒక్కరికీ మారుస్తూ ఉండాలి. బ్యూటీపార్లర్‌లో ఈ పద్థతి పాటిస్తున్నారో లేదో తెలుసుకోవాలి. అలాగే రేజర్లు కూడా! ఒకసారి వాడి పారేసే డిస్పోజబుల్‌ రేజర్లనే ఎంచుకోవాలి.
 
షేవింగ్‌ వల్ల సమస్యలు
అన్‌వాంటెడ్‌ హెయిర్‌ తొలగించుకోవటం కోసం షేవింగ్‌ చేసేవాళ్లు అనుసరించే కొన్ని పద్ధతుల వల్ల చర్మం పాడవుతూ ఉంటుంది. వెంట్రుకల పెరుగుదలకు వ్యతిరేక దిశలో షేవింగ్‌ చేయటం వల్ల వెంట్రుకల కుదుళ్లు దెబ్బతిని ఆ ప్రదేశంలో నల్లని మచ్చలు ఏర్పడతాయి. అలాగే షేవింగ్‌ చేసేముందు వెంట్రుకలను తడి చేయటం మర్చిపోకూడదు. పదే పదే షేవింగ్‌ చేయటం వల్ల చర్మం మీద గుండ్రటి బుడిపెలు ఏర్పడి చర్మం నునుపుదనం కోల్పోతుంది. చర్మం పై పొర తొలగిపోయి మందంగా తయారవుతుంది.
 
తరచుగా త్రెడింగ్‌
త్రెడింగ్‌కు వాడే దారం వల్ల చర్మ సమస్యలు వచ్చే అవకాశాలు ఎక్కువ. వెంట్రుకలు తెగిపోవటం, ఆ ప్రదేశంలోని చర్మం పదే పదే రాపిడికి గురవటం వల్ల నల్లబడుతుంది. ఒకరికి వాడిన దారాన్నే ఇంకొకరికి వాడటం వల్ల ఇన్‌ఫెక్షన్లు ప్రబలే ప్రమాదం కూడా ఉంటుంది. కాబట్టి త్రెడింగ్‌ కోసం వాడే దారం మన్నికదై ఉండాలి. కొత్తదై ఉండాలి. బ్యూటీ పారర్ల్లకు వెళ్లే వాళ్లు తమకంటూ ఒక త్రెడింగ్‌ దారాన్ని కొని దగ్గరుంచుకుంటే మంచిది.
 
వేడి వేడి వ్యాక్సింగ్‌
ఎక్కువకాలం రోమాలు పెరగకుండా చేసే పద్ధతి ఇది. కానీ వెంట్రుకల పెరుగుదల అనేది జన్యుపరంగా వ్యక్తికీ, వ్యక్తికీ మారుతూ ఉంటుంది. కొందరికి వ్యాక్సింగ్‌ 15 రోజులకోసారి అవసరమైతే ఇంకొందరికి వారానికే అవసరం పడొచ్చు. అయితే వ్యాక్సింగ్‌ చేయించుకోవాలనుకున్నప్పుడు దాని పద్ధతి తెలిసిన అనుభవజ్ఞులైన బ్యూటీషియన్లనే సంప్రదించాలి. అలాగే డిస్పోజబుల్‌ క్లాత్‌ వాడే పార్లర్లకే వెళ్లాలి. వ్యాక్సింగ్‌కి వ్యాక్సింగ్‌కీ మధ్య గ్యాప్‌ ఇవ్వాలి. వెంట్రుకలు పూర్తిగా పెరిగిన తర్వాతే వ్యాక్సింగ్‌ చేయించకోవాలి. అంతేగానీ కొద్దిగా పెరగగానే వ్యాక్సింగ్‌కి వెళ్లకూడదు. ఇలా చేస్తే వెంట్రుకల కుదుళ్లు దెబ్బతింటాయి.
 
ప్లకింగ్‌
కనుబొమలు, పై పెదవి మీద ఉండే వెంట్రుకలను తొలగించుకోవటం కోసం కొంతమంది ఇంట్లోనే ప్లక్కర్‌ని ఉపయోగిస్తూ ఉంటారు. ప్లక్కర్‌తో వెంట్రుకను పట్టుకుని లాగినప్పుడు అది రూట్‌తో సహా వచ్చేస్తే ఫరవాలేదు. అలాకాకుండా తెగటం, మధ్యకి విరిగిపోవటం జరిగితే వెంట్రుకల కుదుళ్ల మీద ఒత్తిడి పడి ఆ ప్రదేశం నల్లగా తయారవుతుంది. కాబట్టి కనుబొమలను త్రెడింగ్‌తో షేప్‌ చేసుకున్న తర్వాత ఏవైనా ఒకటి రెండు అదనపు వెంట్రుకలు తొలగించటానికి మాత్రమే ప్లక్కర్‌ని వాడాలి. ఇక పై పెదవి మీది వెంట్రుకలను తొలగించటం కోసం ప్లక్కర్‌ని వాడకపోవటమే మేలు.
 
పర్మనెంట్‌ హెయిర్‌ రిమూవల్‌
అన్‌వాంటెడ్‌ హెయిర్‌ను శాశ్వతంగా తొలగించుకోవటం కోసం లేజర్‌, ఎలకా్ట్రలసిస్‌ మొదలైన పద్ధతులున్నాయి. అయితే అవాంఛిత రోమాల వల్ల తరచుగా ఇన్‌ఫెక్షన్లు, పుండ్లు లాంటి సమస్యల్ని ఎదుర్కొనేవాళ్లు మాత్రమే ఈ చికిత్సలు తీసుకోవటం మంచిది. ఈ చికిత్సలో వెంట్రుకల కుదుళ్లను కొంతవరకూ అచేతనం చేసి వెంట్రుకల మందాన్ని తగ్గిస్తారు. చికిత్స వల్ల వెంట్రుకలు పెరిగినా పలచగా, నూగులా పెరిగి చర్మంలో కలిసిపోతాయి కాబట్టి వెంట్రుకలు లేనట్టే కనిపిస్తుంది. కానీ నిజానికి లేజర్‌, ఎలకా్ట్రలసిస్‌ చికిత్సల్లో వెంట్రుకలను శాశ్వతంగా తొలగించటం ఉండదు. వ్యక్తుల శరీర తత్వాన్ని బట్టి కొందరికి నాలుగు సిట్టింగ్‌లు, ఇంకొందరికి అంతకంటే ఎక్కువ అవసరమవుతాయి.
 
ఫ్రెంచ్‌ బియర్డ్‌, అండర్‌కట్‌
ఫ్యాషన్‌లో భాగంగా అబ్బాయిలు కూడా రకరకాల హెయిర్‌ స్టయిల్స్‌ చేస్తున్నారు, గడ్డాలు చేయిస్తున్నారు. అయితే ఎలాంటి ఇన్‌ఫెక్షన్లు, వ్యాధులు సంక్రమించకుండా ఉండాలంటే కొన్ని జాగ్రత్తలు పాటించాలి. అవేంటంటే...
 డిస్పోజబుల్‌ రేజర్లనే వాడాలి.
 వెంట్రుకలను అపసవ్య దిశలో తొలగించకూడదు.
 షేవింగ్‌ బ్రష్‌ శుభ్రంగా ఉండాలి.
 ఆఫ్టర్‌ ఫేవ్‌ లోషన్‌ తప్పనిసరిగా వాడాలి.
 గడ్డం మీద ఒక చోట చిన్న కురుపులా వస్తే దానికి రేజర్‌ను తగలనివ్వకూడదు. లేదంటే రేజర్‌తోపాటు ఆ కురుపులు ముఖమంతా వ్యాపిస్తాయి.
 సెలూన్లలో షేవింగ్‌కు డిస్పోజబుల్‌ షేవర్లు వాడుతున్నారో లేదో గమనించాలి.
 టవళ్లు, టిష్యూలు, దువ్వెనలు ఒకరికి వాడినవి ఇంకొకరికి వాడుతున్నారేమో గమనించాలి.
 పొడవాటి గడ్డాలు పెంచాలనుకుంటే శుభ్రతను పాటించాలి.
 దురద, పొట్టు లాంటివి కనిపిస్తే జాగ్రత్త పడాలి.
 ఎలక్ట్రిక్‌ రేజర్లను వాడిన ప్రతిసారీ శుభ్రం చేసుకోవాలి.


అబ్బాయిల్లో హార్మోన్ల ప్రభావం

కొందరికి ఒత్తుగా గడ్డాలు, మీసాలు పెంచాలని ఉంటుంది. కానీ అలా పెరగకపోయేసరికి తెలిసిన చిట్కాలన్నీ ప్రయోగిస్తూ ఉంటారు. వెంట్రుకల కుదుళ్లు చైతన్యమైతే త్వరగా పెరుగుతాయనే అపోహతో పదే పదే షేవింగ్‌ చేస్తూ ఉంటారు. కానీ గడ్డాలు, మీసాలు అనేవి వంశపారంపర్య లక్షణాలే! ఒకవేళ తండ్రికి ఒత్తుగా పెరిగి, కొడుక్కి పెరగకపోతే యుక్త వయసులోనే వైద్యుల్ని సంప్రదించి హార్మోన్‌ పరీక్షలు చేయించాలి. టెస్టోస్టిరాన్‌ హార్మోన్‌ తయారుకాకపోయినా, హెచ్చుతగ్గులున్నా ఆ ప్రభావం వెంట్రుకల మీద కచ్చితంగా ఉంటుంది. కాబట్టి ఆ పరీక్షలు చేయించటంతోపాటు, పౌష్టికాహారం తీసుకోగలిగితే ఈ సమస్య తొలగిపోతుంది.
 
షేవ్‌ చేస్తే పెరుగుతాయా?
అపోహ : పదే పదే షేవ్‌ చేస్తే వెంట్రుకలు పెరుగుతాయి
వాస్తవం : ఇది నిజం కాదు. వెంట్రుకల పెరుగుదల వంశపారంపర్య లక్షణం. దీనికీ పదే పదే షేవింగ్‌ చేయటానికి సంబంధం లేదు. అలా షేవింగ్‌ చేయటం వల్ల వెంట్రుకలు చిక్కగా పెరగవు.
అపోహ : పసుపుతో వెంట్రుకలు రాలిపోతాయి
వాస్తవం : చాలామంది అమ్మాయిలు ఫేస్‌ ప్యాక్‌లో పసుపు కలుపుకుని అప్లై చేస్తూ ఉంటారు. ఇంకొందరు పసుపుతో ముఖం రుద్దుకుంటూ ఉంటారు. ఇలా చేయటం వల్ల వెంట్రుకలు రాలిపోతాయనేది అపోహ మాత్రమే! పసుపు క్రిమిసంహారిణి మాత్రమే!
అపోహ : నూనె పూస్తే వెంట్రుకలు పెరుగుతాయి
వాస్తవం : నూనె, షాంపూలకు వెంట్రుకలను పెంచే శక్తి లేదు. బయటి నుంచి మనం ఎన్ని రకాల ప్రయత్నాలు చేసినా వెంట్రుకలు పెరగవు. వెంట్రుకలు చక్కగా, ఆరోగ్యంగా పెరగాలంటే పౌష్టికాహారం తీసుకోవాలి.
అపోహ : అపసవ్య దిశలో షేవ్‌ చేస్తే వెంట్రుకల పెరుగుదల తగ్గుతుంది
వాస్తవం : వెంట్రుకలు పెరిగే దిశలోనే షేవ్‌ చేయాలి. వ్యతిరేకంగా చేయటం వల్ల అదనంగా ఒరిగే ప్రయోజనం ఏమీ లేదు. పైౖగా వ్యతిరేక దిశలో చేయటం వల్ల వెంట్రుకల కుదుళ్లు దెబ్బతిని అస్తవ్యస్తంగా పెరుగుతాయి.
డాక్టర్‌ పి.ఎల్‌. చంద్రావతి
                                                                                                                                                                           సీనియర్‌ కన్సల్టెంట్‌ డర్మటాలజిస్ట్‌,
                                                                                                                                                                           కేర్‌ హాస్పిటల్స్‌, బంజారాహిల్స్‌,
                                                                                                                                                                           హైదరాబాద్‌