ఆరోగ్యవంతమైన చర్మానికి..

01-08-2017: వర్షాకాలంలో చర్మ సంరక్షణ ఎంతో అవసరం. ఈ సీజన్‌లో చర్మంలోని మలినాలను బయటకు పంపించడం తప్పనిసరి. లేదంటే రకరకాల స్కిన్‌ ఎలర్జీలు వస్తాయి. చర్మ వ్యాధులు కూడా రావచ్చు. వీటిని నిరోధించేందుకు సహజమైన ఫేస్‌ ప్యాక్స్‌ కొన్ని ఉన్నాయి. అవేంటంటే..

మూడు టేబుల్‌ స్పూన్ల శెనగపిండి, ఒక టేబుల్‌ స్పూను తేనె, రెండు టేబుల్‌స్పూన్ల గ్రీన్‌ టీ, రోజ్‌ హిప్‌ ఆయిల్‌ ఐదారు చుక్కలు కలిపి పేస్టులా చేయాలి. దానిని ముఖానికి రాసుకుని 20 నిమిషాలు ఉంచుకుని ఆ తర్వాత చల్లటి నీళ్లతో ముఖాన్ని కడుక్కోవాలి. తేనెలో యాంటి-బాక్టీరియల్‌ గుణాలు బాగా ఉంటాయి. గ్రీన్‌ టీ చర్మాన్ని పట్టులా మెరిసేట్టు చేస్తే, రోజ్‌ హిప్‌ ఆయిల్‌ చర్మాన్ని తేమగా ఉంచుతుంది.

కీరా జ్యూసు, రోజ్‌ వాటర్‌ రెండింటినీ కలిపి అందులో గ్రీన్‌ టీ లీవ్స్‌ కొన్ని వేసి రిఫ్రిజిరేటర్‌లో కాసేపు ఉంచి ముఖానికి రాసుకోవాలి. కీరా చర్మంపై తలెత్తే ఇరిటేషన్‌ను తగ్గిస్తుంది. రోజ్‌వాటర్‌ చర్మాన్ని కాపాడుతుంది.

వర్షాకాలంలో తలెత్తే మచ్చలు, దద్దుర్లు, యాక్నే లాంటి చర్మ సమస్యలు బంగాళాదుంపతో పోతాయి. బంగాళాదుంపను తురిమి దాని నుంచి రసం పిండాలి. ఇందులో ఒకటి లేదా రెండు టీస్పూన్ల నిమ్మరసం, కొద్దిగా రోజ్‌వాటర్‌ కలిపి ముఖానికి రాసుకొని అరగంటసేపు అలాగే ఉంచుకోవాలి. ఆ తర్వాత చల్లటి నీళ్లతో ముఖం కడుక్కోవాలి.