ప్లాటిపస్‌ విషంతో మధుమేహ చికిత్స!

ఆంధ్రజ్యోతి, 13-12-2016: ఆస్ట్రేలియాలో జీవించే ప్లాటిపస్‌ అనే జీవి విషం ద్వారా మధుమేహానికి మెరుగైన చికిత్సను అభివృద్ధి చేయవచ్చని శాస్త్రవేత్తలు గుర్తించారు. దానిని నుంచి ఉత్పన్నమయ్యే గ్లూకగాన్‌ లైక్‌ పెప్టైడ్‌-1 (జీఎల్‌పీ-1) హార్మోన్‌ ఇందుకు ఉపయోగపడుతుందని వారు గుర్తించారు. సాధారణంగా ఈ హార్మోన్‌ మనుషుల పేగుల్లోనూ ఉంటుంది. ఇది ఇన్సులిన్‌ ఉత్పత్తికి ప్రేరకంగా పనిచేసి రక్తంలో చక్కెర స్థాయిని తగ్గిస్తుంది. అయితే, టైప్‌-2 మధుమేహం ఉన్న వారిలో ఇన్సులిన్‌పై ఈ హార్మోన్‌ ప్రభావం తగినంతగా ఉండదని ఆసే్ట్రలియాలోని యూనివర్సిటీ ఆఫ్‌ అడిలైడ్‌ శాస్త్రవేత్తలు తెలిపారు. దీంతో వారిలో చక్కెర స్థాయిలు పెరుగుతాయని చెప్పారు. ప్లాటిపస్‌ గుడ్డు పెట్టే సమయంలో అత్యంత శక్తిమంతమైన విషాన్ని ఉత్పత్తి చేస్తాయని, ఇందులో ఉండే జీఎల్‌పీ-1 హార్మోన్‌ వాటిలో చక్కెర స్థాయిలను నియంత్రించగలుగుతున్నట్లు గుర్తించామని తెలిపారు. ఈ హార్మోన్‌ స్థాయిలో ఎటువంటి హెచ్చుతగ్గులు లేవని తెలిపారు. దీనిని మధుమేహ ఔషధాల తయారీలో వినియోగించడం ద్వారా మనుషుల్లో జీఎల్‌పీ-1లో స్థిరత్వం తీసుకురావచ్చని శాస్త్రవేత్తలు పేర్కొన్నారు.