కూరగాయలతో మెనోపాజ్‌కు చెక్‌!

13-7-2017:స్త్రీ జీవితంలో ఎదురయ్యే సహజమైన ప్రక్రియ మెనోపాజ్‌. మామూలుగా 50 నుంచి 55 సంవత్సరాల లోపు ఎదురయ్యే ఈ సమస్య ఇటీవలి కాలంలో 40సంవత్సరాల వయస్సులోనే మహిళలు ఎదుర్కోవలసి వస్తోంది. మెనోపాజ్‌  ఎంత సహజమైనదే అయినా, దీని కారణంగా కొన్ని ఆరోగ్య సమస్యలు తప్పవు. త్వరగా వచ్చే మెనోపాజ్‌ కారణంగా ఆస్టియోపొరాసిస్‌, గుండె సంబంధిత సమస్యలు, నరాల అసమానతలు వంటివి వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది అంటున్నారు నిపుణులు. ఇదే విషయం మీద సుమారు 85వేల మంది మహిళల మీద పరిశోధన నిర్వహించారు. వీరందరూ 40 నుంచి 55 సంవత్సరాల వయస్సు మహిళలే! వీరిలో కొందరికి ప్రతిరోజూ కేవలం కూరగాయల ఆహరమే అందించగా, మరికొందరికి వారంలో మూడు సార్లు, మరికొందరికి వారంలో రెండు సార్లు కూరగాయల ఆహారం అందించారు. అనంతరం వీరిని పరిశీలించగా ప్రతిరోజూ కూరగాయల ఆహారం తీసుకున్న వారిలో మెనోపాజ్‌ సరైన సమయానికి వచ్చిన విషయం గమనించారు. వారంలో రెండు లేదా మూడు సార్లు కూరగాయల ఆహారం తీసుకున్న వారిలో ఈ మార్పు గమనించలేదు. కేవలం కూరగాయల కారణంగానే అకాల మెనోపాజ్‌ నుంచి తప్పించుకోవచ్చా? అన్న విషయం మీద వీరు ఇంకా పరిశోధనలు నిర్వహిస్తున్నారు.