టీవి చూస్తే రక్తం గడ్డకడుతుందా?

14-03-2018: అవుననే అంటున్నారు పరిశోధకులు. గంటల తరబడి టీవి చూడడం వలన కాళ్ళలలో రక్తం గడ్డకట్టే ప్రమాదం ఉందని వారు చెబుతున్నారు. ఈ విధంగా రక్తం గడ్డకట్టడం వలన నరాల వాపు, పక్షవాతం వచ్చే ప్రమాదం ఉందని మిన్నెసోటా విశ్వవిద్యాలయానికి చెందిన పరిశోధకులు చేసిన అధ్యయనాల్లో వెల్లడైంది. 45 నుంచి 65 సంవత్సరాల వయస్సు కలిగిన సుమారు 20వేల మంది స్త్రీ పురుషుల మీద వీరు అధ్యయనం నిర్వహించారు. వీరి ఆహారపు అలవాట్లు, రోజూవారీ జీవన విధానం తదితర వివరాలను సేకరించారు. తమకు రోజు మొత్తం మీద పది నుంచి పన్నెండు గంటల పాటు టీవి చూసే అలవాటు ఉందన్న విషయాన్ని ఏడువేల మంది తెలియజేశారు. అనంతరం వీరి ఆరోగ్యస్థితిని పరిశీలించారు. టీవి ఎక్కువగా చూసే ఏడువేల మందిలో 50 శాతం మందికి కాళ్ళల్లో రక్తం గడ్డకట్టడాన్ని గమనించారు. దీనికి కారణం వీరు ఎక్కువ సేపు టీవి చూడడమే అని అధ్యయనకారులు అభిప్రాయపడుతున్నారు. టీవి ముందు ఏకబిగిన గంటల తరబడి కూర్చోకుండా కొద్దిసేపు లేచి అటూ ఇటూ నడిచినట్టయితే ఈ సమస్య నుంచి కొంత వరకూ తప్పించుకోవచ్చని వారు సూచిస్తున్నారు.