తాడాటే బెటర్‌!

07-02-2018:శరీరంలో పేరుకుపోయిన కొవ్వునూ, క్యాలరీలను కరిగించుకోవడానికి చాలా మంది రకరకాల ప్రయత్నాలు చేస్తుంటారు. కొందరు జాగింగ్, మరికొందరు వాకింగ్‌, పరిగెత్తగలిగిన వారు రన్నింగ్ ఇలా రకరకాల పద్ధతుల ద్వారా తమ కొవ్వును కరిగించుకుని గుండెను ఆరోగ్యంగా ఉంచుకోవడానికి ప్రయత్నిస్తుంటారు. శరీరంలోని కొవ్వును, బరువును తగ్గించుకోవడానికి పై పాట్లన్నీ పడక్కర్లేదనీ, పది నిమిషాల పాటు తాడాట ఆడితే సరిపోతుంది అంటున్నారు పరిశోధకులు. ఆరు వారాల పాటు ప్రతిరోజూ పై విధంగా తాడాట ఆడితే అనుకున్న స్థాయిలో కొవ్వును కరిగించుకోవచ్చనీ, గుండెను కూడా ఆరోగ్యంగా ఉంచుకోవచ్చన్న విషయం ఇటీవల నిర్వహించిన పరిశోధనల్లో వెల్లడైంది. కొన్ని రకాల ఆరోగ్య సమస్యలున్నవారు, గర్భవతులు తాడాట జోలికి పోకూడదని వారు సూచిస్తున్నారు. స్కిప్పింగ్‌ చేయాలనుకునేవారు ముందుగా వైద్యులని సంప్రదించాలని వారు చెబుతున్నారు. ముఖ్యంగా కొత్తగా ఆడేవారు నిపుణుల పర్యవేక్షణలో మాత్రమే ఆడాలని వారు స్పష్టం చేస్తున్నారు.