రన్‌ ఫర్‌ స్కిన్‌

ఆంధ్రజ్యోతి, 20-12-2016: చాలా మందికి రన్నింగ్‌ వల్ల గుండె పనితనం, శ్వాసకోశాల సామర్థ్యం, కండరాల, ఎముకల పటుత్వం పెరుగుతాయని మాత్రమే తెలుసు. నిజానికి చర్మ సమస్యల్ని నిర్మూలించడంలో, చర్మ సౌందర్యాన్ని పెంచడంలో రన్నింగ్‌ పాత్ర తక్కువేమీ కాదు. రన్నింగ్‌లో సహజంగా శరీరంలో రక్తప్రసరణ పెరుగుతుంది. రక్తప్రసరణ వల్ల చర్మానికి కావలసిన పోషకాలతో పాటు, సమృద్ధిగా ఆక్సిజన్‌ అందుతుంది. దీనివల్ల శరీరంలోని వ్యర్థాలన్నింటికీ బయటికి పంపించే ప్రక్రియ శరీరంలో సంపూర్ణంగా జరుగుతుంది. ఇలా రక్త ప్రసరణ సజావుగా జరగడం వల్ల, చర్మ కణజాలాల ఉత్పత్తి చక్కగా జరగడంతో పాటు, చర్మ రంధ్రాల్లో ఉండే అడ్డంకులు కూడా చెమట ద్వారా తొలగిపోతాయి. రన్నింగ్‌ చేసే వారు సహజంగానే నీరు ఎక్కువగా తాగుతారు.
 
శరీరంలో నీటి పరిమాణం ఇలా పెరగడం ద్వారా చర్మ ఆరోగ్యం పెరుగుతుంది. హార్మోన్‌ వ్యవస్థలో వచ్చే తేడాల వల్ల చాలా మంది మహిళల్లో రుతుక్రమం దెబ్బ తింటుంది. రన్నింగ్‌తో హార్మోన్‌ వ్యవస్థ చక్కబడటం వల్ల రుతుక్రమం చక్కబడటంతో పాటు, చర్మం మీద వచ్చే మొటిమలు, దద్దుర్లు వంటివి తగ్గుముఖం పడతాయి. హార్మోన్‌ వ్యవస్థ చ క్కబడటం అంటే, మానసిక ఒత్తిళ్లు కూడా సద్దుమణగడమే. ఆందోళన, ఒత్తిళ్లు అదుపులో లేని వాళ్లల్లో చర్మ సమస్యలు కూడా ఎక్కువగానే ఉంటాయి. రన్నింగ్‌ వల్ల ఎండార్ఫిన్‌ హార్మోన్స్‌ పెరగడం వల్ల మానసిక ఒత్తిళ్లు తగ్గడంతో పాటు, మొత్తం హార్మోన్‌ వ్యవస్థ ఆరోగ్యం చక్కబడుతుంది.