గురకతో అకాల వృద్ధాప్యం?

14-03-2018: గురకకీ, పలు ఆరోగ్య సమస్యలకి సంబంధం ఉందన్న సంగతి తెలిసిందే! ఇప్పుడు అకాల వృద్ధాప్యానికి కూడా గురక కారణమవుతుందని పరిశోధకులు చెబుతున్నారు. గురక కారణంగా డిఎన్‌ఏ దెబ్బతిని కాన్సర్‌ వంటి ప్రాణాంతకమైన వ్యాధులు వచ్చే అవకాశం ఉందని వారు హెచ్చరిస్తున్నారు. కొన్ని వందల మంది మధ్య వయస్కుల మీద చైనా యూనివర్శిటీకి చెందిన పరిశోధకులు సుదీర్ఘకాలం అధ్యయనం చేశారు. గురక తక్కువ స్థాయిలో పెట్టే వారిలో పెద్దగా ఆరోగ్యసమస్యలను అధ్యయనకారులు గుర్తించలేదు. అదే పెద్దగా ఎక్కువ సేపుపెట్టేవారిలో మాత్రం డిఎన్‌ఏ దెబ్బతిని అకాల వృద్ధాప్య ఛాయలు కనిపించడాన్ని గుర్తించారు. అంతే కాకుండా కొందరిలో కాన్సర్‌ లక్షణాలను కూడా గుర్తించారు. ఇప్పటి వరకూ గురక కారణంగా ఊపిరితిత్తుల సమస్యలు మాత్రమే తలెత్తుతాయన్న విషయం తెలిసిందే!