మృత్యువుకు దగ్గర చేసే ఒంటరితనం?

13-10-2017: కలిసి ఉంటే కలదు సుఖం అన్నది మన పెద్దలు ఎప్పుడో చెప్పారు. ఇప్పుడే ఇదే విషయాన్ని పరిశోధనాకారులు తమ అధ్యయనం ద్వారా మరోసారి రుజువు చేశారు. ఊబకాయం, దాని ద్వారా సంక్రమించే ఆరోగ్య సమస్యల కారణంగానే మరణాల శాతం ఎక్కువగా ఉంటోందన్న విషయం తెలిసిందే! కానీ ఊబకాయం కన్నా ఒంటరితనం మరింత ప్రమాదకరమని అంటున్నారు పరిశోధకులు. ఒంటరితనంతో సంభవించే మరణాలే ఎక్కువన్న విషయం వీరి అధ్యయనంలో వెల్లడైంది. బ్రింగ్‌హామ్‌ యూనివర్శిటీకి చెందిన పరిశోధనకారులు ఈ విషయం మీద సుదీర్ఘకాలం పాటు అధ్యయనం నిర్వహించారు. ఒంటరితనంతో జీవించే మూడు లక్షల మందినీ, బంధువులు, కుటుంబంతో కలిసి జీవించే మూడున్నర లక్షల మంది మీద అధ్యయనం నిర్వహించారు. కుటుంబంతోనూ, సమాజంలోనూ కలిసి జీవించేవారి కన్నా ఒంటరిగా జీవించేవారిలోనే 35 శాతం మరణాలు అధికంగా ఉన్న విషయం వీరి అధ్యయనంలో వెల్లడైంది. కుటుంబంతో కలిసి జీవించే వారిలో అనారోగ్య సమస్యలున్నా, కుటుంబ సభ్యుల సహకారంతో వాటిని అధిగమించడాన్ని వీరు గుర్తించారు. ఒంటరిగా కన్నా సమూహంలో కలిసి జీవించడం వలనే ఎక్కువ కాలం జీవించవచ్చన్నది వీరి వాదన.