లాలిపాట తల్లులకూ మంచిదే!

07-02-2018: ఏడుస్తున్న బిడ్డను సముదాయించడానికి తల్లిపాడే లాలిపాట బిడ్డకే కాకుండా తల్లికీ సాంత్వన చేకూరుస్తుంది అంటున్నారు లండన్‌ పరిశోధకులు. ప్రసవం తరువాత కొంతమంది స్త్రీలలో డిప్రెషన్‌ లక్షణాలు చోటుచేసుకుంటాయనీ, దీనిని తగ్గించుకోవడానికి మందులు, ఇతర పద్ధతులు ఉపయోగించడం కన్నా లాలిపాటలు పాడడం చాలా మంచిదన్న విషయం వీరి అధ్యయనంలో వెల్లడైంది. ఏడుస్తున్న బిడ్డను సముదాయించే క్రమంలో తల్లులు తమకు వచ్చిన పాటలే కాకుండా స్వంత పదాలతో కొన్ని కొత్త పాటలు పాడతారనీ, ఈ ప్రక్రియే వారిలోని డిప్రెషన్‌ని తగ్గిస్తుందని వారు చెబుతున్నారు. సుమారు 135 మంది తల్లుల మీద వీరు కొన్ని నెలలపాటు అధ్యయనం నిర్వహించారు. వీరందరూ ప్రసవం తరువాత కలిగే డిప్రెషన్‌తో బాధపడుతున్న వారే! వీరిని రెండు గ్రూపులుగా విభజించి ఒక గ్రూపు మహిళలను లాలిపాటలు పాడమన్నారు. రెండవ గ్రూపు మహిళలను మామూలుగానే ఉండమన్నారు. కొన్ని నెలల అనంతరం వీరి మానసిక, ఆరోగ్య స్థితిని పరిశీలించగా లాలిపాట పాడిన తల్లుల్లో డిప్రెషన్‌ స్థాయి తగ్గిన విషయాన్ని గమనించారు. అయితే దీని మీద ఇంకా విస్ర్తతంగా పరిశోధనలు నిర్వహించాలని వారు చెబుతున్నారు..