పచ్చదనంతో పిల్లల్లో మేధోవికాశం!

14-03-2018: ప్రకృతికీ, పిల్లల మేధస్సుకీ సంబంధం ఉందంటున్నారు స్పెయిన్‌ అధ్యయనకారులు. చిన్నపిల్లలను ఎక్కువ సేపు పచ్చదనంలో గడపనిచ్చినట్టయితే వారి మెదడు మరింత ఆరోగ్యంగా ఎదగడమే కాకుండా తెలివితేటలు, నేర్చుకునే శక్తి రెట్టింపు అవుతాయన్న విషయం ఇటీవల వీరు చేసిన అధ్యయనంలో వెల్లడైంది. పచ్చదనానికీ, పిల్లల మేధోవికాసానికి సంబంధం ఉందన్న విషయం మీద అధ్యయనం మొదటిసారి నిర్వహించినట్టు వారు తెలియజేశారు. చిన్న పిల్లలను ప్రకృతిలో ఎక్కువ సేపు గడపనిస్తే వారి మెదడు మరింత బాగా ఎదుగుతుందనీ, తద్వారా వారు భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించడానికి అవకాశం ఉంటుందని వారు చెబుతున్నారు. కొంత మంది చిన్నారులను రెండు గ్రూపులుగా విభజించి ఒక గ్రూపు వారిని ప్రకృతిలో ఎక్కువ సేపు ఆడనిచ్చారు. మరో గ్రూపు వారిచేత ఇండోర్‌ గేమ్స్‌ ఆడించారు. కొన్ని నెలల అనంతరం వీరి మెదడు పనితీరును పరిశీలించగా, ప్రకృతిలో ఆడుకున్న పిల్లల మెదడులో ఎదుగుదల రెట్టింపు కాగా, ఇండోర్‌ గేమ్స్‌ ఆడిన వారిలో ఈ మార్పును గుర్తించలేదు.