వ్యాయామంతో గుండె పదిలం!

07-11-2018: మామూలు వ్యక్తుల కన్నా గుండె సంబంధిత సమస్యలతో బాధపడేవారు, గుండె ఆపరేషన్లు చేయించుకున్న వారు తప్పనిసరిగా తేలికపాటి వ్యాయామం చేయవలసిందే అంటున్నారు కెనడా అధ్యయనకారులు. సాధారణంగా గుండె సంబంధిత సమస్యలతో బాధపడేవారూ, గుండె ఆపరేషన్‌ చేయించుకున్న వారు ఒకేచోట విశ్రాంతిగా కూర్చోవడం లేదా, ఎక్కువ గంటలు పడుకోవడం, టీవీ చూడడం వంటి పనులే చేస్తుంటారు. దీని వల్ల వారి గుండె ఆరోగ్యం మరింత క్షీణిస్తుందని వారు స్పష్టం చేస్తున్నారు. వీరు ప్రతి గంటకూ ఒకసారి లేచి ఏడు నిమిషాల పాటు తేలికపాటి వ్యాయామాలు చేయాలని చెబుతున్నారు. ఏడు నిమిషాల పాటు ఇంట్లోనే అటూ ఇటూ నడవడం, తేలికగా ఉండే ఇంటి పనులు చేయడం వంటివి చేయాలని వారు సూచిస్తున్నారు. ఇలాంటి వాటి వలన అదనంగా 770 క్యాలరీలు ఖర్చు అవుతాయని అంటున్నారు. రోజులో ఎక్కువసేపు శారీరక వ్యాయామం, క్యాలరీలు కరగడం వంటివి గుండె ఆరోగ్యాన్ని మరింత మెరుగు పరుస్తాయని వీరి అధ్యయనంలో వెల్లడైంది. సుమారు రెండు వందల మంది హార్ట్ పేషెంట్ల మీద వీరు సుదీర్ఘకాలం అధ్యయనం చేసిన అనంతరం ఈ విషయాన్ని స్పష్టం చేసారు.