గుడ్డుతో గుండె ఆరోగ్యం!

29-08-2018: గుడ్డు ఆరోగ్యానికి మంచిదన్న సంగతి తెలిసిందే! ప్రతిరోజూ ఒక గుడ్డును ఆహారంగా తీసుకుంటే గుండె సంబంధిత సమస్యల నుంచీ, మరణాల నుంచీ తప్పించుకోవచ్చని చైనా అధ్యయనంలో స్పష్టమైంది. సుమారు ఐదున్నర లక్షల మంది మీద ఐదుసంవత్సరాల పాటు అధ్యయనం నిర్వహించారు. వీరిలో 54 శాతం మందికి ప్రతిరోజూ గుడ్డు తీసుకునే అలవాటు ఉండగా, మిగిలిన వారికి గుడ్డు తీసుకునే అలవాటు లేదు. అధ్యయనకాలం ముగిసే సరికి ప్రతిరోజూ గుడ్డు తీసుకునేవారిలో పదహారు శాతం మంది గుండె సంబంధిత సమస్యలకు గురిఅయ్యారు. మరో ఆరుశాతం మంది గుండె సంబంధిత సమస్యలతో మరణించారు. అదే గుడ్డు తీసుకోని వారిలో 26 శాతం మంది గుండె సంబంధిత సమస్యలతో మరణించారు. ప్రతిరోజూ గుడ్డును ఆహారంగా తీసుకోవడం వలనే మరణాల శాతం తగ్గిందనీ అధ్యయనకారులు అంటున్నారు. ప్రతిరోజూ గుడ్డును ఆహారంగా తీసుకోవడం వలన పన్నెండు శాతం వరకూ గుండె సంబంధిత సమస్యల నుంచి తప్పించుకోవచ్చని వారు చెబుతున్నారు.