విటమిన్ల లోపం కురులకు శాపం!

29-08-2018: డి విటమిన్ లోపంతో కురుల‌కు హాని కలుగుతుందన్న విషయం ఇటీవలి పరిశోధనల్లో స్పష్టమైంది. జుత్తు ఊడుతున్న వారిలో ఈ లోపం ఏకంగా 121శాతం ఉందని పరిశోధకులు అంటున్నారు. జుత్తు ఆరోగ్యంగా పెరగాలంటే మహిళలు ప్రతిరోజూ 46గ్రాముల ప్రొటీన్లు తీసుకోవాలి. ఇందుకోసం చికెన్, గుడ్లు, బాదం పప్పు వంటివాటిని రోజువారీ ఆహారంలో చేర్చుకోవాలి. ఆహారంలో ఐరన్‌ను ఎక్కువగా తీసుకోవడం వలన కూడా ఈ సమస్య నుంచి బయటపడవచ్చని పరిశోధకులు చెబుతున్నారు. 19 నుండి 50 సంవత్సరాల లోపు వయసున్న మహిళలకు రోజుకి 18మిల్లీగ్రాములు, ఆ పై వయసున్న వారికి ఎనిమిది మిల్లీగ్రాముల ఐరన్ అవసరం అవుతుంది. అయితే జుత్తు ఎక్కువగా ఊడుతున్న మహిళల్లో ఇతరులకంటే 45శాతం ఇనుము తక్కువగా ఉన్నట్టు పరిశోధకులు గుర్తించారు. శాకాహారం కంటే మాంసాహారం నుండి మన శరీరం ఇనుముని ఎక్కువగా గ్రహిస్తుంది. అందుకే శాకాహారులు ఐరన్ఉన్న ఆహారాన్ని రెట్టింపు తీసుకోవాలని వారు సూచిస్తున్నారు.