భయమా? ఫోబియానా?

 

ఆంధ్రజ్యోతి, 20-03-2018: ప్రతి ఒక్కరికీ ఏదో ఒక భయం ఉంటుంది. పాములు, ఎత్తైన ప్రదేశాలు, ఉరుములు, మెరుపులు... ఇలా! అయితే తాత్కాలికమైన ఆందోళనకూ, అదుపు చేసుకోలేని మానసిక ప్రతిస్పందనలకూ తేడా ఉంది. మొదటిది భయమైతే, రెండవది ఫోబియా!
 
మరి మీది భయమా? ఫోబియానా?
ఫోబియా.... ఓ రకమైన యాంగ్జయిటీ డిజార్డర్‌. దీన్లో 3 రకాలున్నాయి. అవేంటంటే, 1. నిర్దిష్టమైన ఫోబియాలు (ఏదైనా ఒక ప్రదేశం, జంతువు, సంఘటన గురించిన భయం), 2. సోషల్‌ ఫోబియా (ఒంటరిగా ఉండాలన్నా, అపరిచితులతో మాట్లాడాలన్నా, సమావేశాల్లో మాట్లాడటానికి ఇబ్బంది పడటం), 3. అగొరోఫోబియా (తప్పించుకోలేని సందర్భాల పట్ల భయం, బహిరంగ ప్రదేశాలు క్షేమకరం కాదనే భయంతో ఇంటికే పరిమితమైపోవడం)
లక్షణాలు ఇవే!: గుండె దడ, తల తిరుగుడు, ఊపిరి ఆడకపోవడం, ఒణకడం, విపరీతమైన చమటలు, నీరసం, ప్యానిక్‌ అటాక్స్‌తో విపరీతమైన ఆందోళనకు లోనవడం. ఫోబియా కలిగి ఉండే వ్యక్తులు అకారణంగా భయానికి లోనవుతున్న విషయాన్ని గ్రహిస్తారు. కానీ ఆ భయానికి లోను చేసే ఆందోళన, సందర్భాల నుంచి తప్పించుకోలేరు.
ఎన్నో రకాలు: ఫోబియాల్లో 500 రకాలున్నాయి. వాటిలో ఆసక్తికరమైనవి....
అరాచిబుటైరో ఫోబియా: పీనట్‌ బటర్‌ అంగిట్లో అతుక్కుంటుందనే భయం.
టెరెనో ఫోబియా: ఈకలతో చక్కిలిగింతలు పెడతారేమోననే భయం.
క్సైరో ఫోబియా: రేజర్లంటే భయం.
చికిత్సలున్నాయి: ఫోబియాలు వంశపారంపర్యంగా సంక్రమిస్తాయి. బిహేవియరల్‌ థెరపీ, మందులతో ఫోబియాలను వదిలించవచ్చు. అన్నిటికంటే ముఖ్యంగా భయాన్ని భయంతోనే జయించాలి. ఇందుకోసం ‘టెరోమెర్హానో ఫోబియా’ విమానాల్లో ప్రయాణించడానికి భయపడే ఫోబియా అయిన టెరోమెర్హానో ఫోబియా ఉన్నవాళ్లు...
ఎగిరే విమానాల ఫొటోలు చూడాలి.
విమానాశ్రయానికి వెళ్లాలి.
విమానంలో కూర్చోవాలి.
విమానంలో ప్రయాణించాలి.