గుండెకు..తియ్యటి శత్రువు

ఆంధ్రజ్యోతి, 26-12-2016:మధుమేహం, గుండె జబ్బు... ఈ రెండు వ్యాధులను విడివిడిగా చూస్తాం. కానీ ఇవి పోలికలు కలవని కవలల్లాంటివి. నువ్వెక్కడుంటే... నేనక్కడుంటా! అన్న చందంగా ఒకటుంటే రెండోది కూడా తన ఉనికిని చాటుకోవటానికి ప్రయత్నిస్తుంది. అప్రమత్తంగా లేకపోతే రెండూ తోడు దొంగలై పోటీపడి ఆరోగ్యాన్ని హరిస్తాయంటున్నారు సీనియర్‌ కార్డియాలజిస్ట్‌ డాక్టర్‌. ప్రమోద్‌ కుమార్‌ కుచ్చులకంటి.

 
రక్తంలో గ్లూకోజ్‌ నిల్వలు పెరిగే పరిస్థితిని మధుమేహంగా, గుండెకు రక్తాన్ని చేరవేసే రక్తనాళాల్లో సమస్య ఏర్పడటాన్ని గుండె జబ్బుగా పరిగణిస్తాం. ఈ రెండు వ్యాధుల కారణాలు, లక్షణాలు, చికిత్సలు వేర్వేరే! అయినా ఈ రెండు వ్యాధులకు అవినాభావ సంబంధం ఉంది. మధుమేహం వల్ల గుండె సమస్య, గుండె సమస్య ద్వారా మధుమేహం వచ్చే అవకాశాలున్నాయి. ఇందుకు ఎన్నో కారణాలున్నాయి. 
 
లెగసీ ఎఫెక్ట్‌
మధుమేహం వ్యాధి ప్రవర్తన అందే వైద్యం మీద ఆధారపడి ఉంటుంది. దీన్నే లెగసీ ఎఫెక్ట్‌ అంటారు. వ్యాధికి చికిత్స ఎంత త్వరగా అందించగలిగితే దాని ప్రభావం శరీరం మీద అంత తక్కువగా ఉంటుంది. అంటే.. ఈ వ్యాధిని గుర్తించిన వెంటనే వైద్యం మొదలుపెట్టగలిగితే ఇతరత్రా ఆరోగ్య సమస్యలు తలెత్తే కాలపరిమితిని పదేళ్ల వరకూ పెంచే వీలుంటుంది. మధుమేహాన్ని సకాలంలో గుర్తించక చికిత్స ఆలస్యం చేసినా, నిర్లక్ష్యం చేసినా శరీరంలో పెరుగుతున్న చక్కెర సాయిల ప్రభావం రక్తనాళాల మీద పడుతూ తక్కువ కాలంలోనే గుండె సమస్యలు, ఇతరత్రా ఆరోగ్య సమస్యలకు లోనయ్యే అవకాశాలు పెరుగుతాయి. 
 
గుండె జబ్బుకు దారితేసే మధుమేహం
మధుమేహం అదుపు తప్పితే రక్తంలో పెరిగిపోయే గ్లూకోజ్‌ వల్ల రక్తనాళాల గోడలు పలుచబడతాయి. దాంతో వాటిలో కొవ్వు నిల్వలు పేరుకుపోయే అవకాశాలు పెరుగుతాయి. ఈ పరిస్థితిని వైద్య పరిభాషలో ‘అథిలోస్క్లిరోసిస్‌’ అంటారు. ఈ స్థితి అలాగే కొనసాగితే రక్తనాళాలు క్రమేపీ ఇరుకుగా తయారై గుండెకు రక్త సరఫరా తగ్గి గుండె సమస్యలు తలెత్తుతాయి. ఈ సమస్యకు మధుమేహం ప్రధాన కారణమే అయినా ఇందుకు మరిన్ని ఇతర అంశాలు కూడా తోడువుతూ ఉంటాయి. అవేంటంటే... 
హైపర్‌ టెన్షన్‌
హై కొలస్టరాల్‌
ధూమపానం
క్రమం తప్పిన జీవనశైలి
అధిక బరువు
ఆల్కహాల్‌

కుటుంబ వైద్య చరిత్ర (తల్లిదండ్రులు, బాబాయి, పెద్దనాన్న, మేనమామలకు గుండె సమస్య ఉంటే)

హార్ట్‌ చెకప్‌ అత్యవసరం 
షుగర్‌ వ్యాధి ప్రభావం రక్తనాళాల మీద ఎక్కువ కాబట్టి గుండె ఆరోగ్యాన్ని పరీక్షించుకుంటూ ఉండాలి. మందులు క్రమం తప్పక వాడుతున్నా సంవత్సరానికోసారన్నా గుండె పరీక్షలు చేయించుకోవాలి. హార్ట్‌ చెకప్‌ గురించి కొందరికి ఏవో అపోహలుంటాయి. కానీ అందరు మధుమేహులకు అన్ని పరీక్షల అవసరం ఉండదు. ఈసీజీ, టుడి ఎకో మొదలైన సాధారణ పరీక్షల్లోనే గుండె ఆరోగ్యం తెలిసిపోతుంది. ఒకవేళ ఆ పరీక్షల్లో సమస్య ఉందని తెలిస్తేనే యాంజియోగ్రామ్‌ చేయించుకోవలసి ఉంటుంది. అలాగే ఫ్యామిలీ హిస్టరీలో గుండె సమస్య ఉండి వాళ్లు 45 ఏళ్లలోపు హార్ట్‌ ఎటాక్‌తో చనిపోతే లేదా 50 ఏళ్లపై వయసున్న దగ్గరి సీ్త్ర రక్తసంబంధీకులు గుండె సమస్యతో చనిపోయినా సంబంధిత మధుమేహులకు గుండె సమస్య వచ్చే అవకాశం పది రెట్లు ఎక్కువ. కాబట్టి అలాంటివాళ్లకు మరింత లోతైన పరీక్షలు అవసరమవుతాయి. అలాగే మధుమేహ వ్యాధి ప్రభావాన్ని పెంచే ధూమపానంలాంటి అలవాట్లుంటే వాళ్లకి సి.టి.యాంజియోగ్రామ్‌ చేయాల్సి ఉంటుంది. ఇలా కేవలం మధుమేహం ఉన్నవాళ్లకు, ఆ వ్యాధి ప్రభావాన్ని పెంచే ఇతరత్రా కారణాలున్నవాళ్లకు చేసే పరీక్షల్లో తేడాలుంటాయి. 
 
మధుమేహ ప్రభావాన్ని గుర్తించే పరీక్షలు
రక్తనాళాల మీద మధుమేహం ప్రభావం రెండు రకాలుగా ఉంటుంది. ఆ ప్రభావం చిన్న రక్తనాళాల మీదైతే మైక్రో వ్యాస్క్యులర్‌ అని, పెద్ద రక్తనాళాల మీదైతే మాక్రో వాస్క్యులర్‌ అని అంటారు. అయితే పెద్ద రక్తనాళాలకంటే చిన్న రక్తనాళాలే ముందుగా ఎఫెక్ట్‌ అవుతాయి. ఆ లక్షణాలను కొన్ని పరీక్షల ద్వారా తేలికగా కనిపెట్టొచ్చు. ఆ పరీక్షలు... 
ఫండోస్కోపీ: కళ్లల్లో ఉండే చిన్న రక్తనాళాలు మధుమేహ ప్రభావం వల్ల చిట్లుతాయి. కంటి వైద్యులు కళ్లను పరీక్షించినప్పుడు రక్తనాళాలు చిట్లి, రక్తం కంట్లోకి విస్తరించి కనిపిస్తుంది. ఫండస్‌ ఫొటోగ్రాఫ్స్‌ ద్వారా కంట్లో ఏర్పడే గడ్డలను కూడా కనిపెట్టొచ్చు. 
మైక్రాల్‌ టెస్ట్‌: మూత్రంలో ప్రొటీన్‌ లాస్‌ 
కనిపిస్తే మూత్రపిండాల్లోని రక్తనాళాల్లో సమస్య మొదలైందని అర్థం. ఈ పరీక్షను బట్టి శరీరంపై మధుమేహం ప్రభావాన్ని ప్రారంభ దశలోనే గుర్తించి మరింత నష్టం జరగకుండా చికిత్సతో నియంత్రించవచ్చు. 
కెరోటిడ్‌ అలా్ట్రసౌండ్‌: ఈ అలా్ట్రసౌండ్‌ ద్వారా మెడ దగ్గరుండే ప్రధాన రక్తనాళాన్ని, దాన్లో ప్రవహించే రక్తప్రవాహం ప్రెషర్‌ను పరీక్షించొచ్చు. 
 
గుండెకు చికిత్సలు ఇవే!
గుండె రక్తనాళాల్లో అడ్డంకులు ఉన్నవాళ్లందరికీ స్టెంట్స్‌, ఓపెన్‌ హార్ట్‌ సర్జరీలే ప్రత్యామ్నాయాలు కావు. రక్తనాళాల్లో ఉన్న అడ్డంకుల సంఖ్య, పూడుకుపోయిన రక్తనాళాల సంఖ్య, పూడిక శాతాల మీద చికిత్స ఆధారపడి ఉంటుంది. అంటే రక్తనాళం ఇరుకుగా తయారయిన శాతాన్ని బట్టి మందులు, స్టెంట్స్‌, సర్జరీ చికిత్సలను వైద్యులు ఎంచుకుంటారు. 50%, 50 నుంచి 70%, 70 అంతకంటే ఎక్కువ పూడికలుగా వర్గీకరించి అందుకు తగిన చికిత్సను ఎంచుకుంటారు. పూడిక 50% కంటే తక్కువ ఉంటే మందులతోనే సరిపెట్టవచ్చు. ఒకవేళ 50 నుంచి 70% మధ్యలో ఉంటే ఎఫ్‌.ఎఫ్.ఆర్‌ అనే రక్తప్రవాహ ప్రెషర్‌ని కొలిచే పరీక్ష చేసి, స్టెంట్‌ అవసరమా లేదా? అనేది నిర్ణయించి తగిన చికిత్స చేస్తారు. 70% ఉంటే స్టెంట్స్‌, అంతే శాతం పూడిక రెండు, మూడు రక్తనాళాల్లో ఉంటే సర్జరీకి వెళ్లక తప్పదు. అలాగే ఎడమ వైపున ఉండే ప్రధాన రక్తనాళం పూర్తిగా మూసుకుపోయినా ఓపెన్‌ హార్ట్‌ సర్జరీ ఒక్కటే పరిష్కారం. ఈ చికిత్సతోపాటు కొలస్టరాల్‌ తగ్గించే మందులు, రక్తం పలుచన చేసే మందులు కూడా మధుమేహులు జీవితాంతం వాడాల్సి ఉంటుంది. 
 
ఈ జాగ్రత్తలు తప్పనిసరి
మధుమేహుల్లో కొలస్ట్రా‌ల్‌తో కూడిన ‘అథిలోస్క్లిరోసి్‌స’తోపాటు రక్తం చిక్కబడి గడ్డలుగా అడ్డుపడే ‘థ్రోంబోసిస్‌’ అనే మరో ఇబ్బంది కూడా ఉంటుంది. అంటే రక్తనాళాల్లో కొలసా్ట్రల్‌ అడ్డుపడొచ్చు లేదా రక్తపు గడ్డలూ ఇరుక్కుపోవచ్చు. అయితే మధుమేహుల్లో చికిత్సకంటే తదనంతర కాంప్లికేషన్స్‌ ఎక్కువ కాబట్టి అసలు సమస్యే తలెత్తకుండా చూసుకోవాలి. ఇందుకోసం మధుమేహాన్ని మందులతో అదుపులో ఉంచుకోవటంతోపాటు ఇతరత్రా జాగ్రత్తలు పాటించాలి. అవేంటంటే... 
వైద్యులు సూచించిన ఆరోగ్య నియమాలు పాటించటం
ప్రతి 3 నెలలకూ షుగర్‌ టెస్ట్‌ చేయించుకోవటం
చక్కెర ఎక్కువగా ఉండే సాఫ్ట్‌డ్రింక్స్‌, స్వీట్లకు దూరంగా ఉండటం
క్రమబద్ధమైన జీవనశైలి అలవరుచుకోవటం
వ్యాయామం
కొలస్ట్రా‌ల్‌ మందులు వాడటం
టీనేజ్‌ వయసు నుంచి క్రమం తప్పక షుగర్‌ టెస్ట్‌ చేయించుకోవటం

పిల్లలో ప్రభావం 

పిల్లల్లో టైప్‌1 డయాబెటిస్‌ ఉంటుంది. అంటే వాళ్లలో ఇన్సులిన్‌ తక్కువగా ఉండొచ్చు లేదా అసలు ఉత్పత్తే లేకపోవచ్చు. ఈ పిల్లల్లో కళ్లు, మూత్రపిండాల్లోని చిన్న రక్తనాళాల్లో సమస్యలు ముందుగా తలెత్తుతాయి. ఇక పెద్ద రక్తనాళాల సమస్యలు 20-25 ఏళ్ల వయసు చేరుకునేవరకూ తలెత్తవు. కాబట్టి మధుమేహం ఉన్న పిల్లలకు కూడా క్రమం తప్పకుండా డాక్టర్‌ చెకప్‌ చేయిస్తూ ఉండాలి. టీనేజ్‌ దాటినప్పటి నుంచి హార్ట్‌ చెకప్‌ మొదలుపెట్టాలి. 
 
మందులతోనూ ముప్పే..
గుండె జబ్బుకు వాడే మందుల ప్రభావం వల్ల మధుమేహ సంబంధ ‘అథిరోస్క్లిరోసిస్‌’ వచ్చే అవకాశం ఉంటుంది. గుండెలోని ఒత్తిడి, హార్ట్‌ రేట్‌ తగ్గించటానికి, హార్ట్‌ ఫెయిల్‌ అయినవాళ్లకు వాడే బీటా బ్లాకర్స్‌ మందుల ప్రధాన దుష్ప్రభావం మధుమేహం పెరగటం. అలాగే హైపర్‌టెన్షన్‌ రోగులు వాడే డయూరిటిక్స్‌ వల్ల దీర్ఘకాలంలో మెటబాలిజంలో మార్పులొచ్చి షుగర్‌ పెరగొచ్చు. అలాగే కొలస్ట్రా‌ల్‌ను తగ్గించటానికి వాడే స్టాటిన్స్‌ వల్ల కూడా మధుమేహం వచ్చే అవకాశం ఉంటుంది. అయితే మందుల దుష్ప్రభావంతో తలెత్తే డయాబెటిస్‌ కంటే డయాబెటి్‌సకి మందులు వాడకపోవటం వల్లఆరోగ్యానికి జరిగే నష్టమే ఎక్కువ. కాబట్టి గుండెజబ్బు ఉన్నవాళ్లు కూడా క్రమంతప్పక మధుమేహ పరీక్షలు చేయించుకుంటూ ఒకవేళ షుగర్‌ కనిపిస్తే ఆ మందులు కూడా వాడాల్సి ఉంటుంది. 
 
డయాబెటిక్‌ కార్డియోమయోపతి 
మధుమేహ ప్రభావం వల్ల గుండె కండరం బలహీనపడే పరిస్థితి ‘డయాబెటిక్‌ కార్డియోమయోపతి’. ఇలా కండరం బలహీనపడ్డప్పుడు గుండెలో ఒత్తిడి పెరిగి ఆయాసం, గుండె దడ, కాళ్లలో వాపులు మొదలైన లక్షణాలు కనిపిస్తాయి. ఇలాంటప్పుడు కూడా సాధ్యమైనంత త్వరగా గుండెకు చికిత్స మొదలుపెట్టాలి. 
 
సైలెంట్‌ హార్ట్‌ ఎటాక్స్‌
మధుమేహం ప్రధాన లక్షణాలు దప్పిక, ఆకలి, అతిమూత్రం. అయితే ఈ లక్షణాలు కనిపించొచ్చు, కనిపించకపోవచ్చు. కనిపించినా కొందరు నిర్లక్ష్యం చేస్తారు. మధుమేహం ఉందని గ్రహించలేక వ్యాధి మరింత తీవ్రమయ్యే వరకూ వైద్యుల్ని కలవరు. ఈలోగా వ్యాధి ప్రభావం కారణంగా గుండెపోటు కూడా రావొచ్చు. ఈ గుండెపోటు లక్షణాలు అందరిలో కనిపించాలని లేదు. కొందరిలో కనిపించొచ్చు లేదా కనిపించకపోవచ్చు. అలా లక్షణాలు కనిపించకుండా వచ్చే గుండెపోటే ‘సైలెంట్‌ హార్ట్‌ ఎటాక్‌’. ఒకవేళ గుండెపోటు లక్షణాలతో వైద్యుల్ని కలవగలిగితే అప్పటికే మధుమేహం ఉందనే విషయం ఆ సందర్భంగా బయటపడొచ్చు. లక్షణాలు లేక వైద్యులను 
కలవకుండా ఉండిపోతే మధుమేహం వల్ల గుండెకు మరింత నష్టం జరగొచ్చు. 
 
వ్యాయామం ఎంత?
మధుమేహులు, మధుమేహంతోపాటు గుండెజబ్బు ఉన్నవాళ్లు రోజుకు కనీసం 30 నిమిషాల పాటు ఏకధాటిగా వ్యాయామం చేయాలి. ఆ వీలు లేనివాళ్లు 10 నిమిషాల చొప్పున రోజు మొత్తంలో మూడుసార్లు చేసినా ప్రయోజనం ఉంటుంది. ఇలా వారంలో ఐదుసార్లు, 45 నిమిషాల పాటు వ్యాయామం చేసేవాళ్లు వారంలో 3,4 రోజులు చేస్తే సరిపోతుంది. ఇక వాకింగ్‌ చేసేవాళ్లు చెమటలు పట్టేలా బ్రిస్క్‌ వాక్‌ చేయాలి. ట్రెడ్‌మిల్‌ చేసేవాళ్లైతే వ్యాయామానికి ‘ఏజ్‌ ప్రిడిక్టెడ్‌ మాగ్జిమమ్‌ హార్ట్‌రేట్‌’ అనే ఫార్ములాను ఉపయోగించాలి. హార్ట్‌రేట్‌ 220 నుంచి వయసును మైనస్‌ చేసి వచ్చిన సంఖ్యతో సమానమైన హార్ట్‌రేట్‌ వచ్చేవరకూ వ్యాయామం చేయొచ్చు. ఉదాహరణకు వయసు 30 అనుకుంటే 220 - 30 = 190 హార్ట్‌రేట్‌.. ఈ సంఖ్యను ట్రెడ్‌మిల్‌లో టార్గెట్‌గా సెట్‌ చేసుకుని దాన్లో 85% వరకూ 30 నిమిషాల పాటు వ్యాయామం చేయొచ్చు. ఇది సురక్షిత పద్థతి.