కొడుకు పుడితే డిప్రెషనే

28-11-2018: తల్లితండ్రులు మగ సంతానం కోసం ఎంతో ఆశగా ఎదురు చూస్తారు. కొడుకుని చూసుకుని మురిసిపోతుంటారు. అయితే వంశోద్ధారకుడు పుట్టాడని సంబరపడితే, ఆ తల్లులకు ఆరోగ్య సమస్యలు తప్పవని హెచ్చరిస్తున్నారు నిపుణులు. కూతురు పుట్టిన వారితో పోల్చుకుంటే కొడుకును ప్రసవించిన తల్లి డిప్రెషన్‌కు లోనయ్యే ప్రమాదం మూడు రెట్లు ఎక్కువగా ఉంటుందని కెంట్ యూనివర్సిటీ పరిశోధకులు చెబుతున్నారు. ప్రసవం తరువాత చాలామంది స్త్రీలలో మెంటల్ హెల్త్ కండిషన్‌లో మార్పు వస్తుందనీ, దానికి తోడు వీరిలో రోగనిరోధక శక్తి సన్నగిల్లి చాలా త్వరగా డిప్రెషన్‌కు లోనవుతారని వారు చెబుతున్నారు. ఇది కొడుకును ప్రసవించిన స్త్రీలలో ఎక్కువగా ఉంటుందన్న విషయం అధ్యయనంలో తేలింది. కొడుకును ప్రసవించిన మహిళలందరూ డిప్రెషన్‌ బారిన పడకపోయినా, చాలామందిలో ఈ పరిస్థితి తలెత్తవచ్చని వీరు స్పష్టం చేస్తున్నారు. కొడుకును కన్న తల్లుల్లో డిప్రెషన్‌ సమస్య ఎందుకు తలెత్తుతుందో తెలుసుకోవడానికి మరింత లోతుగా అధ్యయనం చేయాలని వారు చెబుతున్నారు.