ఫుడ్‌ అలర్జీతో డిప్రెషన్‌

17-08-2017: కొందరికి కొన్ని ఆహార పదార్థాలు అస్సలు పడవు. వాటిని తీసుకుంటే దురదలు, చర్మం ఎర్రబారడం, ముక్కు కారడం, తుమ్ములు వంటి సమస్యలను ఎదుర్కొంటారు. ముఖ్యంగా ఈ లక్షణాలు పిల్లల్లో ఎక్కువగా కనిపిస్తాయి. ఫుడ్‌ అలర్జీ కారణంగా ఈ సమస్యలతో పాటు పిల్లల్లో డిప్రెషన్‌ ఎక్కువయ్యే ప్రమాదం కూడా ఉందని అధ్యయనకారులు అంటున్నారు. నాలుగు సంవత్సరాల నుంచి పన్నెండు సంవత్సరాల లోపు 80 మంది పిల్లల మీద వీరు అధ్యయనం నిర్వహించారు. వీరిలో సగం మందికి ఫుడ్‌ అలర్జీ ఉంది. వీరిలో 20 శాతం మంది డిప్రెషన్‌కు లోనవుతున్న విషయాన్ని అధ్యయనకారులు గుర్తించారు. ఫుడ్‌ అలర్జీతో బాధపడే పిల్లలకు వైద్య సహాయం తప్పనిసరిగా అందించాల్సిందేననీ, ఏమాత్రం నిర్లక్ష్యం చేసినా వారు తీవ్రమైన డిప్రెషన్‌కి లోనయ్యే ప్రమాదం ఉందని వారు హెచ్చరిస్తున్నారు.