పార్కిన్సన్‌ను కాఫీ తగ్గించదట!

13-10-2017: మొన్నటి దాకా పార్కిన్సన్‌ను తగ్గించే గుణం కాఫీలోని కెఫైన్‌కి ఉందన్న సంగతి తెలిసిందే! ఈ విషయం ఐదు సంవత్సరాల క్రితం నిర్వహించిన పరిశోధనల్లో వెల్లడైంది. అయితే ఇది పూర్తిగా అవాస్తవమన్న విషయం ఇటీవల కెనడా యూనివర్శిటీ వారు నిర్వహించిన పరిశోధనల్లో తేలింది. ఈ యూనివర్శిటీకి చెందిన పరిశోధనాకారులు పార్కిన్సన్‌తో బాధపడుతున్న 225 మంది మీద కొన్ని నెలల పాటు అధ్యయనం నిర్వహించారు. వీరందరూ 60 సంవత్సరాలు పై బడిన వారే. వీరికి ప్రతిరోజూ 200 మిల్లీగ్రాము కెఫైన్‌ గుళికలను ఆరు నుంచి పద్దెనిమిది నెలల పాటు ఇచ్చారు. ఈ గుళికలు మూడు కప్పుల కాఫీకి సమానం. ప్రతిరోజూ ఉదయం, సాయంత్రం వీరికి వీటిని అందించారు. అనంతరం వీరిలో వ్యాధి తీవ్రతను పరిశీలించారు. ఇంత మోతాదులో కెఫైన్‌ తీసుకున్నా వీరిలో పార్కిన్సన్‌ తగ్గుముఖం పట్టడాన్ని వీరు గుర్తించలేదు. పార్కిన్సన్‌తో బాధపడేవారు కాఫీ తీసుకోవడం వలన ఎలాంటి ప్రయోజనం చేకూరదని వీరు స్పష్టం చేస్తున్నారు. కెఫైన్‌ వ్యాధి తీవ్రతను తగ్గిస్తు్ందన్న విషయాన్ని కూడా వీరు స్పష్టం చేయలేదు.