ఆ బియ్యంతో కాన్సర్‌ దూరం?

14-03-2018: కొన్ని రకాల ఆహారపదార్థాలను తీసుకోవడం ద్వారా కాన్సర్‌ కణాలు వ్యాప్తి చెందకుండా అడ్డుకోవచ్చన్న విషయం తెలిసిందే! అయితే భారతదేశంలో పండే ఓ రకం బియ్యాన్ని ఆహారంగా తీసుకోవడం వలన కాన్సర్‌ని దూరం చేసుకోవచ్చన్న విషయం ఇటీవల నిర్వహించిన పరిశోధనల్లో వెల్లడైంది. ఛత్తీస్‌గడ్‌లో పండించే లైచా అనే రకం బియ్యంలో కాన్సర్‌ని దూరం చేసే గుణం ఉందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. రాయ్‌పూర్‌లోని ఇందిరాగాంధీ కృషి విశ్వవిద్యాలయానికి చెందిన శాస్త్రవేత్తలు నిర్వహించిన పరిశోధనల్లో ఈ విషయం వెల్లడైంది. కాన్సర్‌ వ్యాధిగ్రస్తులు ఈ బియ్యాన్ని ఆహారంగా తీసుకోవడం వలన ఊపిరితిత్తులు, రొమ్ము కాన్సర్‌ను సమర్ధవంతంగా తగ్గించుకోవచ్చని పరిశోధకులు చెబుతున్నారు. ఈ క్రమంలో శరీరంలో మంచి కణాలకు ఎలాంటి హాని జరగదని వారు అంటున్నారు. ఈ రకం బియ్యాన్ని రోజుకు 200 గ్రాముల చొప్పున తీసుకుంటే కాన్సర్‌ కారణంగా ఎలాంటి ప్రమాదం సంభవించదని చెబుతున్నారు. దీని మీద ఇంకా పరిశోధనలు నిర్వహిస్తున్నట్టు వారు తెలిపారు.