బీట్రూట్‌'తో మెదడు పనితీరు బేష్!

09-08-2018: ఇంటా బయటా బాధ్యతలు సక్రమంగా నిర్వహించాలంటే మానసికారోగ్యంతో పాటు శారీరకారోగ్యం కూడా తప్పనిసరి. ఈ రెండింటినీ ఆరోగ్యంగా ఉంచుకోవడానికి ‍రోజులో కొద్దిసేపన్నా వ్యాయామం చేయడం తప్పనిసరి అంటున్నారు నిపుణులు. అయితే వ్యాయామం చేయటానికి ముందు ఓ గ్లాసు బీట్రూట్ రసం తాగి చూడమంటున్నారు అమెరికా పరిశోధకులు. వ్యాయామానికి ముందు బీట్రూట్‌ రసం తాగడం వలన  మెదడు భాగాలు ఆరోగ్యంగా ఉంటాయన్న విషయం వీరి అధ్యయనంలో వెల్లడైంది. బీట్రూట్‌లో లభించే 'నైట్రేట్‌'.. వ్యాయామం చేసేప్పుడు శరీరం త్వరగా అలసిపోకుండా ఉండడానికీ, మెదడుకు రక్త సరఫరా మెరుగుపరచడానికి తోడ్పడుతుందని, మెదడుకు మరింత ఎక్కువగా ఆక్సిజన్‌ సరఫరా అయ్యేలా చేస్తుందని వారు చెబుతున్నారు. బీట్రూట్‌ రసాన్ని క్రమం తప్పకుండా తాగడం వలన రక్తపోటు అదుపులో ఉంటుందన్న విషయం గత అధ్యయనాల్లోనూ వెల్లడైంది. ఇది కూడా మెదడుకు మేలు చేసేదే కనుక బీట్రూట్‌ను ఆహారంలో భాగంగా చేసుకోవటం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు.