ఎముకలకు నష్టం చేసే నిద్రలేమి!

ఆంధ్రజ్యోతి,19-04-2017:నిద్రలేమి అనేది పలు ఆరోగ్య సమస్యలకు కారణం అవుతుందన్న విషయం తెలిసిందే! ఇప్పుడు ఇదే ఎముకలకు నష్టం కలిగిస్తుందన్న విషయం అమెరికాలోని కలొరొడా యూనివర్శిటీ పరిశోధకులు నిర్వహించిన పరిశోధనలో వెల్లడైంది. ముఖ్యంగా రాత్రి వేళల్లో పనిచేసే ఉద్యోగులలో ఈ సమస్య ఎక్కువగా ఉండడాన్ని వీరు గుర్తించారు. సుమారు 50 మంది వ్యక్తుల నిద్ర సమయాలు, వారి ఆరోగ్య పరిస్థితిని అధ్యయనం చేశారు. వీరిలో 45 మంది 20నుంచి 27 సంవత్సరాల వయస్సు కలవారు కాగా, మిగతా ఐదుగురు 50 నుంచి 55 సంవత్సరాల వయస్సు ఉన్నా వారు.

వీరిలో 75 శాతం మంది రాత్రి షిఫ్టుల్లో పనిచేస్తున్న వారే! సుమారు మూడు వారాల పాటు వీరు తీసుకునే ఆహారం, నిద్రపోయే సమయాన్ని రికార్డు చేశారు. అదే సమయంలో వీరికి కొన్ని ఆరోగ్య పరీక్షలను కూడా నిర్వహించారు. మూడు వారాల అనంతరం వీరిలో 80 శాతం మందిలో ఎముకల క్షీణతను గమనించారు. దీనికి కారణం వీరి నిద్రలేమి అనే వీరు చెబుతున్నారు. వీరిలో ఎముకల క్షీణతకు నిద్రలేమే కారణమా? మరేదైనా ఉందా? అన్న విషయం మీద ఇంకా పరిశోధనలు నిర్వహించాల్సి ఉందని వారు అంటున్నారు. ఏది ఏమైనా రోజులో ఆరు నుంచి ఎనిమిది గంటల నిద్ర తప్పనిసరి అని, ఇంతకు మించి తగ్గితే ఆరోగ్య సమస్యలు తప్పవని వారు హెచ్చరిస్తున్నారు.