కాలంతా లాగేస్తోంది ఎందుకని?

18-08-2017:గత రెండు మాసాలుగా, వెన్నెముక కింది భాగం నుంచి, మోకాలి వెనుక వైపుగా, పాదాల దాకా లాగడంతో పాటు నొప్పిగానూ ఉంటోంది. ఆ భాగమంతా తిమ్మిరెక్కడం, సూదులతో పొడిచినట్లుగా నొప్పి, కాలి కండరం శక్తి కోల్పోవడం వంటి లక్షణాలు బాధిస్తున్నాయి. డాక్టర్‌ను సంప్రదిస్తే పెయిన్‌ కిల్లర్లు రాశారు. మాత్ర వేసుకున్న రోజున బాగానే ఉంటోంది. మరుసటి రోజు మళ్లీ అదే భాధ. ఈ సమస్య ఎందుకొస్తుంది? దీన్నుంచి సంపూర్తిగా బయటపడే మార్గమేమీ లేదా?

                                                                                                                                                                                    - ఎన్‌. సాయికృష్ణ, ఆదిలాబాద్‌
 
మీరు రాసిన లక్షణాలను బట్టి మీకు సయాటికా సమస్య ఉన్నట్లు స్పష్టమవుతోంది. వెన్నునుంచి పాదం దాకా వెళ్లే ఒక పొడవాటి నరాన్నే సయాటికా అంటారు. వెన్ను నుంచి ప్రారంభమయ్యే ఈ నరం ఎక్కడైనా నొక్కుకుపోయినప్పుడు వచ్చే నొప్పిని ’సయాటికా’ అంటారు. ఆస్టియోఆర్థరైటిస్‌ మూలంగా వెన్నుపూస అరిగిపోయినప్పుడు కూడా ఈ సమస్య వస్తుంది. ఈ సమస్య రావ డానికి ముఖ్యంగా...
 
కూర్చోవడంలో గానీ, నిలుచోవడంలో గానీ, బరువులు ఎత్తే సమయంలో గానీ సరియైున భంగిమలో లేకపోవడం ఈ సమస్య రావడానికి గల ఒక ప్రధాన కారణం. ఒకే భంగిమలో ఎక్కువ గంటలు కూర్చోవడం, తరుచూ దూర ప్రయాణాలు చేయడం కూడా సయాటికాకు దారి తీయవచ్చు.

నడుము లేదా పొత్తికడుపు భాగంలోని కండరాలు బలహీనంగా ఉండడం, ఎముకల్లో క్యాల్షియం సాంద్రత తగ్గిపోవడం వంటి కారణాలతో ఈ సయాటికా సమస్య వస్తుంది.

చికిత్సా మార్గాలు
ఏ రకమైన చికిత్సలు లేకుండానే కొందరికి ఈ సమస్య తగ్గిపోతుంది. అలా తగ్గకపోతే డాక్టర్లు పెయిన్‌ కిల్లర్లు, యాంటీ ఇన్‌ఫ్లమేటరీ మందులు, ఫిజియోథెరపీ లాంటివి సూచిస్తారు ఒకవేళ అప్పటికీ తగ్గకపోతే నడుము భాగంలో కొన్ని ఇంజెక్షన్లు సూచిస్తారు. అయినా ఫలితం లేకపోతే చివరగా సర్జరీ సూచిస్తారు. అయితే క్రమం తప్పకుండా రోజూ వ్యాయామం చేయడం ద్వారా ఈ సమస్యకు గురికాకుండానే కాపాడుకోవచ్చు.
                                                                                                                                                                       డాక్టర్‌. వి. ఎన్‌ మూర్తి, ఆర్థోపెడిక్‌ సర్జన్‌