కాళ్లల్లో ఈ వాపులేమిటి?

29-04-2018:నా వయసు 46 ఏళ్లు. కొద్దిరోజులుగా మూత్ర విసర్జనలో మంట వస్తోంది. స్థానిక డాక్టర్‌ను కలిస్తే మూత్రసంబంధమైన ఇన్‌ఫెక్షన్ల వల్ల ఇలా అవుతోందని మందులు రాశాడు. ఆ మందులు క్రమం తప్పకుండా వేసుకుంటున్నా, మంటలు తగ్గలేదు. అప్పుడప్పుడు జ్వరం కూడా వస్తోంది. ఇటీవల కొద్ది రోజులుగా కాళ్లల్లో వాపులు కూడా వచ్చాయి. నాకు హైపోథైరాయిడ్‌ తప్ప మరే సమస్యా లేదు. నాలో కనిపిస్తున్న ఈ లక్షణాన్నింటి వెనుక గల కారణమేమిటి; ఈ సమస్యకు సరైన పరిష్కారమేమిటి?

- సి. వేణు, రాజమండ్రి
 
ఎవరికైనా హైపోథైరాయిడ్‌ సమస్య ఉందీ అంటే, వారిలో హై- కొలెస్ట్రాల్‌ సమస్య కూడా ఉంటుంది. నిజానికి చాలా వరకు కొలెస్ట్రాల్‌ నిల్వలు పెరిగిపోవడమే హైపో థైరాయిడ్‌ సమస్య రావడానికి కారణం అవుతూ ఉంటుంది. ఇప్పుడు మీలో ఉన్న సమస్యల్లో చాలా వరకు ఈ హై- కొలెస్ట్రాల్‌ వల్ల తలెత్తినవే. శరీరంలో వాపు రావడాన్ని సెప్టిసీమియా అంటారు. మూత్రంలో మంట (ఇన్‌ఫెక్షన్‌) రావడానికి గల కారణాల్లో మధుమేహం ప్రధానమైనది. మీకు మధుమేహం ఉందా లేదా అన్న విషయాన్ని ప్రస్థావించలేదు. గతంలో మీకు మధుమేహం లేకపోయినా ఇటీవలి కాలంలో మొదలై ఉండవచ్చు కదా! ఒకసారి మధుమేహ పరీక్షలు చేయించుకోండి.
 
ఇదే కాకుండా, నరాలకు సబంధించిన డి.వి.టి (డీప్‌ వెయిన్‌ థ్రాంబోసిస్‌) సమస్య కూడా మీ ఆరోగ్య సమస్యలకు కారణం కావచ్చు. దీనికి కూడా కొలెస్ట్రాల్‌ నిల్వలు పెరగడం ఒక కారణంగా ఉంటుంది. పరీక్షల్లో మధుమేహం ఉన్నట్లు తేలితే వెంటనే దానికి సంబంధించిన జాగ్రత్తలు తీసుకోవాలి., సమస్య ప్రారంభ దశలోనే ఉంటే ఆహార నియమాలు, వ్యాయామాల వంటి జీవన శైలి మార్పులతో మదుమేహాన్ని నియత్రించుకోవచ్చు. ఒకవేళ ఎక్కువగా ఉంటే మందులు తప్పనిసరి అవుతాయి. మీకు డి.వి.టి సమస్య ఉంటే, యాంటీ కోఆగ్లిన్స్‌, మూత్రంలో ఇన్‌ఫెక్షన్లకు తగ్గడానికి యాంటీబయాటిక్స్‌ ఇస్తే ఈ సమస్య తొలగిపోతుంది. హైపోథైరాయిడ్‌ సమస్యకు థైరాక్సిన్‌ మాత్రల్ని రోజూ క్రమం తప్పకుండా వేసుకోవాలి. దీనికి తోడు కొవ్వు తక్కువగా ఉండే ఆహార పదార్థాలు తీసుకోవాలి. చేపలు తప్ప మిగతా మాంసాహారమేదీ తీసుకోకపోవడం మేలు. రోజూ వాకింగ్‌ చేయడం కూడా అంతే అవసరం. ఈ నియమాలు పాటిస్తే, మీ ఆరోగ్యం పూర్తిగా చక్కబడుతుంది.
 
 
- డాక్టర్‌ బి. కార్తిక్‌ బాబు,
జనరల్‌ ఫిజిషియన్‌,
రవి హెలియాస్‌ హాస్పిటల్‌, హైదరాబాద్‌