భుజం నొప్పి తగ్గే మార్గం లేదా?

ఆంధ్రజ్యోతి, 17-04-2017: నా వయసు 58 సంవత్సరాలు. కొంతకాలంగా భుజం నొప్పితో బాధపడుతున్నాను. మందులు వాడినా ఫలితం లేదు. నా భుజంనొప్పి తగ్గే మార్గం లేదా? - రాంచంద్రారెడ్డి, నిజామాబాద్‌
 
మీరు ఫ్రోజెన్‌ షోల్డర్‌ అనే సమస్యతో బాధపడుతున్నారు. ఇందులో జాయింట్‌ ఎముకలన్నీ నార్మల్‌గానే ఉంటాయి. క్యాప్సుల్‌, లిగమెంట్స్‌ చుట్టూ ఉండే ఎముకలు బిగుసుకుపోతాయి. దీనివల్ల తీవ్రమైన నొప్పి మొదలవుతుంది. 40 నుంచి 60 ఏళ్ల మధ్య ఉన్నవారిలో ఈ సమస్య ఎక్కువగా వస్తుంటుంది. డయాబెటిస్‌ రోగులకూ వచ్చే అవకాశం ఉంది. మీ సమస్య తీవ్రతను బట్టి చికిత్స అందించాల్సి ఉంటుంది.
 
నొప్పినివారణ మాత్రలు తీసుకోవడంతోపాటు ఫిజియోథెరపీ చేయడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. వీటివల్ల ఫలితం కనిపించకపోతే హైడ్రోడైలటేషన్‌ అనే చికిత్సను తీసుకోవచ్చు. ఇది అధునాతన చికిత్స. ఒక ఇంజక్షన్‌ సహాయంతో మందును భుజంలోకి ఇవ్వడం జరుగుతుంది. ఈ చికిత్స గత ఐదు నెలలుగా హైదరాబాద్‌లో అందుబాటులో ఉంది. ఆసుపత్రిలో అడ్మిట్‌ కానవసరంలేదు. 15 నిమిషాలలో ఇంటికి వెళ్లిపోవచ్చు. భుజం నొప్పితో బాధపడేవారికి ఇది ఒక వరమని చెప్పవచ్చు. ఒకవేళ ఫిజియోథెరపీ, హైడ్రోడైలటేషన్‌ చికిత్సలకు స్పందించకపోతే సర్జరీ చేయాల్సి వస్తుంది. - డాక్టర్‌ జి.విశ్వనాథ్‌, జనరల్‌ ఫిజీషియన్‌