కండరాలు పట్టేస్తున్నాయా?

ఆంధ్రజ్యోతి, 10-04-2017:నా వయసు 38. చూడటానికి బలిష్టంగానే ఉంటాను. కానీ, ఇటీవలి కాలంలో పిక్కలు, తొడ, భుజాలు, వీపు భాగాల్లో కండరాలు తరుచూ పట్టేస్తున్నాయి. ఒకటి రెండు నిమిషాల పాటు బొత్తిగా కదల్లేని పరిస్థితి ఏర్పడుతుంది. ఆ తర్వాత మళ్లీ మామూలైపోతుంది. కండరాలకు బలాన్నిచ్చే ప్రొటీన్‌ ఆహారం తీసుకుంటాను. రోజూ వ్యాయామం కూడా చేస్తాను.అయినా నాకీ సమస్య ఏమిటి? 
- ఎన్‌. శ్రీధర్‌, ఇబ్రహీం పట్నం.
 
కండరాలకు కావలసింది కేవలం ప్రొటీన్‌ ఒక్కటే కాదు. కాల్షియం కూడా అవసరం. నిజానికి, కండరాల నిర్మాణంలో కాల్షియం పాత్ర చాలా కీలకం. ప్రతి రోజూ క్రమం తప్పకుండా వ్యాయామం చేసే మీరు ప్రొటీన్‌ కోసం మాంసాహారమైతే తీసుకుంటున్నారు. కానీ, మీ సమస్యను బట్టి చూస్తే కాల్షియం తీసుకోవడంలో మీరు నిర్లక్ష్యం వహిస్తున్నారని తెలుస్తోంది. అందుకే ఇక నుంచైనా కాల్షియం ఎక్కువ గా లభించే గుడ్లకు, నువ్వులతో చేసిన ఆహార పదార్థాలకు తగినంత ప్రాధాన్యత ఇవ్వండి. శరీరంలోని జీవక్రియలన్నీ సజావుగా జరిగిపోవాలంటే శరీరంలో ఉండవలసిన నిష్పత్తిలో కాల్షియం ఉండి తీరాలి. ఒక సారి రక్త పరీక్ష చేయిస్తే, మీలో కాల్షియం నిల్వలు ఏ స్థాయిలో ఉన్నాయో తెలుస్తుంది. ఆ తర్వాత డెటీషియన్‌ ను గానీ, స్పోర్ట్‌ మెడిసిన్‌ స్పెషలి్‌స్టను గానీ సంప్రదిస్తే మీ సమస్య సమూలంగా తొలగిపోతుంది.
- డాక్టర్‌ జి. ప్రభాకర్‌, స్పోర్ట్‌ మెడిసిన్‌ స్పెషలిస్ట్‌