దీనికి శస్త్ర చికిత్స అవసరం లేనట్లే!

14-05-2018: వయసు పెరిగి కొద్దీ చాలా మందిలో ఎదురయ్యే సమస్య ఆస్టియో ఆర్థరైటిస్‌. మోకాళ్లలో ఉండే కీళ్లకు, కార్టిలేజ్‌కు మధ్య ఉండే సహజమైన పొర దెబ్బతినడం వల్ల రాపిడి ఎక్కువై నొప్పి అధికమవుతుంది. ఇది వంశపారంపర్యంగా వచ్చే అవకాశమూ ఉంది. ఇక గాయాల కారణంగా, అలాగే అధిక బరువు ఉండటం... ఇలాంటి కారణాలతో దీని బారిన పడుతూ ఉంటారు. అయితే చాలా మంది దీని కోసం శస్త్ర చికిత్సకు సిద్ధపడుతూ ఉంటారు. కానీ ఇది అవసరం లేకుండానే ఈ నొప్పి నుంచి పూర్తిగా ఉపశమనం పొందే అవకాశం ఉంది.

ఈ నాన్‌-సర్జికల్‌ విధానాన్నే ‘జెనిక్యులేట్‌ ఆర్టరీ ఎంబాలిజేషన్‌’ అని అంటారు. కేవలం ఇంజెక్షన్‌తో అతి చిన్న పదార్థాలను మోకాళ్లలో ఉండే రక్తనాళాల్లోకి ఎక్కిస్తారు. ఈ ప్రక్రియకు 45 నుంచి 90 నిమిషాల సమయం పడుతుంది. ఈ విధానం ద్వారా ఇప్పటివరకూ 13 మంది వ్యక్తుల్లో ఈ ఆస్టియోఆర్థరైటిస్‌ నొప్పి తీవ్రత తగ్గిందని వైద్యులు చెబుతున్నారు. ఈ విధానం వల్ల ఎటువంటి సైడ్‌ ఎఫెక్టులు ఉండవు కూడా.